కరోనా వైరస్ డెల్టా ప్లస్ వేరియంట్ వ్యాప్తిపై ఆందోళనలు పెరుగుతున్న నేపథ్యంలో.. ఊరట కలిగించే విషయం చెప్పింది ఇన్స్టిట్యూట్ ఆఫ్ జీనోమిక్స్ అండ్ ఇంటిగ్రేటివ్ బయాలజీ (ఐజీఐబీ). భారత్ సహా విదేశాల్లోనూ డెల్టా ప్లస్(Delta plus variant) ప్రభావం తక్కువగానే ఉందని పేర్కొంది.
"డెల్టాప్లస్ గురించి ఆందోళన చెందనవసరం లేదు. అయితే అప్రమత్తత, నిశిత పర్యవేక్షణ అవసరం. విదేశాల్లో లేదా భారత్‌లోనూ AY.1, AY.2 రకానికి చెందిన వైరస్లు కనిపంచలేదు" అని సీఎస్ఐఆర్-ఐజీఐబీ డైరెక్టర్ డాక్టర్ అనురాగ్ అగర్వాల్.. ఈటీవీ భారత్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో తెలిపారు.
అన్ని టీకాలకు సమర్థంగా
అన్ని వేరియంట్లను ఎదుర్కొగలిగే సామర్థ్యం కరోనా టీకాలకు ఉందని అనురాగ్ పేర్కొన్నారు. "కొవిషీల్డ్ టీకా రెండు డోసులు డెల్టా వేరియంట్లపై ప్రభావవంతంగా పని చేస్తాయని ఇటీవల భారత వైద్యపరిశోధనా మండలి(ICMR) నిర్వహించిన తాజా అధ్యయనంలో వెల్లడైంది. అయితే డెల్టా ప్లస్ వేరియంట్ వేగంగా విస్తరిస్తోందన్న వదంతుల వల్లే మూడోదశ వస్తుందన్న ఆందోళన నెలకొంది" అని వ్యాఖ్యానించారు.
"రెండు డోసులు తీసుకుంటే ఏ వ్యాక్సిన్ అయినా సమర్థంగా పని చేస్తుంది. భవిష్యత్‌లో ఇన్ఫెక్షన్స్ నుంచి రక్షణ కల్పిస్తాయి. ఇది కూడా వ్యక్తుల్లోని యాంటీబాడీ ఉత్పత్తి, కొవిడ్ ప్రవర్తనకు అనుగుణంగా ఉంటుంది" అని ఏసియన్ సొసైటీ ఎమర్జెన్సీ మెడిసిన్ అధ్యక్షుడు డాక్టర్ తమోరిశ్ కోలే పేర్కొన్నారు.