Illegal transportation of excavators to Africa : భారీ వాహనాలను ఓడల్లో ఆఫ్రికా దేశాలకు తరలించి సొమ్ము చేసుకుంటున్న ముఠాల బాగోతాలు తెలంగాణలో వెలుగులోకి వస్తున్నాయి. ఫైనాన్స్ సంస్థలు, బ్యాంకుల్లో రుణాలు తీసుకుని ఎక్స్‌కవేటర్ వంటి భారీ వాహనాలను కొనుగోలు చేసి మోసగాళ్లు వాటిని ఓడల్లో విదేశాలకు తీసుకెళ్లి రెండింతల లాభాలకు అమ్ముకుంటున్న ఉదంతాలు ఒక్కొక్కటిగా బయటపడుతున్నాయి. ఈ చీకటిదందా వెనక భారీ నెట్‌వర్క్ ఉన్నట్లు సమాచారం. గడిచిన రెండేళ్లలో తెలంగాణ నుంచి 500 వరకు భారీ వాహనాలు ఎగుమతి అయినట్లు తెలుస్తోంది.
ఈ దందా విలువ రూ.200-300 కోట్ల వరకు ఉంటుందనేది అంచనా. ఒక్క తెలంగాణలోనే కాకుండా దేశవ్యాప్తంగా ఇటువంటి మోసాలు చోటుచేసుకున్నాయనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఓ ఫైనాన్స్ సంస్థ ఇచ్చిన ఫిర్యాదుతో హైదరాబాద్ పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. విచారణలో నిజానిజాలు కొలిక్కివస్తే ఫెమా ఉల్లంఘన, మనీ ల్యాండరింగ్ వంటి అంశాలు బహిర్గతమయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి.
ఆపరేటర్లను ఎంచుకునేందుకు.. బ్రోకర్ వ్యవస్థ:మనదేశం నుంచి ఆఫ్రికా దేశాలకు భారీ వాహనాలను తరలించే ముఠాలు ప్రత్యేక నెట్‌వర్క్‌ను ఏర్పాటు చేసుకున్నాయి. గ్రామాల్లో ఎక్స్‌కవేటర్, జేసీబీ వంటి భారీ వాహనాలు నడిపే ఆపరేటర్లను ఎంచుకొని వారి సిబిల్ స్కోర్లు కనిపెట్టేందుకు ప్రత్యేకంగా బ్రోకర్లను ఏర్పాటుచేసుకున్నారు. ఒకవేళ ఆపరేటర్ల సిబిల్ స్కోర్ బాగుంటే వారికి.. లేనిపోని మాయమాటలు చెప్పి ఆశచూపి ముగ్గులోకి దించుతున్నారు.
తమకు పెద్ద కాంట్రాక్టు దక్కడంతో ఎక్స్‌కవేటర్ కొనదలుచుకున్నామని.. అయితే తమ సిబిల్ స్కోర్ తక్కువగా ఉండటంతో రుణం రావడం లేదని.. మీ పేరుతో ఫైనాన్స్‌లో వాహనం కొంటామని చెబుతారు. నాలుగైదు ఈఎంఐల మొత్తాన్ని ముందుగానే ఇస్తామంటూ.. వాహనాన్ని మీపేరుపైనే రిజిస్ట్రేషన్ చేస్తామని గాలమేస్తారు. వాటిని నిజమనుకున్న ఆపరేటర్లు ఎలాగూ వాహనం తమ పేరుతోనే ఉండటంతోపాటు.. ఈఎంఐల పేరిట రూ.4-5 లక్షలు ముందుగానే చేతికొస్తున్నాయనే నమ్మకంతో అందుకు ఒప్పుకుంటున్నారు.
వారిని ముఠాలు ఫైనాన్స్ సంస్థల, బ్యాంకుల వద్దకు తీసుకెళ్తున్నాయి. అక్కడ అడిగే ప్రశ్నలకు సంబంధించి ముందుగానే ఆపరేటర్లను సిద్ధం చేసి.. శిక్షణ ఇస్తుండటం గమనార్హం. అలా బ్యాకింగ్ సంస్థలకు అనుమానం రాకుండా రుణాలు పొందుతున్నారు.