Illegal Soil Excavation : విజయవాడ, గన్నవరం, జి.కొండూరు మండలాల పరిధిలో ఇప్పటికీ అనధికారికంగా పది క్వారీలు నడుస్తున్నాయి. దాదాపు 200 ఎకరాల్లో మట్టి తవ్వకాలు చేస్తున్నారు. పగలే కాదు రాత్రిపూట కూడా లైట్ల వెలుతురులో తవ్వకాలు చేస్తున్నారు. స్థానికులు అడ్డుకునే ప్రయత్నం చేస్తున్నారు. అధికారులకు సమాచారం ఇస్తున్నారు. వారు ఖాతరు చేయడం లేదు. అక్రమ క్వారీయింగ్ వెనుక నేతలే ఉండటంతో ఎవరూ అడ్డుకునేందుకు ముందుకు రావడం లేదు. ప్రభుత్వ భూములు, ఎస్సైన్‌మెంట్ భూములు, కొండ పోరంబోకు భూముల్లో ఇష్టానుసారం తవ్వకాలు జరుపుతున్నారు.
ప్రశ్నిస్తే దౌర్జన్యమే : కొత్తూరు తాడేపల్లికి చెందిన రైతు వేముల కొండ నాగరాజు తనకున్న 5 ఎకరాల్లో పోలవరం కాలువకు భూసేకరణకు పోగా మిగిలిన ఎకరంలో సేద్యం చేస్తున్నారు. దాని పక్కనే ఉన్న ఎస్సైన్‌మెంట్ భూముల్లో గత కొన్ని రోజులుగా అక్రమార్కులు మట్టి తవ్వకాలు జరుపుతున్నారు. అయినా మనకెందుకులే అని మౌనంగా ఉన్నారు. గురువారం ఉదయం నుంచి తన పొలాన్ని ఆనుకుని 10 మీటర్ల వరకు తవ్వకాలు జరుపుతున్నారు. తన పొలానికి ఇబ్బందులు ఎదరవుతాయని ప్రశ్నించారు.
కేశవరంలో గ్రావెల్ రగడ-చల్లారని ఎర్రమట్టి తవ్వకాల చిచ్చు
దీంతో అక్రమార్కులు నాగరాజుపై దౌర్జన్యానికి దిగారు. విషయాన్ని గ్రామానికి చెందిన తెలుగుదేశం పార్టీ కార్యకర్త మెండెం జమలయ్యకు వివరించి సాయం కోరారు. గ్రామస్థులు కొంతమంది కలిసి అక్రమ తవ్వకాలు అడ్డుకునే ప్రయత్నం చేశారు. డయల్ 100కు సమాచారం ఇచ్చారు. హుటాహుటిన వాహనంలో ఏఏస్ఐ స్వామి. మరో కానిస్టేబుల్ వచ్చారు. లారీలను నిలుపుదల చేసిన గ్రామస్థులను అక్రమ తవ్వకందారులు బెదిరించి లారీలను తీసుకెళ్లే ప్రయత్నం చేశారు. పోలీసులు రాకను గమనించి వారి ముందే మట్టిని ఎక్కడికక్కడ పోసి లారీలను తిప్పుకుని వెళ్లారు. ఆపాలని చేసినా ప్రయత్నం ఫలించలేదు. ఏం చేసేది లేక గ్రామస్థులు, పోలీసులు తిరుగుముఖం పట్టారు.