తెలంగాణ

telangana

ETV Bharat / bharat

'రెండో దశలో కరోనా మరణాలు 15లక్షల కంటే అధికం' - corona death toll latest

దేశంలో కరోనా రెండో దశ తీవ్రస్థాయిలో విజృంభించింది. ఈ నేపథ్యంలో అధికారిక లెక్కల కంటే కనీసం 15లక్షల మంది అధికంగా మరణించి ఉంటారని ఐఐఎమ్​ అహ్మదాబాద్​లోని అర్థశాస్త్ర ఆచార్యాడు చిన్మయ్​ తుంబే పేర్కొన్నారు. ఇది ప్రాథమిక అంచనా మాత్రమే అని, మృతుల సంఖ్య ఇంకా పెరిగే అవకాశముందన్నారు.​

IIM's  Chinmay Thumbe
కరోనా మరణాలు

By

Published : Jun 20, 2021, 9:44 PM IST

Updated : Jun 22, 2021, 2:28 PM IST

కరోనా మరణాలను ప్రభుత్వాలు తక్కువ చేసి చూపిస్తున్నాయని, రెండో దశలోనే అధికారిక లెక్కల కంటే కనీసం 15 లక్షల మంది ఎక్కువగా చనిపోయి ఉంటారని అహ్మదాబాద్‌ ఇండియన్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ మేనేజ్‌మెంట్‌ అర్థశాస్త్ర ఆచార్యుడు చిన్మయ్‌ తుంబే అంచనా వేశారు. ఇది ప్రాథమిక అంచనా మాత్రమేనని, ఈ సంఖ్య ఇంకా పెరిగే ప్రమాదం ఉందన్నారు. ఆంధ్రప్రదేశ్‌, మధ్యప్రదేశ్‌, కర్ణాటక, తమిళనాడులోనే అదనపు మరణాల సంఖ్య 5లక్షలకుపైగా ఉన్నట్లు చెప్పారు. ప్రస్తుతం దేశాన్ని హడలెత్తిస్తున్న కొవిడ్‌ వల్ల సంభవించిన మరణాలతోపాటు ఇంతకుముందు మహమ్మారుల వల్ల కలిగిన ప్రాణ నష్టంపై ఆచార్య చిన్మయ్‌ తుంబే పరిశోధన చేస్తున్నారు. ఇటీవల ది ఏజ్‌ ఆఫ్‌ పాండమిక్‌ అనే పుస్తకాన్ని కూడా రాసిన ఆయన.. 2016లో వలసలపై కేంద్ర ప్రభుత్వం ఏర్పాటు చేసిన బృందంలోనూ సభ్యుడిగా పనిచేశారు. అహ్మదాబాద్‌ ఐఐఎమ్​ అర్థశాస్త్ర ఆచార్యుడు.. చిన్మయ్‌ తుంబేతో ఈనాడు అసోసియేట్‌ ఎడిటర్‌ విశ్వప్రసాద్‌ ముఖాముఖి ఇప్పుడు చూద్దాం...

చిన్మయ్ తుంబేతో ఈటీవీ భారత్ ఇంటర్వ్యూ

ప్రశ్న-1: కొవిడ్‌ మరణాలకు సంబంధించి ప్రభుత్వ లెక్కలు, వాస్తవ పరిస్థితులకు పొంతన లేదని రోజులు గడిచేకొద్దీ స్పష్టమవుతోంది. మీ పరిశోధన ప్రకారం కరోనా రెండుదశల వల్ల ఇప్పటివరకూ దేశంలోఎంతమంది చనిపోయి ఉంటారు....?

