Monsoon starting in Kerala 2023 : నైరుతి రుతుపవనాలు ఈ ఏడాది కేరళలోకి కొంచెం ఆలస్యంగా ప్రవేశిస్తాయని భారత వాతావరణ శాఖ(ఐఎండీ) తెలిపింది. జూన్ 4వ తేదీకి నైరుతి రుతుపవనాలు కేరళలోకి ప్రవేశించే అవకాశం ఉందని వెల్లడించింది. 'ఈ ఏడాది కేరళలోకి నైరుతి రుతుపవనాలు కాస్త ఆలస్యంగా ప్రవేశించే అవకాశం ఉంది. జూన్ 4నాటికి కేరళలో రుతుపవనాలు ప్రవేశిస్తాయి.' అని ఐఎండీ పేర్కొంది.
సాధారణంగా ఏటా జూన్ 1న కేరళలోకి రుతుపవనాలు ప్రవేశిస్తాయి. ఈ ఏడాది మాత్రం కాస్త ఆలస్యం అయ్యే అవకాశం ఉంది. 2022లో మే 29న, 2021లో జూన్ 3న, 2020లో జూన్ 1న కేరళలో నైరుతి రుతుపవనాలు ప్రవేశించాయి. భారత్లోకి భూభాగంపై తొలుత కేరళలో ప్రవేశిస్తాయి. నైరుతి రుతుపవనాల రాకతో వర్షాలు పడే అవకాశాలు ఉంటాయి. అందుకే నైరుతి రుతుపవనాల రాకకోసం రైతులు ఆశగా ఎదరుచూస్తుంటారు.
ఐఎండీ అంచనా..
IMD Rain Forecast 2023 : 2023లో నైరుతి రుతుపవనాల కారణంగా సాధారణ వర్షపాతం నమోదవుతుందని భారత వాతావరణ విభాగం- ఐఎండీ అంచనా వేసింది. హిందూ మహాసముద్ర ద్విధ్రువ, ఉత్తర అర్ధగోళంలోని పరిస్థితుల కారణంగా ఎల్‌నినో ఏర్పడే అవకాశం ఉందని తెలిపింది. సీజన్ ద్వితీయార్థంలో ఈ ప్రభావం కనిపించవచ్చని వెల్లడించింది. ఈ ఏడాది ఏప్రిల్లో భారత వాతావరణ శాఖ ఈ వివరాలను తెలియజేసింది. ఈ ఏడాది లోటు వర్షపాతం ఉంటుందని, కరవు ఏర్పడే అవకాశాలు కూడా ఉన్నాయని ప్రైవేటు వాతావరణ సంస్థ అయిన స్కైమెట్ వెల్లడించిన మరుసటి రోజే ఐఎండీ ఈ మేరకు ప్రకటన చేసింది.