భారత్‌లోని 20శాతం భూగర్భజలాల్లో విషపూరితమైన ఆర్సెనిక్ ఉన్నట్లు ఐఐటీ ఖరగ్‌పూర్ వెల్లడించింది. 25కోట్ల జనాభా ఈ నీటిని వాడుతున్నట్లు ఐఐటీ అధ్యయనంలో వెల్లడైంది. కృత్రిమ మేధ (ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్) ఆధారంగా ఈ అధ్యయనాన్ని నిర్వహించినట్లు వారు తెలిపారు. ఇటీవల సైన్స్ ఆఫ్ ది టోటల్ ఎన్విరాన్‌మెంట్ జర్నల్‌లో ఈ పరిశోధనా పత్రాలు ప్రచురితమయ్యాయి. పరిశోధకులు వెల్లడించిన వివరాల ప్రకారం.. వివిధ ప్రభుత్వ, ప్రైవేటు సంస్థల నుంచి తీసుకున్న సమాచారం ఆధారంగా విశ్లేషిస్తే... దేశమంతటా ప్రమాదకరంగా ఆర్సెనిక్ స్థాయిలు ఉన్నట్లు గుర్తించామన్నారు. ఆర్సెనిక్ ఎక్కువగా గమనించిన ప్రాంతాలు సింధు-గంగా- బ్రహ్మపుత్ర నదీ పరీవాహక ప్రాంతాల్లో ఉన్నాయని తెలిపారు. పంజాబ్ (92 శాతం), బీహార్ (70 శాతం), పశ్చిమబెంగాల్ (69 శాతం), అస్సాం (48 శాతం), హరియాణా (43 శాతం), ఉత్తరప్రదేశ్ (28 శాతం), గుజరాత్ (24 శాతం) రాష్ట్రాల్లో ఎక్కువ శాతం ఆర్సెనిక్‌ను గమనించినట్లు పరిశోధకులు తెలిపారు.
భారత్‌లోని 250 మిలియన్లకు పైగా ప్రజలు ఆర్సెనిక్‌ను ఎక్కువశాతంలో తీసుకుంటున్నట్లు ఐఐటీ ఖరగ్‌పూర్ అసోసియేట్ ప్రొఫెసర్ అభిజిత్ ముఖర్జీ తెలిపారు. 'దేశంలో లీటరుకు 10 మైక్రోగ్రాములు ఆర్సెనిక్ ఉండాలని నిబంధనలు వెల్లడిస్తున్నాయి. కానీ అంతకంటే ఎక్కువ ఆర్సెనిక్ ఉన్నట్లు ఈ పరిశోధనలో వెల్లడైంది'అని ఆయన తెలిపారు. ప్రపంచవ్యాప్తంగా భూగర్భ జలాల్లో ఆర్సెనిక్ ఎక్కువగా ఉన్న దేశాల్లో భారత్ కూడా ఒకటని పరిశోధకులు తెలిపారు. భారత్‌లో 80శాతం తాగునీరు భూగర్భజలాల నుంచే లభిస్తుందని తెలిపారు. గతంలో చేసిన అధ్యయనాలు కొన్ని ప్రాంతాలకు మాత్రమే పరిమితమయ్యాయని వారు వెల్లడించారు. తమ అధ్యయనం ద్వారా ప్రజలకు సురక్షితమైన తాగునీరు అందించే దిశగా ప్రయత్నాలు జరుగుతాయని ఆశిస్తున్నామన్నారు.