తెలంగాణ

telangana

ETV Bharat / bharat

Supreme Court: మంత్రి గురించి ప్రధాని చూసుకుంటారు! - వాస్తవాధీన రేఖ

మంత్రుల పనితీరు వ్యవహారాన్ని ప్రధానమంత్రి చూసుకుంటారని తెలిపింది సుప్రీం కోర్టు. అందుకు సంబంధించిన అంశాల్లో న్యాయస్థానాలేమీ చేయలేవని వ్యాఖ్యానించింది.

union minister V K Singh
ప్రధానమంత్రి

By

Published : Jul 2, 2021, 5:00 PM IST

Updated : Jul 2, 2021, 5:14 PM IST

'ఎవరైనా మంత్రి పనితీరు బాగోలేకపోతే, అలాంటి అంశాలను ప్రధానమంత్రి చూసుకుంటారు.. అంతే కానీ, న్యాయస్థానాలు ఏమీ చేయలేవని' భారత అత్యున్నత న్యాయస్థానం పేర్కొంది. ప్రభుత్వ అధికారిక నిర్ణయాలకు వ్యతిరేకంగా ప్రకటనలు చేసి కేంద్రమంత్రి వీకే సింగ్‌.. తన ప్రమాణాన్ని ఉల్లంఘించారని ఆరోపిస్తూ దాఖలైన ప్రజా ప్రయోజన వ్యాజ్యాన్ని (PIL) తోసిపుచ్చిన సందర్భంగా సుప్రీం కోర్టు ఈ విధంగా వ్యాఖ్యానించింది.

కేంద్ర మంత్రిపై చర్యలు తీసుకోవాలని కోరుతూ దాఖలైన పిటిషన్‌ను సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ ఎన్‌వీ రమణ, జస్టిస్‌ ఏఎస్‌ బోపన్న, జస్టిస్‌ హృషికేశ్‌ రాయ్‌లతో కూడిన ధర్మాసనం శుక్రవారం పరిశీలనకు స్వీకరించింది. "ఒక మంత్రి ప్రకటనలు మీకు నచ్చకుంటే.. పిటిషన్‌ వేసి మంత్రినే తొలగించాలని కోరతారా? అని ప్రశ్నించింది. మంత్రి పనితీరు బాగా లేకుంటే, అలాంటి అంశాలను ప్రధానమంత్రి చూసుకుంటారు. అంతేకానీ, న్యాయస్థానాలు ఏమీ చేయలేవు" అని సుప్రీం ధర్మాసనం అభిప్రాయపడింది. అంతేకాకుండా, ఓ శాస్త్రవేత్తైన మీరు మీ శక్తి సామర్థ్యాలను దేశ ప్రయోజనాల కోసం మరోవిధంగా ఉపయోగించండి అని పిటిషనర్‌కు సుప్రీంకోర్టు చురకలంటించింది.

భారత్‌-చైనా సరిహద్దులో వాస్తవాధీన రేఖ(LAC)కు సంబంధించి భారత అధికారిక నిర్ణయానికి వ్యతిరేకంగా కేంద్ర మంత్రి జనరల్‌(రిటైర్డ్‌) వీకే సింగ్‌ ప్రకటన చేశారని ఆరోపిస్తూ తమిళనాడుకు చెందిన చంద్రశేఖరన్‌ రామస్వామి అనే శాస్త్రవేత్త సుప్రీంకోర్టులో ప్రజా ప్రయోజన వ్యాజ్యం దాఖలు చేశారు. అలాంటి ప్రకటనలు కేంద్ర మంత్రిగా బాధ్యతలు స్వీకరించిన సమయంలో చేసిన ప్రమాణాన్ని ఉల్లంఘించడమేనని.. అందుకే ఆయనపై చర్యలు తీసుకునేలా కేంద్ర ప్రభుత్వానికి సూచించాలని సుప్రీం కోర్టును అభ్యర్థించారు. దీనిని పరిశీలించిన సుప్రీంకోర్టు ధర్మాసనం పిటిషన్‌ను కొట్టివేసింది.

Last Updated : Jul 2, 2021, 5:14 PM IST

ABOUT THE AUTHOR

...view details