Goa Minister on Fuel Price Hike: పెట్రోల్, డీజిల్ ధరలతో దేశంలోని సామాన్యులు అల్లాడుతుంటే భాజపా మంత్రి ఒకరు ప్రజలకు ఉచిత సలహాలు ఇచ్చారు. పెట్రోల్ ధరలను భరించలేని స్థితిలో ఉంటే విద్యుత్ వాహనాలు కొనుక్కోవాలని గోవా మంత్రి నీలేశ్ కాబ్రల్ సూచించారు. ఇటీవల పెట్రోల్ రేట్లు రోజూ పెరుగుతున్న నేపథ్యంలో ఓ వ్యక్తి మంత్రిని ప్రశ్నించగా.. ఇలా సమాధానం ఇచ్చారు. విద్యుత్ వాహనాలు వాడితే.. పర్యావరణానికీ మంచిదని, డబ్బులు ఆదా చేయొచ్చని చెప్పుకొచ్చారు. గోవాలో ఇటీవల కొలువుదీరిన మంత్రివర్గంలో ప్రజా సంబంధాలు, సంప్రదాయేతర ఇంధన వనరుల శాఖలకు నీలేశ్ ప్రాతినిధ్యం వహిస్తున్నారు.
"పెట్రోల్ ధరలు పెరిగితే మీకేం టెన్షన్? సోలార్ ఎనర్జీ రంగంలో ప్రభుత్వం చాలా పథకాలు తీసుకొచ్చింది. బైక్ కొనుక్కోవాలనుకుంటే ఎలక్ట్రిక్ బైక్ కొని ఉపయోగించండి. ప్రభుత్వం సబ్సిడీలు ఇస్తోంది. ఎలక్ట్రిక్ బైక్ కొంటే మీకు రెండు లాభాలు. పెట్రోల్ బైక్ల వల్ల పర్యావరణానికి కలిగే నష్టం తగ్గుతుంది. మీ జేబుల్లో డబ్బులూ మిగులుతాయి. మన దగ్గర పెట్రోల్, డీజిల్ మాత్రమే పెరుగుతున్నాయి. శ్రీలంకలో అయితే పరిస్థితి ఇంకా తీవ్రంగా ఉంది."
-నీలేశ్ కాబ్రల్, గోవా మంత్రి