NIRF ranking 2022: దేశంలోనే అత్యుత్తమ విద్యా సంస్థగా ఐఐటీ మద్రాస్ నిలిచింది. 2022కు సంబంధించి కేంద్ర విద్యాశాఖ విడుదల చేసిన జాతీయ ర్యాంకుల్లో ఉత్తమ విద్యాసంస్థగా నిలిచింది. ఐఐటీ మద్రాస్ వరుసగా నాలుగో ఏడాది ఈ ఘనత సాధించింది. ఓవరాల్ కేటగిరీలో ఐఐటీ మద్రాస్ తొలి స్థానంలో ఐఐఎస్సీ బెంగళూరు, ఐఐటీ బాంబే రెండు, మూడో స్థానంలో నిలిచాయి. ఉత్తమ విశ్వవిద్యాలయంగా ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ అఫ్ సైన్సెస్- బెంగళూరు నిలిచింది. జేఎన్‌యూ, జామియా మిలియా ఇస్లామియా విశ్వవిద్యాలయం రెండు, మూడో స్థానంలో ఉన్నాయి. హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ పదో స్థానంలో ఉంది.
ఉత్తమ ఇంజినీరింగ్ కళాశాలగా ఐఐటీ మద్రాస్ తొలిస్థానంలో నిలవగా ఐఐటీ దిల్లీ, ఐఐటీ బాంబే రెండు, మూడు స్థానాల్లో ఉన్నాయి. ఐఐటీ హైదరాబాద్ 9వ స్థానంలో నిలిచింది.ఉత్తమ బిజినెస్ స్కూల్‌గా ఐఐఎం అహ్మదాబాద్ తొలిస్థానం సంపాదిస్తే.. ఐఐఎం బెంగళూరు, ఐఐఎం కలకత్తా తర్వాతి స్థానాల్లో ఉన్నాయి. ఫార్మసీ విద్యాసంస్థలకు సంబంధించి జామియా హమ్దార్ద్ తొలిస్థానంలో నిలవగా..హైదరాబాద్‌లోని నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఫార్మాస్యుటికల్ ఎడ్యుకేషన్ అండ్ రీసెర్చ్ రెండో స్థానంలో ఉంది. చంఢీగడ్‌లోని పంజాబ్ యూనివర్శిటీ మూడో స్థానం దక్కించుకుంది.
ఉత్తమ వైద్యకళాశాలగా దిల్లీ ఎయిమ్స్ తొలిస్థానం దక్కించుకోగా.. ఛండీగఢ్‌లోని PGIMER రెండు, వేలూరులోని సీఎంసీ మూడో స్థానం సంపాదించాయి. ఉత్తమ దంత వైద్య కళాశాలగా చెన్నైలోని సవితా ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ అండ్ టెక్నికల్ సైన్సెస్ నిలిచింది. ఉత్తమ కళాశాలల విభాగంలో టాప్ టెన్‌లో ఐదు దిల్లీకి చెందిన కళాశాలలే ఉన్నాయి. ఈ విభాగంలో మిరందా హౌస్ తొలిస్థానంలో నిలవగా.. హిందూ కాలేజ్, చెన్నైలోని ప్రెసిడెన్సీ కళాశాల రెండు, మూడు స్థానాలు సంపాదించుకున్నాయి.