IIT Delhi FCRA registration: ఐఐటీ దిల్లీ, జామియా మిలియా ఇస్లామియా, ఇండియన్ మెడికల్ అసోసియేషన్, నెహ్రూ మెమొరియల్ మ్యూజియం అండ్ లైబ్రరీ సహా సుమారు ఆరువేల సంస్థల ఎఫ్ఆర్సీఏ లైసెన్స్ గడువు ముగిసింది. ఎఫ్ఆర్సీఏ లైసెన్స్ పునరుద్ధరణ కోసం ఆయా సంస్థలు దరఖాస్తు చేసుకోకపోవటం వల్లనో లేదా కేంద్ర హోంశాఖ వాటి దరఖాస్తును తిరస్కరించిన కారణంగానో.. ఆరువేల సంస్థల లైసెన్స్ గడువు ముగిసినట్లు అధికారులు వెల్లడించారు.
FCRA registrations expired
స్వచ్ఛంద సంస్థలు విదేశాల నుంచి విరాళాలు పొందేందుకు ఎఫ్ఆర్సీఏ లైసెన్స్ తప్పనిసరి. ఫారిన్ కంట్రిబ్యూషన్ రెగ్యులేషన్ యాక్ట్(ఎఫ్ఆర్సీఏ) అధికారిక వెబ్‌సైట్ ప్రకారం ఇందిరాగాంధీ సెంటర్ ఫర్ ఆర్ట్స్, ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్, లాల్ బహదూర్ శాస్త్రి మెమొరియల్ ఫౌండేషన్, ఆక్స్‌ఫామ్ ఇండియా సహా ఆరు వేల సంస్థల లైసెన్స్ ముగిసింది.
శుక్రవారం వరకూ దేశవ్యాప్తంగా ఎఫ్ఆర్సీఏ లైసెన్స్ ఉన్న స్వచ్ఛంద సంస్థల సంఖ్య 22 వేల 762గా ఉండగా ఇవాళ ఆ సంఖ్య 16వేల 829కి దిగివచ్చింది. 2020 సెప్టెంబర్ 30 నుంచి 2021 డిసెంబర్ 31 మధ్య ఎఫ్సీఆర్ఏ రిజిస్ట్రేషన్ పునరుద్ధరణ కోసం 12,989 సంస్థలు దరఖాస్తు చేసుకున్నాయని కేంద్ర హోంశాఖ తెలిపింది. ఇందులో 179 సంస్థల దరఖాస్తులను తిరస్కరించినట్లు వెల్లడించింది. మిగిలిన దరఖాస్తులు పరిశీలనలో ఉన్నాయని పేర్కొంది.
ఇదీ చదవండి:వరుసగా ఆరో నెలా రూ.లక్ష కోట్లు దాటిన జీఎస్టీ వసూళ్లు