IITM scientist interview: భారతదేశంలో గత రెండు దశాబ్దాల్లో ఉష్ణోగ్రతల తీవ్రత పెరిగింది. గత మార్చిలో గరిష్ఠంగా నమోదయ్యాయి. ఇదే పరిస్థితి ఏప్రిల్‌లోనూ కొనసాగింది. 1986 నుంచి 2015 వరకూ సగటు ఉష్ణోగ్రతల్లో దశాబ్దానికి 0.15 డిగ్రీల సెల్సియస్ పెరుగుదల ఉంది. తరచూ అత్యధిక ఉష్ణోగ్రతలు నమోదవడం, వడగాల్పులు వీయడం, వాటి తీవ్రత ఎక్కువ రోజులు ఉండటం సాధారణమైంది. ఈ ఉద్ధృతి భవిష్యత్తులోనూ పెరిగే అవకాశముంది. కాబట్టి సమస్య తీవ్రతపై సత్వర చర్యలు చేపట్టాలని భారత ఉష్ణమండల వాతావరణ సంస్థ(ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ట్రాపికల్ మెటరాలజీ) ప్రధాన శాస్త్రవేత్త రాక్సీ మాథ్యూకోల్ అభిప్రాయపడ్డారు. దేశంలో మండుటెండలు, వడగాల్పుల తీవ్రత నేపథ్యంలో వాటికి కారణాలను 'ఈనాడు'కు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆయన వెల్లడించారు.
భారత్‌లో ఉష్ణోగ్రతలు ఎందుకింత తీవ్రంగా ఉంటున్నాయి ?
స్థానిక వాతావరణ మార్పులను అటుంచితే, ఇండో-పాక్ ప్రాంతంలో వేడిగాలుల తీవ్రత పెరగడానికి మూలకారణాలు భూతాపం(గ్లోబల్ వార్మింగ్), మితిమీరి విడుదలయ్యే కర్బన ఉద్గారాలు. దీనికి మానవ తప్పిదమూ కారణమే. చరిత్రలో 2022 మార్చిలో అత్యధిక ఉష్ణోగ్రతలు రికార్డయ్యాయి. 1901 నుంచి 2022 మధ్య దాదాపు 122 సంవత్సరాల్లో ఇవే అత్యధికం. దేశంలో ప్రత్యేకించి వాయువ్య ప్రాంతంలో ఎక్కువ ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. వడగాల్పులుగా మారి ఏప్రిల్‌లోనూ సాధారణం కంటే అధిక ఉష్ణోగ్రతలు కొనసాగాయి. దక్షిణాదిన కొన్ని ప్రాంతాలు మినహా దేశంలోని మిగిలిన అన్నిచోట్లా ఇదే పరిస్థితి. 1986 నుంచి 2015 వరకు సగటు ఉష్ణోగ్రతల్లో దశాబ్దానికి 0.15 డిగ్రీల సెల్సియస్ పెరుగుదల ఉంది. 2000 సంవత్సరం నుంచి భూతాప ప్రభావం నిత్యం కనిపిస్తూనే ఉంది.
వేడిగాలులు, వడదెబ్బ వల్ల ఏ స్థాయిలో మరణాలు ఉంటున్నాయి ?
తాజాగా భూవిజ్ఞాన మంత్రిత్వశాఖ విడుదల చేసిన నివేదిక ప్రకారం అధిక ఉష్ణోగ్రతలు, వడదెబ్బ కారణంగా చోటుచేసుకున్న మరణాల శాతం గత నాలుగు దశాబ్దాల్లో 62.2 శాతం పెరిగింది. వేడిగాలుల ప్రభావంతో పని సామర్థ్యం కోల్పోయి ఉత్పత్తి తగ్గడం, అనారోగ్య సమస్యలు పెరుగుతున్నాయి. అధిక ఉష్ణోగ్రతల కారణంగా ఈ శతాబ్ది చివరికల్లా దేశంలో 30-40 శాతం వరకు పనిసామర్థ్యం తగ్గుతుందని అంచనా. ఓ అధ్యయనం ప్రకారం.. 1979 నుంచి 2019 వరకు 7,063 ప్రతికూల వాతావరణ ఘటనల రూపేణా సుమారు లక్షా 41వేల మంది మరణించారు. ఇందులో 706 సంఘటనలు వేడిగాలుల తీవ్రతకు సంబంధించినవి. మొత్తం మరణాల్లో 17,362(12.3 శాతం) ఉష్ణోగ్రతల తీవ్రత, వడగాల్పుల వల్ల చోటుచేసుకున్నాయి. మిగిలినవి వరదలు, తుపాన్లు తదితరాల వల్ల జరిగాయి.
గ్లోబర్ వార్మింగే ప్రధాన కారణమంటారా ?