దేశవ్యాప్తంగా పెట్రో ధరలు (Oil Price News) రోజురోజుకూ పెరుగుతున్నాయి. అయితే అవి త్వరలోనే తగ్గనున్నట్లు పెట్రోలియం శాఖ మంత్రి హర్దీప్ సింగ్ పురి తెలిపారు. చమురు ఎగుమతి దేశాల సమాఖ్య ఒపెక్(OPEC) మార్కెట్లోకి మరింతగా ముడి చమురును తీసుకురావాలని నిర్ణయించినట్లు ఈటీవీ భారత్‌కు ఇచ్చిన ప్రత్యేక ఇంటర్వ్యూలో గుర్తుచేశారు. ఈ కారణంగా పెట్రోల్ రేట్లు తగ్గే అవకాశం ఉందని చెప్పుకొచ్చారు. దీనితో పాటు కేంద్రం కూడా క్రూడ్ ఆయిల్ నిల్వలను పెంచే దిశగా చర్యలు చేపడుతున్నట్లు పేర్కొన్నారు.
కరోనాతో ప్రపంచవ్యాప్తంగా ఆర్థిక కార్యకలాపాలు నిలిచిపోయాయి. దీంతో 2020 మార్చిలో బ్యారెల్ చమురు ధర 19 డాలర్లకు పడిపోయింది. నేడు ఆర్థిక కార్యకలాపాలు యథాతథంగా జరుగుతున్నాయి. ప్రస్తుతం అంతర్జాతీయ మార్కెట్లో ముడి చమురు ధర బ్యారెల్‌కు 78 డాలర్లుగా ఉంది. ఈ సమయంలోనే ఒపెక్ దేశాలు ముడి చమురును మరింతగా మార్కెట్లోకి తీసుకురావాలని నిర్ణయించాయి. ఈ క్రమంలో ఉత్పత్తి పెరిగినప్పుడు చమురు ధరలు తగ్గే అవకాశం ఉంది.
- హర్దీప్ సింగ్ పురి, పెట్రోలియం శాఖ మంత్రి
గతం కొన్నేళ్లుగా పెట్రోల్, డీజిల్ పాటు సీఎన్జీ ధరలు (Oil Price News) కూడా భారీగా పెరిగాయన్న కేంద్రమంత్రి.. ఇందుకు కారణం యూపీఏ ప్రభుత్వం హయాంలో ధరల పెరుగుదలను నియంత్రించడానికి చేసిన సంతకమే అని దుయ్యబట్టారు. చమురు బాండ్ల కోసం ఎన్డీఏ ప్రభుత్వం రూ. 20,000 కోట్ల మెచ్యూరిటీ మొత్తాన్ని చెల్లిస్తోందని వివరించారు.
"2010లో యూపీఏ ప్రభుత్వం పెట్రోల్ ధరలను క్రమబద్దీకరించలేదు. పెరుగుతున్న ధరలను నియంత్రించడానికి, కాంగ్రెస్ 15 సంవత్సరాల మెచ్యూరిటీ ప్లాన్‌తో రూ. 1లక్ష 40 వేల కోట్ల విలువైన ఆయిల్ బాండ్‌లు జారీ చేసింది. 2020 లో ప్లాన్ మెచ్యూరిటీ తీరిన తరువాత మేము తిరిగి కట్టడం ప్రారంభించాము. దీని కోసం ఏటా మేము ఆ మొత్తంతో పాటు.. వడ్డీని కూడా తిరిగి చెల్లిస్తున్నాము. ఏడాదికి ఈ మొత్తం రూ. 20 వేల కోట్లుగా ఉంది.
కేంద్ర ప్రభుత్వం లీటరుకు రూ.32 మాత్రమే వసూలు చేస్తోంది. ఈ మొత్తంతోనే సుమారు 90 కోట్లమంది పేదలు మూడు పూటలా భోజనం చేయగలుగుతున్నారు. ఇంకా 90 కోట్లకు పైగా మందికి ఉచితంగా టీకాలు పంపిణీ చేశాము. గృహనిర్మాణ పథకం కింద లక్షా 17 వేల ఇళ్లను మంజూరు చేశాము.
పెట్రో ఉత్పత్తుల్ని జీఎస్టీ పరిధిలోకి తీసుకువచ్చే విషయాన్ని మండలిలో ప్రస్తావించారు. కానీ రాష్ట్రాలు దీనికి ఓకే చెప్పడానికి సిద్ధంగా లేవు. దీనిపై సంబంధిత ప్రభుత్వాలతో మాట్లాడతాం."