Stalin Support To Girl: తమిళనాడు ముఖ్యమంత్రి స్టాలిన్.. ఆ రాష్ట్రానికి చెందిన ఓ దివ్యాంగురాలికి అండగా నిలిచారు. రెండేళ్ల క్రితం ప్రమాదానికి గురై ప్రస్తుతం నడవలేని స్థితిలో ఉన్న వాలీబాల్ క్రీడాకారిణి, విద్యార్థిని సింధుకు ఆర్థిక భరోసా కల్పించారు. నడవలేని స్థితిలో ఉన్నప్పటికీ 12వ తరగతి బోర్డు పరీక్షలను ఓర్పుతో రాస్తోంది సింధు.
సివిల్ సర్వీస్‌లో జాబ్ కొట్టాలని.. చెన్నైలోని కొడంబాక్కంలో నివసించే సాధేస్ కుమార్తె సింధు. 10వ తరగతి చదువుతున్న సమయంలో స్నేహితురాళ్లతో కలిసి ఆడుకుంటున్న సింధు.. ఒక్కసారిగా మూడో అంతస్తు నుంచి జారిపడింది. నడుముకు పెద్ద గాయం తగిలి నడవలేని స్థితికి చేరుకుంది. గత రెండేళ్లుగా ప్రభుత్వాసుపత్రిలో చికిత్స పొందుతున్న ఆమె పూర్తిగా కోలుకోకపోవడం వల్ల సింధు తల్లిదండ్రులు ఆమెను ఎత్తుకుంటూ పరీక్షా కేంద్రానికి తీసుకొస్తున్నారు. అంతేకాదు సింధుకు చిన్నప్పటి నుంచి ఆర్మీలో చేరి దేశానికి సేవ చేయాలనే లక్ష్యంతో ఉండేది. అయితే ఈ ప్రమాదం జరిగిన తర్వాత ఆర్మీలో చేరలేకపోయినా.. సివిల్ సర్వీస్‌లో ఉద్యోగం సాధించాలని లక్ష్యంగా పెట్టుకుంది.