High Resolution Ultrasound Images: అధిక రిజల్యూషన్‌తో అల్ట్రాసౌండ్ స్కానింగ్ చిత్రాలను చూడగలిగే కొత్త సాంకేతికతను ఐఐటీ మద్రాస్ పరిశోధకులు అభివృద్ధి చేశారు. వ్యాధుల నిర్ధారణలో కచ్చితత్వం, చికిత్స పర్యవేక్షణల్ని మెరుగుపరిచేందుకు ఈ పరిశోధన దోహదం చేస్తుందని చెప్పారు. మానవ శరీరం లోపలి చిత్రాలను చూపే సాంకేతికతే అల్ట్రాసౌండ్. వివిధ వ్యాధుల నిర్ధారణ, చికిత్స విధానాల్లో దీన్ని విస్తృతంగా వినియోగిస్తున్నారు. గర్భిణులలో పిండాన్ని పరీక్షించడం సహా అంతర్గత అవయవాల్లో నొప్పి, వాపు, ఇన్‌ఫెక్షన్‌ను గుర్తించేందుకు ప్రధానంగా అల్ట్రాసౌండ్‌పైనే ఆధారపడుతున్నారు.
అల్ట్రాసౌండ్ యంత్రంలో ఉండే 'భీమ్‌ఫార్మర్' అనే ప్రధాన భాగం.. స్కానింగ్ చిత్రం నాణ్యతలో ప్రధాన పాత్ర పోషిస్తుంది. భీమ్‌ఫార్మర్ పనితీరును మెరుగుపరిచేందుకు ఇప్పటికే అనేక సాంకేతికాలు వచ్చాయి. అయితే తాము అభివృద్ధి చేసిన సాంకేతికత వీటన్నింటికి మించి అత్యుత్తమ నాణ్యతతో చిత్రాలను అందిస్తున్నట్టు ఐఐటీ పరిశోధకులు పేర్కొన్నారు. సాధారణంగా అల్ట్రాసౌండ్ తీసే సమయంలో అంతర్గత అవయవాల్లో పెద్ద శబ్దాలు వచ్చినప్పుడు చిత్రాల నాణ్యత తగ్గిపోతోందని, తాము ఆ సమస్యను అధిగమించినట్టు వివరించారు. ఈ వివరాలు 'సైంటిఫిక్ రిపోర్ట్స్' జర్నల్‌లో ప్రచురితమయ్యాయి.