జవాబు:ఇంకా పూర్తిస్థాయి సమాచారం అందాల్సి ఉన్నందున ఇప్పుడే మరణాల లెక్కలు చెప్పటం తొందరపాటు అవుతుంది. మొదటిదశతో పోలిస్తే రెండోదశలో మరణాల సంఖ్యను బాగా తక్కువగా చూపించటం జరుగుతోంది. మొదటిదశలో సుమారు లక్షా 50వేల మంది కొవిడ్‌ వల్ల చనిపోయారని ప్రభుత్వలెక్కలు చెబుతున్నాయి. వాస్తవానికి ఆ సంఖ్య రెండు, మూడు రెట్లు ఎక్కువ ఉండొచ్చు. ఇది 2020కి సంబంధించినది. మొదటిదశకు సంబంధించి లెక్కల్లోకి రాని మరణాల సమాచారం ఇప్పుడిప్పుడే బయటికి వస్తోంది. ఇక రెండోదశలో ఏప్రిల్‌, మే నెలల్లో కొవిడ్‌ అత్యంతవేగంగా, ప్రమాదకరంగా ప్రబలింది. ఎవరూ ఊహించని విధంగా ప్రాణాలను బలి తీసుకుంది. మా పరిశోధనలో భాగంగా రాష్ట్రాల పరిధిలో అధికారికంగా నమోదు చేసిన కొవిడ్‌ మరణాల వివరాలు, ఇతర కారణాలతో చనిపోయినట్లుగా నమోదు చేసిన వారి లెక్కలు సేకరిస్తున్నాం. ఆంధ్రప్రదేశ్‌, మధ్యప్రదేశ్‌, కర్ణాటక, తమిళనాడులో మరణాల లెక్కలప్రకారం సాధారణ పరిస్థితుల్లే కంటే 5 లక్షల మంది ఎక్కువగా చనిపోయారు. ఈ నాలుగురాష్ట్రాల్లో 2021 జనవరి నుంచి మే వరకు కొవిడ్‌ వల్ల చనిపోయినవారి సంఖ్యను 46వేలుగా చూపించారు. కానీ

ఈ 4రాష్ట్రాల్లో ఇదే సమయంలో గత కొన్ని సంవత్సరాలతో పోలిస్తే సాధారణంగా ఉండాల్సిన మరణాలు 5,30,000 ఎక్కువగా నమోదయ్యాయి. అంటే వాస్తవంగా మహమ్మారి కారణంగా చనిపోయిన వారి సంఖ్యను పది రెట్ల వరకు తగ్గించి చూపిస్తున్నారు. ఈ నాలుగు రాష్ట్రాల జనాభా దేశ జనాభాలో 20 శాతం ఉంటుంది. ఆ ప్రకారంగా 2021లో అంటే కేవలం రెండోదశలో దేశంలో లెక్కలోకి రాని మరణాలు తక్కువలో తక్కువగా కనీసం 15లక్షలు ఉంటాయి. ఇంకా ఉత్తర్‌ప్రదేశ్‌, బిహార్‌, రాజస్థాన్‌, జార్ఖండ్‌ వంటి రాష్ట్రాల నుంచి వివరాలు రావాల్సి ఉంది. అవి అందితే ఈ లెక్క చాలా పెరుగుతుంది. అన్నిరాష్ట్రాల్లో సివిల్‌ రిజిస్ట్రేషన్‌ విధానం ద్వారా మరణాల నమోదు జరుగుతుంది. ఇక్కడ అనేక అంశాలు ఉన్నాయి. ప్రస్తుతం ల్యాబ్‌ పరీక్షలో పాజిటివ్‌ అని తేలిన వారినే అధికార జాబితాలో చేర్చుతున్నారు. గ్రామీణ ప్రాంతాల్లో ల్యాబ్‌ సౌకర్యాలు లేవు. అసంఖ్యాకమైన ప్రజలు ల్యాబ్‌ పరీక్షలు జరగకుండానే చనిపోయారు. యూపీ, బిహార్‌ రాష్ట్రాల్లో సాధారణ మరణాలను నమోదు చేయటం కూడా సరిగ్గా జరగదు. దీంతో కొవిడ్‌ వాస్తవ మరణాలను పూర్తిస్థాయిలో అంచనా వేయటానికి తదుపరి జనాభా గణన వరకూ ఆగాల్సి ఉంటుంది.

ప్రశ్న-2: భారత్‌, ప్రపంచంలోని ఇతర అనేక దేశాలు 1918లో ఇన్‌ఫ్లుయంజా మహమ్మారిని ఎదుర్కొన్నాయి. దానివల్ల చనిపోయిన వారిని గుర్తించటంలో ఎలాంటి సమస్యలు ఎదురవుతాయి?

