తెలంగాణ

telangana

By

Published : Dec 24, 2020, 1:37 PM IST

ETV Bharat / bharat

'మోదీ నిర్ణయాలతో రైతులు రోడ్డున పడ్డారు'

నూతన వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా దిల్లీ సరిహద్దుల్లో రైతులు చట్టబద్దంగానే నిరసనలు తెలుపుతున్నారని కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ అన్నారు. ప్రభుత్వం వెంటనే పార్లమెంటు సమావేశాలు ఏర్పాటు చేసి చట్టాలని ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేశారు. మోదీ రైతుల కోసం కాకుండా కార్పొరేట్ల కోసం పని చేస్తున్నారని రాహుల్ ధ్వజమెత్తారు.

Rahul demands to Withdraw new agricultural laws
వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకరంగా రాష్ట్రపతికి రాహుల్ వినతి పత్రం

నూతన వ్యవసాయ చట్టాలను రద్దు చేసేవరకు అన్నదాతలు తమ ఉద్యమాన్ని ఆపబోరని, ఈ విషయాన్ని ప్రధాని మోదీ అర్థం చేసుకోవాలని కాంగ్రెస్‌ నేత రాహుల్‌ గాంధీ అన్నారు. సాగు చట్టాలపై గురువారం ఆయన రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్‌ను కలిశారు. పార్టీ సీనియర్‌ నేతలు గులాం నబీ ఆజాద్‌, అధీర్‌ రంజన్‌ చౌధురీతో కలిసి రాష్ట్రపతిని కలిసిన రాహుల్‌.. దేశవ్యాప్తంగా సేకరించిన రెండు కోట్ల సంతకాలతో కూడిన వినతిపత్రాన్ని అందజేశారు. సాగు చట్టాలపై జోక్యం చేసుకోవాలని కోరారు. రాష్ట్రపతి భవన్‌ నుంచి బయటకు వచ్చిన అనంతరం రాహుల్‌ మీడియాతో మాట్లాడారు.

రైతుల నిరసనలు చట్టబద్దమే

"సాగు చట్టాలపై రైతులు చట్టబద్ధంగానే నిరసనలు తెలుపుతున్నారు. చట్టాలను వెనక్కి తీసుకునే వరకు వారు దిల్లీ వదిలివెళ్లరు. ఈ విషయాన్ని ప్రధాని మోదీ అర్థం చేసుకోవాలి. వ్యవసాయ రంగంపైనే కోట్ల మంది ఉపాధి ఆధారపడి ఉంది. అలాంటి రంగాన్ని నాశనం చేస్తున్నారు. సాగు చట్టాలను ప్రభుత్వం తప్పుడు పద్ధతుల్లో ఆమోదింపజేసుకుంది. ప్రధాని రైతుల కోసం కాకుండా కార్పొరేట్ల కోసం పనిచేస్తున్నారు. కేవలం ఇద్దరు ముగ్గురు పారిశ్రామికవేత్తల కోసం దేశాన్ని కష్టాల్లోకి నెడుతున్నారు. పెను విధ్వంసానికి దారితీసే నిర్ణయాలు తీసుకుంటున్నారు. ప్రభుత్వ నిర్ణయానికి వ్యతిరేకంగా గళమెత్తే వారిని దేశద్రోహులుగా చిత్రీకరిస్తున్నారు. మోదీ నిర్ణయాలతో కోట్ల మంది జీవితాలు రోడ్డున పడుతున్నాయి. సాగు చట్టాలను వెనక్కి తీసుకోకపోతే దేశం ఇబ్బందుల్లో పడుతుంది. వెంటనే పార్లమెంట్‌ ఉభయ సభలను సమావేశపరిచి చట్టాలను రద్దు చేయాలి"

-రాహుల్ గాంధీ, కాంగ్రెస్​ నేత‌

ఊహల్లోనే ప్రజాస్వామ్యం..

ఇక రాష్ట్రపతి భవన్‌కు ర్యాలీగా బయల్దేరిన కాంగ్రెస్‌ నేతలను పోలీసులు అడ్డుకోవడంపైనా రాహుల్‌ మండిపడ్డారు. "ఈ దేశంలో ప్రజాస్వామ్యానికి చోటులేకుండా పోతోంది. కేవలం ఊహల్లోనే ప్రజాస్వామ్యం మాట వినిపిస్తోంది. వాస్తవంలో ఎక్కడా కన్పించట్లేదు" అని దుయ్యబట్టారు. రాష్ట్రపతిని కలిసేందుకు కేవలం ముగ్గురినే అనుమతించినా.. తాము కోట్లాది మంది సంతకాలను తీసుకెళ్లామని తెలిపారు.

మనకు రాష్ట్రపతిని కలిసే హక్కు లేదా?

అంతకుముందు ఏఐసీసీ హెడ్‌క్వార్టర్స్‌ నుంచి రాష్ట్రపతి భవన్‌కు కాంగ్రెస్‌కు చేపట్టిన ర్యాలీని పోలీసులు అడ్డుకున్నారు. ప్రియాంక గాంధీ సహా పలువురు నేతలను అదుపులోకి తీసుకున్నారు. ఈ సందర్భంగా ప్రియాంక ప్రభుత్వంపై విమర్శలు గుప్పించారు. ప్రజాస్వామ్య దేశంలో ఉన్న మనకు రాష్ట్రపతిని కలిసే హక్కు లేదా అని ప్రశ్నించారు. "రైతుల పట్ల ప్రభుత్వం వివక్షతో వ్యవహరిస్తోంది. ఒక ప్రతిపక్ష పార్టీగా రైతుల ఉద్యమాన్ని ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లే బాధ్యత మాపై ఉంది. రైతుల బాధలను ప్రభుత్వం అర్థం చేసుకోవాలి. అప్పుడే సమస్య పరిష్కారమవుతుంది" అని ఆమె అన్నారు.

ఇదీ చూడండి:ఆగని అన్నదాత ఆందోళన- చట్టాల రద్దే ధ్యేయం

For All Latest Updates

TAGGED:

ABOUT THE AUTHOR

...view details