దేశంలో పండగ సీజన్ మొదలైన నేపథ్యంలో కొవిడ్ మూడోదశ(third wave in india) వ్యాప్తిపై సర్వత్రా ఆందోళన నెలకొంది. కొవిడ్‌కు అడ్డుకట్ట వేసేందుకు ప్రతి ఒక్కరు త్వరితగతిన టీకా తీసుకోవాలని(covid-19 vaccine) నిపుణులు పిలుపునిస్తున్నారు. అందుకు తగ్గట్టుగానే టీకా పంపిణీ ప్రక్రియ దేశంలో శరవేగంగా సాగుతోంది. అయితే టీకా పంపిణీ పూర్తిస్థాయిలో విజయం సాధించాలంటే ప్రజలు కృషి ఎంతైనా అవసరమంటున్నారు నిపుణులు.
కొందరు రెండో డోసు తీసుకోవడంలో అశ్రద్ధ వహిస్తున్నారు. ఈ నేపథ్యంలో టీకా రెండు డోసుల ఆవశ్యకత ఏంటి? నిర్దేశిత సమయంలో రెండో డోసు తీసుకోకపోతే ఏం చేయాలి?(vaccine second dose effects) అన్న అంశాలపై ఐసీఎమ్ఆర్- ఎన్‌ఐఐఆర్‌ఎన్‌సీడీ(నేషనల్ ఇన్స్టిట్యూట్ ఫర్ ఇంప్లిమెంటేషన్ రీసర్చ్ ఇన్ నాన్-కమ్యూనకబుల్ డిసీజెస్) జోధ్‌పుర్, డైరక్టర్ డా. అరుణ్ కుమార్ శర్మ ఇంటర్వ్యూ ఇచ్చారు. అందులోని ముఖ్య విశేషాలు...
కొవిడ్‌పై రక్షణకు వ్యాక్సిన్ రెండు డోసులు తీసుకోవాల్సిందేనా?
కొవిడ్‌పై పోరుకు కచ్చితంగా రెండు డోసులు తీసుకోవాలి. ఒక్క డోసుతో వైరస్‌పై పోరాడే సామర్థ్యం కొంతమేర వచ్చినా.. ఎన్నో పరిశోధనలు, పరీక్షలు చేసిన అనంతరం రెండు డోసులు తీసుకోవాలని నిర్ణయించారు. రెండు డోసులు తీసుకుంటేనే సామర్థ్యం ఎక్కువగా ఉంటుంది. అందుకే నిర్దేశిత సమయంలో రెండు డోసులు పూర్తిచేసుకోవాలి.
ఒక్క డోసు తీసుకుంటే రక్షణ వస్తుందా?
టీకా ఒక్క డోసుతో యాంటీబాడీలు పాక్షికంగా ఏర్పడతాయి. యాంటీబాడీ టిటర్ టెస్ట్‌లు చేయించుకుంటే యాంటీబాడీల శాతంపై అవగాహన వస్తుంది. ఉదాహరణకు.. ఒక్క డోసుతో 40శాతం యాంటీబాడీలు ఏర్పడితే, మిగిలిన 60శాతం కోసం రెండో డోసును కచ్చితంగా వేసుకోవాల్సిందే. అప్పుడే రోగనిరోధక శక్తి పుర్తిగా ఉంటుంది.
ఇదీ చూడండి:-CoWin certificate: 'కొవిన్'లో త్వరలో కొత్త ఫీచర్
నిర్దేశిత సమయంలో టీకా వేసుకోకపోయినా, అసలు రెండో డోసు వేసుకోవడమే మర్చిపోయినా ఏం జరుగుతుంది?
టీకా తొలి డోసు తీసుకున్న అనంతరం.. రెండో డోసుకు సంబంధించిన వివరాలు తెలిపే విధంగా దేశంలో వ్యాక్సినేషన్ వ్యవస్థను తీర్చిదిద్దారు. రెండో డోసు తీసుకునేంత వరకు పదేపదే నోటిఫికేషన్లు వస్తూనే ఉంటాయి. అయినప్పటికీ ఎవరైనా రెండో డోసును వేసుకోవడం మర్చిపోతే, తొలుత నిపుణులను సంప్రదించాలి. వారి సూచనల మేరకు యాంటీబాడీ పరీక్ష చేయించుకోవాలి. యాంటీబాడీలు లేకపోయినా, వాటి స్థాయి పడిపోయినా.. మళ్లీ మొదటి నుంచి ప్రారంభించాలి. అంటే మళ్లీ మొదటి డోసు వేసుకోవాల్సిందే.
భారత్‌కు బూస్టర్ డోసు అవసరం ఉందా? ప్రస్తుతం ఎన్ని దేశాల్లో బూస్టర్ డోసు ఉంది?
ఈ విషయంపై పరిశోధనలు జరుగుతున్నాయి(booster dose of covid vaccine). దేశంలో టీకా పర్యవేక్షణ బృందం ఎప్పటికప్పుడు దీనిపై పరిశోధనలు చేస్తోంది. ఇప్పటికవరకైతే.. బూస్టర్ డోసు కోసం ఎలాంటి సిఫార్సులు చేయలేదు. అవసరమైతే భవిష్యత్తులో ఓ నిర్ణయం తీసుకోవచ్చు.
రెండో డోసుపై ప్రజలు అశ్రద్ధ వహిస్తే హెర్డ్ ఇమ్యూనిటీని దేశం సాధించడం కష్టమా?
టీకా తీసుకున్న జనాభా శాతం ఎంత ఎక్కువగా ఉంటే.. ఆ ప్రాంతంలో వైరస్ వ్యాప్తి అంత తక్కువగా ఉంటుంది. తద్వారా వైరస్‌కు అడ్డుకట్ట వేయవచ్చు. ప్రజలు అశ్రద్ధ వహిస్తే వారికే ప్రమాదం. వైరస్ సోకే అవకాశాలు అధికంగా ఉంటాయి. దీనితో పాటు వైరస్ మ్యుటేషన్ కూడా పెద్ద సమస్యగా మారుతుంది.
రెండు డోసులు తీసుకున్న తర్వాత కూడా కొవిడ్ నిబంధనలను పాటించాలా?
రెండు డోసుల తర్వాత కూడా నిబంధనలు పాటించాల్సిందే. ఇది మనకోసమే. టీకాతో పాటు కొవిడ్ నిబంధనలతో మనం, మన శరీరానికి రెండింతల రక్షణ ఇస్తున్నట్టు అవుతుంది. రోగనిరోధక శక్తి బలహీనంగా ఉండే వారిలోకి వైరస్ సులభంగా చేరగలుగుతుంది. అందువల్ల రెండు డోసులు తీసుకున్నా, మాస్కులు ధరించాలి. భౌతిక దూరాన్ని పాటించాలి.
వ్యాక్సినేషన్ విషయంలో దేశం దూసుకెళుతోంది. దేశంలో ఇప్పటివరకు 86,01,59,011 టీకా డోసులను (covid vaccination) పంపిణీ చేసినట్లు కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ పేర్కొంది. ఆదివారం ఒక్కరోజే 38,18,362 వ్యాక్సిన్ డోసులను లబ్ధిదారులకు అందించినట్లు తెలిపింది.
ఇదీ చూడండి:-65 ఏళ్లు పైబడిన వారికి బూస్టర్ డోసులు!