జవాబు:భారత్‌లో కొవిడ్‌ మాదిరిగా ఇన్‌ఫ్లుయంజా మహమ్మారి రెండోదశలో దారుణ ప్రభావం చూపించింది. 1918 సెప్టెంబర్‌ నుంచి 3నెలలపాటు చాలాతీవ్రంగా ఉంది. అప్పుడు ఇప్పటివలె ల్యాబ్‌ పరీక్షలు లేవు. అందువల్ల పాజిటివ్‌ వచ్చి చనిపోయినవారిని అధికారికంగా గుర్తించే పరిస్థితి అప్పుడు లేదు. జ‌్వరం వచ్చి చనిపోయినవారిని పరిగణలోకి తీసుకున్నారు. ఆ మహమ్మారి వల్ల 60లక్షల మంది చనిపోయారని అప్పటి శానిటరీ కమిషనర్‌ నార్మన్‌వైట్‌ 1919లో ప్రకటించారు. తర్వాత 1921 జనగణన కోసం అధికారులు వెళ్లినప్పుడు కొన్నిగ్రామాల్లో జనాభా కనిపించలేదు. మరణాల సంఖ్య కోటి వరకు ఉంటుందని అంచనాలు సవరించారు. దానికి సంబంధించి తదుపరి కూడా శాస్త్రీయ పరిశోధనలు జరుగుతూనే ఉన్నాయి. నా పరిశోధనల ప్రకారం ఆ మహమ్మారి వల్ల భారత్‌ మరణాల సంఖ్య రెండు కోట్ల వరకు ఉంటుంది. అంటే తొలుత అధికారిక లెక్కలతో పోలిస్తే మూడు రెట్లు ఎక్కువ.

ప్రశ్న-3: 1918 నాటితో పోల్చుకుంటే నూతన సాంకేతిక పరిజ్ఞానం, అధునాతన సమాచార వ్యవస్థలు ఇప్పుడు అందుబాటులో ఉన్నాయి. అయినా కూడా చనిపోయిన వారి వివరాలు సరిగా సేకరించలేకపోతున్నాం. సమస్య ఎక్కడ ఉంది?

జవాబు: ప్రభుత్వాలు వాస్తవాలను వెల్లడించకుండా తొక్కిపెడుతున్నాయి. ఆ వివరాలు బయటపెడితే ప్రభుత్వంపై వ్యతిరేకత వస్తుందని భావిస్తున్నాయి. ఇది సరైన పద్ధతి కాదు. మహమ్మారి ప్రబలినప్పుడు వాస్తవ గణాంకాలను ప్రజలకు తెలియజేయటం అవసరం. ప్రస్తుత సమస్య సమాచారం సేకరించటంలో కాదు. వెల్లడించటంలోనే ఉంది. తొలిదశ మొదలై ఇప్పటికి ఏడాది దాటింది. ఆంధ్రప్రదేశ్‌లో గతేడాది ఆగస్టు, సెప్టెంబర్‌ నెలల్లో సంభవించిన అదనపు మరణాలను ఇప్పటికి కొవిడ్‌ మరణాల జాబితాలో చేర్చలేదు. కొవిడ్‌ కేసులు, మరణాల వివరాలను ప్రస్తుతం రోజూ ఎలా ప్రకటిస్తున్నారో వాటితోపాటు ఇతర కారణాల వల్ల చనిపోయినట్లు సివిల్‌ రిజిస్ట్రేషన్‌లో పద్ధతిలో నమోదయ్యే మరణాలను రోజూ జిల్లాలవారీగా ప్రకటించాలి. అదనపు వివరాలు వచ్చినప్పుడు వాటిని మార్పులు చేయవచ్చు. ఇలా చేస్తే పరిస్థితి ఎక్కడ ఎంత తీవ్రంగా ఉందో స్పష్టంగా అర్థమై తదుపరి చర్యలు తీసుకునేందుకు వీలవుతుంది.

ప్రశ్న-4: భారత్‌లో కాదు....అభివృద్ధి చెందిన అమెరికా వంటి దేశాల్లోనూ వాస్తవ మరణాలకు, ప్రభుత్వ లెక్కలకు తేడా ఉంటోంది. ఎందువల్ల?

జవాబు: అభివృద్ధి చెందిన దేశాల్లో కొవిడ్‌ వల్ల చనిపోయినవారి లెక్కలను ఒకటిన్నర నుంచి రెండు రెట్లు తక్కువగా చూపిస్తున్నారు. మనదేశంలో తొలుత ముంబయి వంటి చోట్ల కూడా 1.6 నుంచి 2 రెట్లు తక్కువగా చూపించారు. కొవిడ్‌ రెండోదశ వచ్చాక మన దగ్గర పరిస్థితి మారిపోయింది. దీనికి కారణాలు ఏమిటంటే రెండోదశలో మహమ్మారి ప్రభావం అత్యంత తీవ్రంగా ఉంది. ఈసారి గ్రామీణప్రాంతాలకు విపరీతంగా విస్తరించింది. అక్కడ ల్యాబ్‌ సౌకర్యం లేదు. ఇక పట్టణాలు, నగరాల్లోనూ ఆస్పత్రులు రద్దీతో కిక్కిరిసిపోయాయి. దీంతో పరీక్షలు, చికిత్సలు చేయించుకునే పరిస్థితి లేక పెద్దసంఖ్యలో ప్రజలు ఈ ప్రాంతాల్లో చనిపోయారు. ఇక గుండెజబ్బు వంటి తీవ్రమైన ఆరోగ్య సమస్యలు ఉన్న అనేకమంది కొవిడ్‌ సమయంలో చికిత్సలు అందక చనిపోయారు. మహమ్మారుల విషయంలోనూ మరణాలను యుద్ధాల సమయంలో చూసినట్లు పరిగణించాలి. యుద్ధాల వల్ల సైనికులే కాదు అనేకమంది పౌరులు చనిపోతారు. అలాగే మహమ్మారి సోకినవారితోపాటు దానివల్ల ఏర్పడిన పరిస్థితుల వల్ల కూడా అనేక మంది చనిపోతారు. మహమ్మారి సమయంలో సంభవించిన మరణాలు ఆందోళన కలిగిస్తున్నాయి.

