తెలంగాణ

telangana

ETV Bharat / bharat

'గాలి' బళ్లారిలో ఉంటే సాక్షులకు ముప్పు

అక్రమ మైనింగ్​ కేసులో ప్రధాన ముద్దాయిగా ఉన్న గాలి జనార్దన్​రెడ్డి బెయిల్‌ షరతులను సడలిస్తే ఆయన బళ్లారిలో సాక్షులకు పెను ప్రమాదంగా మారతారని సీబీఐ సుప్రీంకోర్టుకు నివేదించింది. బెయిల్​ పొందేందుకు జడ్జిలకు లంచం ఇవ్వజూపారని పేర్కొంది. అందుకు అంగీకరించని ఒక జడ్జి అనుమానాస్పద స్థితిలో చనిపోయారని ధర్మానాసనానికి వివరించింది.

Gali Janardhan reddy
గాలి జనార్దన్​ రెడ్డి

By

Published : Aug 14, 2021, 7:09 AM IST

అక్రమ మైనింగ్‌ కేసులో ప్రధాన నిందితుడైన గాలి జనార్దన్‌రెడ్డి బెయిల్‌ పొందేందుకు జడ్జిలకు రూ.40 కోట్లు లంచం ఇవ్వజూపారనీ, లంచం తీసుకోవడానికి అంగీకరించని ఒక జడ్జి అనుమానాస్పద స్థితిలో మరణించారని కేంద్ర దర్యాప్తు సంస్థ (సీబీఐ) సుప్రీంకోర్టుకు నివేదించింది. బెయిల్‌ షరతులను సడలిస్తే ఆయన బళ్లారిలో సాక్షులకు పెను ప్రమాదంగా మారతారని ఆందోళన వ్యక్తం చేసింది. అందువల్ల ఆ వెసులుబాటు ఇవ్వవద్దని విజ్ఞప్తి చేసింది.

బెయిల్‌ షరతులు సడలింపు కోరుతూ గాలి జనార్దన్‌రెడ్డి దాఖలు చేసిన పిటిషన్‌పై రెండోరోజు శుక్రవారమూ సుప్రీంకోర్టులో విచారణ కొనసాగింది. జస్టిస్‌ వినీత్‌ శరణ్‌, జస్టిస్‌ దినేష్‌ మహేశ్వరిలతో కూడిన ద్విసభ్య ధర్మాసనం ఎదుట తొలుత గాలి తరఫు సీనియర్‌ న్యాయవాది ముకుల్‌ రోహత్గీ వాదనలు వినిపించారు. సీబీఐ తరఫున అదనపు సొలిసిటర్‌జనరల్‌ మాధవి దివాన్‌ వార్తా పత్రికల కథనాలను సమర్పించడంపై అభ్యంతరం వ్యక్తం చేశారు. రికార్డుల్లో లేనప్పుడు మీరు పత్రిక కథనాలను సమర్పించకూడదని ధర్మాసనం వ్యాఖ్యానించింది.

మాధవి స్పందిస్తూ 'వాటి సమర్పణకు నేను అనుమతి తీసుకుంటాను. గాలి జనార్దన్‌రెడ్డి బెయిల్‌ను పలుమార్లు కోర్టు తిరస్కరించింది. బళ్లారి, కడప, అనంతపురం వెళ్లవద్దనే షరతులతోనే రెడ్డికి బెయిల్‌ మంజూరు చేశారు. అవేమీ తీవ్రమైనవి కావు. జనార్దన్‌రెడ్డి బెయిల్‌ కోసం సీబీఐ ప్రత్యేక కోర్టు జడ్జి నాగమారుతీశర్మకు రూ.40 కోట్లు లంచం ఇవ్వజూపారు. మరో జడ్జి ప్రభాకర్‌రావు ఈ కేసులో నిందితుడిగా ఉన్నారు. అది క్యాష్‌ ఫర్‌ బెయిల్‌గా బయటకు వచ్చింది' అని విన్నవించారు. రికార్డుల్లో ఈ అంశాలు లేవంటూ ముకుల్‌ రోహత్గీ అభ్యంతరం వ్యక్తం చేశారు. బెయిల్‌ షరతుల సడలింపు విషయంలో ఇది కీలకమని మాధవి అన్నారు. గాలి తరఫు సీనియర్‌ న్యాయవాది రంజిత్‌ కుమార్‌ స్పందిస్తూ క్యాష్‌ ఫర్‌ బెయిల్‌ కేసులో జనార్దన్‌రెడ్డి అసలు నిందితుడే కాదన్నారు. నిందితుడు కాకపోయినా ఆ అంశంలో లబ్ధి పొందేది ఆయనేనని మాధవి బదులిచ్చారు. జస్టిస్‌ వినీత్‌ శరణ్‌ జోక్యం చేసుకొని తాము బెయిల్‌ పిటిషన్‌ వినడం లేదని, 2015లో ఆయన బెయిల్‌ పొందాక ఇప్పటి వరకు ఏంజరిగిందో అది మాత్రమే చెప్పాలని మాధవికి సూచించారు.

జస్టిస్‌ దినేష్‌ మహేశ్వరి స్పందిస్తూ 'కొన్ని షరతులతో కోర్టు బెయిలిచ్చింది. షరతుల సడలింపు కోరుతూ జనార్దన్‌రెడ్డి గతంలో సుప్రీంకోర్టును ఆశ్రయిస్తే మేం జోక్యం చేసుకోలేమని నాడు కోర్టు తెలిపింది. కానీ ఇప్పటికే ఆరేళ్లు గడిచినందున ఆయనను స్వస్థలానికి వెళ్లేందుకు అనుమతించాలని వారు కోరుతున్నారు. కాబట్టి బెయిల్‌ షరతుల సడలింపునకు సంబంధించిన అంశాలే చెప్పండి'అని మాధవి దివాన్‌కు సూచించారు. వాదనలు విన్న ధర్మాసనం విచారణను సోమవారానికి వాయిదా వేసింది. ఆ రోజు 10నిమిషాల్లో వాదనలు ముగించాలని ఆదేశించింది.

ఇదీ చూడండి:పంజాబ్‌లో సిద్ధూ రాజకీయ కేళి- సీఎం పదవి కోసమేనా?

ABOUT THE AUTHOR

...view details