భూగర్భ బావుల నుంచి చమురు, వాయువులను వెలికితీసేందుకు దోహదపడే భారీ సింథటిక్ అణువులను ఐఐటీ- ఖరగ్పుర్ పరిశోధకులు రూపొందించారు. ఇవి స్పెషాలిటీ ఫ్రిక్షన్- రెడ్యూసర్ పాలిమర్లకు సంబంధించినవి.
ఫ్రాకింగ్ పద్దతి..
ఇటీవలి కాలంలో ప్రపంచ వ్యాప్తంగా భూగర్భ బావుల నుంచి చమురు, వాయువులను వెలికితీసేందుకు ఫ్రాకింగ్ తదితర నూతన విధానాలను అనుసరిస్తున్నారు. భూగర్భ పగుళ్లలోకి ద్రావణాన్ని అధిక పీడనంలోకి చొప్పించి, అక్కడి నుంచి చమురు, వాయువులను సంగ్రహించటమే ఫ్రాకింగ్. ఇందుకు స్పెషాలిటీ ఫ్రిక్షన్- రెడ్యూసర్ పాలిమర్లు దోహదపడతాయి. ప్రపంచవ్యాప్తంగా వీటికి తీవ్ర డిమాండ్ నెలకొన్నా, ఈ సాంకేతికత అందుబాటులో లేని కారణంగా భారత్ ఈ పాలిమర్ల ఉత్పత్తి, సరఫరా చేపట్టలేకపోతోంది. దీనిపై దృష్టి సారించిన ప్రొఫెసర్ సందీప్ కులకర్ణి బృందం.. సింథటిక్ అణువులను సృష్టించింది.