ప్రశ్న-5: కొవిడ్‌ మరణాలను సరిగ్గా లెక్కించకపోవటం వల్ల వచ్చే సమస్య ఏమిటి...?

జవాబు: తీవ్రమైన ప్రభావాలు ఉంటాయి. ఈ ఏడాది ఏప్రిల్‌, మే మాసాల్లో కేంద్ర ప్రభుత్వం ఆక్సిజన్‌ను, మందులను కేవలం కొవిడ్‌ కేసులు, మరణాల లెక్కల ఆధారంగానే సరఫరా చేసింది. ఆ సమయంలో అధికారిక లెక్కలప్రకారం తలసరి ప్రాతిపదికన కర్ణాటకలో ఎక్కువ సమస్య ఉంది. కానీ అనధికార మరణాలను కూడా పరిగణలోకి తీసుకుంటే మధ్యప్రదేశ్‌లోనే సమస్య తీవ్రత ఇంకా ఎక్కువ. అందువల్ల మధ్యప్రదేశ్‌కు అందాల్సిన సాయం అందలేదు. కేంద్ర విధానానికి, క్షేత్రస్థాయి పరిస్థితులతో పొంతన లేకుండాపోయింది. ఇప్పటికైనా రాష్ట్రప్రభుత్వాలు అన్నిరకాల మరణాలను రోజువారీగా ప్రకటించటం చాలా అవసరం.

ప్రశ్న-6: భారత్‌లో 1918లో ఇన్‌ఫ్లుయంజా ప్రబలిన కాలానికి, ఇప్పటికి సారూప్యతలు కనిపిస్తున్నాయి. అప్పుడు గంగానదిలో భారీ ఎత్తున శవాలు దర్శనమిచ్చాయి. 2021లోనూ అలాంటి దృశ్యాలు కనిపించాయి. స్వాతంత్ర్యం వచ్చి 70ఏళ్లు దాటిన తర్వాత కూడా ఇలాంటి వైఫల్యాలు చోటుచేసుకోవటానికి కారణం ఏమిటి...?

జవాబు: మహమ్మారులపై గతేడాది నేను పుస్తకం రాసేటప్పుడు 1918 సంఘటనలనూ ప్రస్తావించాను. అవే సన్నివేశాలు మళ్లీ 2021లో చోటుచేసుకుంటాయని నేను ఊహించలేదు. మరణాలు అపరిమితంగా ఉన్నప్పుడు ఇలాంటివి చోటుచేసుకుంటాయి. శ్మశానవాటికలు కిక్కిరిసి చోటు దొరకటం దుర్లభం అవుతుంది. అందుకే మృతదేహాలను నదుల్లో విసిరేశారు. అనేకస్థాయుల్లో విధానపరమైన వైఫల్యాల వల్ల దేశంలో రెండోదశ ఎంత ప్రమాదకరంగా ఉండనుందో అంచనా వేయలేకపోయారు. మనదేశంలో 1918లోనూ, అమెరికా, బ్రిటన్‌లో మహమ్మారి విడతలుగా ప్రభావం చూపించింది. ఈ విషయాన్ని మనం పరిగణలోకి తీసుకోలేదు. గత డిసెంబర్‌ తర్వాత తేలిగ్గా తీసుకున్నాం. ఫలితంగా తీవ్ర పర్యవసానాలను చూడాల్సి వచ్చింది. 1918తో పోలిస్తే ఇప్పుడు ఆ స్థాయిలో ప్రాణనష్టం లేదు. అప్పటితో పోలిస్తే ఇప్పుడు మరణాల సంఖ్యను లెక్కించటంలో ఎంతో మెరుగ్గా ఉండాల్సింది. ఈ విషయంలో విఫలమయ్యాం.

