IIT-M Dalit Scholar Sexually Assault: ఐఐటీ మద్రాస్‌లో పీహెచ్డీ చదువుతున్న దళిత విద్యార్థినిపై లైంగిక వేధింపుల కేసును సీబీ-సీఐడీకి బదిలీ చేయాలని తమిళనాడు ప్రభుత్వాన్ని ఆల్ ఇండియా డెమొక్రటిక్ ఉమెన్ అసోసియేషన్(ఏఐడీడబ్ల్యూఏ) కోరింది. 'ఐఐటీ మద్రాస్‌లో బంగాల్‌కు చెందిన దళిత విద్యార్థినిపై నలుగురు తోటి విద్యార్థులు రెండేళ్లు లైంగిక వేధింపులకు పాల్పడ్డారు. ఆ దృశ్యాలను వీడియో తీసి బెదిరించారు. ఈ అంశంపై ప్రొఫెసర్‌కు ఫిర్యాదు చేసినప్పటికీ.. ఎలాంటి చర్యలు తీసుకోలేదు.' అని బాధితురాలు ఫిర్యాదులో పేర్కొన్నట్లు ఏఐడీడబ్ల్యూఏ జనరల్ సెక్రటరీ పీ సుగాంతీ తెలిపారు.
'బాధితురాలు ఐఐటీ పరీక్షల్లో తప్పి, మానసికంగా కుంగిపోయింది. ఎవరూ సహాయం చేయకపోయేసరికి ఆత్మహత్యాయత్నం కూడా చేసింది. క్యాంపస్ ఫిర్యాదుల కమిటీకి 2020లో ఫిర్యాదు చేసినప్పటికీ.. వారు దర్యాప్తును ఇప్పటికీ పూర్తి చేయలేదు. వేధింపులపై మార్చి 2021న మైలపోర్ మహిళా పోలీస్ స్టేషన్లో కూడా బాధితురాలు ఫిర్యాదు చేసింది. అక్కడ కేసుపై ఎలాంటి చర్యలు తీసుకోకపోగా.. బాధితురాలుని స్టేషన్ నుంచి బయటకు లాగేశారు.' అని చెప్పారు సుగాంతీ. క్యాంపస్ అంతర్గత ఫిర్యాదుల కమిటీ ఈ కేసుపై విచారణ జరిపి పూర్తి నివేదికను సమర్పించాలని కోరారు. దోషులకు కఠిన శిక్ష విధించాలని డిమాండ్ చేశారు.