IITF 2023 Golden Saree Price :దిల్లీలో జరుగుతున్న 42వ భారత అంతర్జాతీయ వాణిజ్య ప్రదర్శనలో ఓ చీర అక్షరాల రూ.2.25 లక్షలకు అమ్ముడుపోయి ఆశ్చర్యపరించింది. బంగారు పూత పూసిన ఈ చీరకు రికార్డు ధర పలికింది. ఉత్తర్‌ప్రదేశ్‌కు చెందిన నేతకారులు ఈ బంగారు చీరను తయారు చేశారు. దీనిని చూసేందుకు సందర్శకులు పెద్ద ఎత్తున ట్రేడ్ ఫెయిర్‌కు వస్తున్నారు. దిల్లీలోని ప్రగతి మైదాన్‌లో ఏర్పాటు చేసిన ఓ వస్త్ర దుకాణంలో అమ్మకానికి ఉంచారు చీర తయారీదారు మహ్మద్ తబీష్. ఈ తరహా చీరలను మొఘలుల కాలం నుంచి తమ పూర్వీకులు తయారు చేస్తున్నారని ఆయన తెలిపారు.
"ఈసారి నిర్వహిస్తున్న 42వ భారత అంతర్జాతీయ వాణిజ్య ప్రదర్శనలో నేను తెచ్చిన స్టాక్ బాగానే అమ్ముడయింది. దీంతో ట్రేడ్ ఫెయిర్ ప్రారంభమైనప్పటి నుంచే భారీగా ఆర్డర్లు పెట్టాం. పార్శిళ్ల ద్వారా వాటిని తెప్పించి విక్రయిస్తున్నాం. ఇక ప్రత్యేకంగా తయారు చేసిన బంగారు పూత చీరలను నాలుగు తెచ్చాను. అందులో ఇప్పటికే మూడు అమ్మేశాను. చివరి దానిని రూ.2.25 లక్షలకు విక్రయించాను. దీనిని సోమవారం సాయంత్రం కొనుగోలుదారు వచ్చి తీసుకెళ్తారు. వాస్తవానికి ఈ ఖరీదైన చీరను చూసేందుకే చాలామంది నా స్టాల్‌కు వస్తున్నారు. వచ్చినవాళ్లు ఖాళీ చేతులతో వెళ్లకుండా ఏదో ఒక చీరను మాత్రం కొంటున్నారు."
- మహ్మద్ తబీష్, బంగారు చీర తయారీదారు