ప్రశ్న-7: కొవిడ్‌ వంటి మహమ్మారులు ప్రబలినప్పుడు ప్రాణనష్టాన్ని బాగా తగ్గించేందుకు ప్రభుత్వాలు తీసుకోవాల్సిన చర్యలు ఏమిటీ?

జవాబు: ఇలాంటి సమయాల్లో ప్రభుత్వాలు చాలా కఠినమైన నిర్ణయాలను తీసుకోవాల్సి ఉంటుంది. ఎన్ని జాగ్రత్తలు తీసుకున్నా కొంత మంది మరణించే అవకాశం ఉంటుంది. ప్రభుత్వాలకు ఇది సంక్లిష్టమైన బాధ్యత. నష్టాన్ని వీలైనంత తగ్గించేందుకు అవి సైన్స్‌కు సంబంధించిన తాజా పరిణామాలను అవగాహన చేసుకోవాలి. సమస్యను ఎదుర్కొనేందుకు ఏ విధానాలు పాటించాలని అది చెబుతుందో తెలుసుకోవటం ముఖ్యం. ఇది జరగనందునే వ్యాక్సిన్లకు అర్డర్లు ఇవ్వటంలో జాప్యం జరిగింది. అలాగే కొవిడ్‌ సమస్య పోయిందనే రీతిలో మంత్రులు ఫిబ్రవరిలో మాట్లాడారు. మహమ్మారుల ముప్పు ఉన్న సమయంలో ఇలా మాట్లాడకూడదు. అవి దశలవారీగా ప్రబలుతాయనే అవగాహన లేకుండాపోయింది. ఇక ప్రభుత్వాలకు సహనం ఉండాలి. మహమ్మారులు కొంత ఎక్కువకాలం ఉంటాయి. ఓపికతో పోరాడాలి. అలాగే సహనం కూడా చాలా అవసరం. వాటిపై విజయం సాధించామన్న ప్రకటనలు చేయకూడదు. కొవిడ్‌ మాత్రమే కాదు భవిష్యత్తులో మరో మహమ్మారి వచ్చినా సమర్థంగా ఎదుర్కొనేందుకు అన్ని జిల్లాల్లో ఏరోజు ఎంతమంది ఏ కారణాలతో చనిపోయారన్న సమాచారాన్ని ఎప్పటికప్పుడు వెల్లడించాలి. అప్పుడే సమర్థంగా సమస్యను ఎదుర్కోవచ్చు.

ప్రశ్న-8: కేంద్రప్రభుత్వం వలసలపై 2016లో ఏర్పాటు చేసిన వర్కింగ్‌ బృందంలో మీరు సభ్యులుగా ఉన్నారు. ఈ అంశంపై అధ్యయనం చేశారు. కొవిడ్‌ వల్ల దారుణంగా దెబ్బతిన్న వలస కార్మికులను ఆదుకోవటానికి ప్రభుత్వాలు చేయాల్సిందేమిటి?

జవాబు: వలస కార్మికులకు సంబంధించి కేంద్రం కొన్నిచర్యలు తీసుకుంది. ఒకదేశం-ఒక రేషన్‌ కార్డు విధానాన్ని అమలుచేస్తోంది. ఏ రాష్ట్రానికి వెళ్లి పనిచేసినా అక్కడ వలస కార్మికులు రేషన్‌ తీసుకోవచ్చు. దురదృష్టవశాత్తు చాలామంది కార్మికులకు ఆ విషయం తెలియదు. దీనిపై ప్రచారం ఇంకా బాగాచేయాలి. వలస కార్మికులకు ప్రధాన లోపం ఏమంటే పనిచేసే చోట వారు ఓటర్లు కానందున అక్కడి రాజకీయ పార్టీలు వారి సమస్యలను పెద్దగా పట్టించుకోవు. ప్రస్తుతం వారందరికీ వ్యాక్సిన్లు వేయటం చాలాముఖ్యం. నిర్మాణ సంస్థల యాజమాన్యాలు ఈ విషయంలో బాధ్యత తీసుకోవాలి. ఇక కరోనా పరిస్థితుల వల్ల వలస కార్మికుల పిల్లల చదువులు దెబ్బతినే ప్రమాదం ఉంది. రాష్ట్రప్రభుత్వాలు ఆ విషయంపై శ్రద్ధపెట్టాలి.

ఇదీ చూడండి:-క్యాన్సర్ బాధితులకు కరోనాతో కొత్త చిక్కులు

Last Updated : Jun 22, 2021, 2:28 PM IST

ABOUT THE AUTHOR

...view details