కరోనా సోకిన వారు.. కొవాగ్జిన టీకా(covaxin india) ఒక్క డోసు వేసుకుంటే.. అది రెండు డోసులతో సమానమని ఐసీఎంఆర్(icmr covid) అధ్యయనంలో తేలింది. కొవిడ్ సోకని వారు రెండు డోసులు వేసుకుంటే ఉత్పన్నమయ్యే యాంటీబాడీల ప్రతిస్పందనలు.. కొవిడ్ బాధితుల్లో ఒక్క డోసుతోనే వస్తాయని స్పష్టమైంది.
"ఇవి ప్రాథమిక ఫలితాలు మాత్రమే. భారీ స్థాయిలో జనాభాపై ఇంకా అధ్యయనం చేయాల్సి ఉంది. అక్కడ కూడా ఇదే రుజువైతే.. కొవిడ్ బాధితులకు బీబీవీ152(కొవాగ్జిన్ కోడ్‌నేమ్) టీకా సింగిల్ డోసును సిఫార్సు చేయవచ్చు. ఇదే జరిగితే.. టీకాలు ఎక్కువగా అందుబాటులో ఉండి.. అందరికీ లభించే అవకాశం పెరుగుతుంది."
--- ఐసీఎంఆర్.
ఈ అధ్యయనం ఇండియన్ జర్నల్ ఆఫ్ మెడికల్ రీసెర్చ్‌లో శనివారం ప్రచురితమైంది. 2021 ఫిబ్రవరి- మే మధ్యలో చెన్నైలో కొవాగ్జిన్ తీసుకున్న 114 మంది వైద్యులు, ఆరోగ్య కార్యకర్తలపై ఈ అధ్యయనం జరిగింది.
తొలి డోసు తీసుకునే ముందు రోజు, టీకా తీసుకున్న 28వ రోజు, 56వ రోజున యాంటీబాడీల ప్రతిస్పందనలు ఏ విధంగా ఉన్నాయన్న కోణంలో ఈ అధ్యయనం జరిగింది. అనంతరం వైరస్ సోకిన వారిలో యాంటీబాడీల ప్రతిస్పందనలను, కొవిడ్ అంటుకోని వారితో పోల్చిచూశారు. ఇద్దరిని మినహాయిస్తే.. వైరస్ సోకిన అందరిలోనూ ఒకే డోసుతో యాంటీబాడీల ప్రతిస్పందనలు మెరుగ్గా ఉన్నట్టు అధ్యయనంలో వెల్లడైంది.
దేశీయంగా రూపొందించిన తొలి కరోనా టీకా కొవాగ్జిన్ అత్యవసర వినియోగానికి జనవరిలో అనుమతులు లభించాయి. ప్రస్తుతానికి 4-6 వారాల వ్యవధిలో రెండు టీకాలు ఇస్తున్నారు.