IMD KERALA MONSOON: భారతదేశ వర్షాధార ఆర్థిక వ్యవస్థకు జీవనరేఖగా భావించే నైరుతి రుతుపవనాలు సాధారణం కంటే ముందుగానే దేశాన్ని పలకరించనున్నాయి. మే 27వ తేదీ లోపు నైరుతి రుతుపవనాలు కేరళ తీరాన్ని తాకుతాయని భారత వాతావరణ శాఖ ప్రకటించింది. సాధారణంగా జూన్ 1న రుతుపవనాలు కేరళకు చేరుకుంటాయి. ఈ ఏడాది మాత్రం.. అంతకు నాలుగు రోజులు ముందుగానే ఇవి వచ్చే అవకాశం ఉందని వాతావరణ శాఖ ప్రకటించడం గమనార్హం.
ఇక, తెలుగు రాష్ట్రాలను సైతం వర్షాలు ముందుగానే పలకరించనున్నాయి. అండమాన్, నికోబార్ దీవుల్లో ఈ నెల 15న ఈ సీజన్ తొలి వర్షాలు కురవొచ్చని భారత వాతావరణ విభాగం(ఐఎండీ) గురువారం తెలిపింది. మే 15 కల్లా నైరుతి రుతుపవనాలు దక్షిణ అండమాన్ సముద్ర ప్రాంతం, దాన్ని ఆనుకొని ఉన్న ఆగ్నేయ బంగాళాఖాతంలోకి ప్రవేశించే అవకాశాలున్నాయని ఐఎండీ ఓ ప్రకటనలో పేర్కొంది.
దీర్ఘకాల సగటులో 96 నుంచి 104 శాతం వరకు వర్షపాతం నమోదుకావచ్చని ఐఎండీ తెలిపింది. ఉత్తర భారతం, మధ్య భారతం, హిమాలయాలు సహా ఈశాన్య భారత్‌లోని కొన్ని ప్రాంతాల్లో సాధారణం లేదా సాధారణం కంటే ఎక్కువ వర్షపాతం నమోదుకావచ్చని వెల్లడించింది. ఈశాన్య రాష్ట్రాల్లోని అనేక ప్రాంతాలు సహా వాయువ్య, దక్షిణ భారత్‌లో సాధారణం కంటే తక్కువ వర్షం కురుస్తుందని వెల్లడించింది. దేశవ్యాప్తంగా ఎండలు మండిపోతున్న నేపథ్యంలో రుతుపవనాల రాకపై తాజా కబురు ప్రజలకు ఉపశమనాన్ని కలిగిస్తోంది.