తెలంగాణ

telangana

ETV Bharat / bharat

'ఆ విషయం వారితోనే తేల్చుకుంటా!'.. ఈడీ విచారణకు ఝార్ఖండ్ సీఎం - mining lease in jharkhand

అక్రమ మైనింగ్​కు సంబంధించిన మనీలాండరింగ్ కేసులో ఝార్ఖండ్ ముఖ్యమంత్రి హేమంత్ సోరెన్ ఈడీ విచారణకు హజరయ్యారు. తాను విపక్షాల కుట్రలకు బాధితుడిగా మారినట్లు.. విచారణకు వెళ్లే ముందు సోరెన్ పేర్కొన్నారు.

CM SOREN ED
CM SOREN ED

By

Published : Nov 17, 2022, 1:05 PM IST

గనుల లీజు విషయంలో అక్రమాలు జరిగాయన్న కేసులో ఝార్ఖండ్ సీఎం హేమంత్ సోరెన్ ఎన్​ఫోర్స్​మెంట్ డైరెక్టరేట్(ఈడీ) ముందు హాజరయ్యారు. రాంచీలోని కార్యాలయంలో ఈడీ అధికారులు.. సొరెన్​ను ప్రశ్నిస్తున్నారు. మైనింగ్ కేసులో మనీలాండరింగ్ ఆరోపణలపై ఈడీ విచారణ జరుపుతోంది. ఈ నేపథ్యంలో.. దర్యాప్తునకు హాజరుకావాలని ఇదివరకే సోరెన్​కు నోటీసులు జారీ చేసింది.

మైనింగ్ స్కామ్ కేసులో రూ.వెయ్యి కోట్ల మేర మనీలాండరింగ్ జరిగినట్లు ఈడీ ఆరోపిస్తుండగా.. వీటిని సోరెన్ ఖండించారు. ఈడీ కార్యాలయానికి వెళ్లే ముందు మీడియాతో మాట్లాడిన ఆయన.. విపక్షాలు చేస్తున్న కుట్రలకు తాను బాధితుడిగా మారానంటూ ఆరోపించారు. సమగ్రంగా విచారణ జరిపిన తర్వాతే.. దర్యాప్తు సంస్థలు ఆరోపణలు చేయాలని అన్నారు. 'ఆరోపణలేవీ నిజాలు అని అనిపించడం లేదు. గనులు, ఖనిజాలకు సంబంధించి వార్షిక రాబడి కూడా రూ.వెయ్యి కోట్లు ఉండదు. అలాంటిది.. రూ.వెయ్యి కోట్ల మనీలాండరింగ్ జరిగిందని ఎలా నిర్ధరణకు వచ్చారో వారి నుంచి తెలుసుకోవాల్సి ఉంది' అని సోరెన్ పేర్కొన్నారు.

సీఎం నివాసం ముందు జేఎంఎం పార్టీ కార్యకర్తలు

మరోవైపు, సోరెన్​కు మద్దతుగా ఆయన అనుచరులు, పార్టీ కార్యకర్తలు పెద్ద ఎత్తున సీఎం నివాసం వద్దకు చేరుకున్నారు. సీఎంకు అనుకూలంగా నినాదాలు చేశారు. ఈడీ విచారణకు సీఎం హాజరవుతున్న నేపథ్యంలో అన్ని భద్రతా పరమైన ఏర్పాట్లు చేసినట్లు అధికారులు చెప్పారు. పెద్ద సంఖ్యలో బలగాలను మోహరించినట్లు తెలిపారు.

ABOUT THE AUTHOR

...view details