IIT Mandi Director Controversial Comments : హిమాచల్‌ప్రదేశ్‌లో భారీ వర్షాలు, కొండచరియలు విరిగిపడటానికి జీవహింసే కారణమంటూ ఐఐటీ మండీ డైరెక్టర్ చేసిన వ్యాఖ్యలు వివాదాస్పదమయ్యాయి. భారీ వర్షాల వల్ల పోటెత్తిన వరదలు, కొండచరియలు విరిగిపడటం వంటి ఘటనలతో హిమాచల్‌ప్రదేశ్ ఇటీవల అతలాకుతలమైంది. భారీ ఎత్తున ప్రాణ, ఆస్తి నష్టం వాటిల్లింది. అయితే, ఈ విపత్తులకు జీవహింసతో ముడిపెడుతూ స్థానిక ఐఐటీ మండీ డైరెక్టర్ చేసిన వ్యాఖ్యలు చర్చనీయాంశంగా మారాయి. ప్రజలు మాంసం తింటారని.. భారీ వర్షాలు, కొండచరియలు విరిగిపడటానికి జంతువులపై క్రూరత్వమే కారణమంటూ చెప్పడం వివాదాస్పదంగా మారింది. అంతటితో ఆగకుండా మాంసాహారం తినబోమని విద్యార్థులతో మండీ డైరెక్టర్ ప్రతిజ్ఞ చేయించినట్లు కూడా ఆరోపణలు వచ్చాయి.
"జంతువులను వధించడం ఆపకపోయినట్లయితే..హిమాచల్ ప్రదేశ్‌లో పరిస్థితులు మరింత దిగజారతాయి. దానికి పర్యావరణ క్షీణతతో సంబంధం ఉంది. మేఘవిస్ఫోటాలు, స్థానికంగా కొండచరియలు విరిగిపడటం ఇవన్నీ.. జంతువులపై క్రూరత్వం ప్రభావాలే. ప్రజలు మాంసం తింటారు. అందుకే మంచి మనుషులుగా మారేందుకు మాంసాన్ని త్యజించాలి." అని ఐఐటీ మండీ డైరెక్టర్ లక్ష్మీధర్ బెహరా విద్యార్థులను ఉద్దేశించి వ్యాఖ్యానించారు. దీనికి సంబంధించిన వీడియో సామాజిక మాధ్యమాల్లో చక్కర్లు కొడుతోంది. ఆయన చేసిన వ్యాఖ్యలపై నెటిజన్ల నుంచి తీవ్ర విమర్శలు వస్తున్నాయి.
బెహరా ఇలా వివాదాస్పద వ్యాఖ్యలు చేయడం ఇదే మొదటిసారి కాదు. తన గతంలో స్నేహితుడి అపార్ట్‌మెంట్‌లోంచి దుష్టశక్తులను పారదోలేందుకు భూతవైద్యంలో పాల్గొన్నట్లు స్వయంగా లక్ష్మీధర్ బెహరా వెల్లడించారు. ఆ సమయంలోనూ ఈయన వార్తల్లో నిలిచారు.