అశ్లీల కంటెంట్‌ను వారంలోపు పూర్తిగా తొలగించాలని ట్విట్టర్‌ను జాతీయ మహిళా సంఘం(ఎన్సీడబ్ల్యూ) ఆదేశించింది. ఈ మేరకు ట్విట్టర్ మేనేజింగ్ డైరెక్టర్‌కు ఎన్సీడబ్ల్యూ ఛైర్మన్ రేఖా శర్మ లేఖ రాశారు. ఇందుకు సంబంధించి తీసుకున్న చర్యలను 10 రోజుల్లోగా తమకు వివరించాలని తెలిపారు. ఇదే విషయమై.. దర్యాప్తు చేపట్టి, చట్టప్రకారం తగిన చర్యలు తీసుకోవాలని దిల్లీ పోలీస్ కమిషనర్‌కూ ఆమె లేఖ రాశారు.
"ట్విట్టర్లో అశ్లీల కంటెంట్ వ్యవహారాన్ని ఎన్సీడబ్ల్యూ సుమోటోగా తీసుకుంది. ట్విట్టర్లో ఇలాంటి వాటిని గుర్తించి చర్యలు తీసుకోవాలని ఆ సంస్థ మేనేజింగ్ డైరెక్టర్‌కు ఎన్సీడబ్ల్యూ ఛైర్మన్ రేఖా శర్మ లేఖ రాశారు. అశ్లీల కంటెంట్‌ను షేర్ చేసే ట్విట్టర్ ఖాతాల వివరాలను ఆ సంస్థ దృష్టికి ఎన్సీడబ్ల్యూ తీసుకువెళ్లింది. వాటిని వారంలోగా తొలగించాలని ఆదేశించింది. ఇందుకు సంబంధించి తీసుకున్న చర్యలు పదిరోజుల్లోగా వివరించాలని తెలిపింది.
- ఎన్సీడబ్ల్యూ
అంతకుముందు ఇదే విషయంపై అందిన ఫిర్యాదును ట్విట్టర్ దృష్టికి తీసుకువెళ్లినప్పటికీ ఆ సంస్థ ఎలాంటి చర్యలు చేపట్టలేదని ఎన్సీడబ్ల్యూ తెలిపింది. అలాంటి కంటెంట్‌ను నిషేధించకుండా ఉంచడం ద్వారా.. భారత చట్టాలనే కాకుండా, తమ సంస్థ విధానాలను కూడా ట్విట్టర్ ఉల్లంఘించిందని విమర్శించింది.
చిన్నారులపై లైంగిక వేధింపుల వీడియోను పోస్ట్ చేసేందుకు అనుమతించిందన్న అభియోగాలతో దిల్లీ పోలీసులు.. ట్విట్టర్‌పై కేసు నమోదు చేసిన మరుసటి రోజే ఎన్సీడబ్ల్యూ ఈ చర్యలు చేపట్టటం గమనార్హం. జాతీయ బాలల హక్కుల కమిషన్ ఇచ్చిన ఫిర్యాదు మేరకు దిల్లీ పోలీసులు ట్విట్టర్‌పై ఈ ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. డార్క్ వెబ్‌కు సంబంధించి ఓ టూల్‌కిట్ కూడా ట్విట్టర్లో ఉన్నట్లు మే 29 తేదీనే దిల్లీ పోలీసులకు రాసిన లేఖలో జాతీయ బాలల హక్కుల కమిషన్ పేర్కొంది. ఈ అంశంపై చర్యలు తీసుకోవాలని తెలిపింది.
ఇదీ చూడండి:'ఖాతాల నిలిపివేతపై ట్విట్టర్ వివరణ ఇవ్వాలి'
ఇదీ చూడండి:ట్విట్టర్‌కు మరిన్ని చిక్కులు- ఎండీపై కేసు