ఆస్పత్రులకు ఆక్సిజన్ కొరతపై దిల్లీ హైకోర్టు తీవ్రంగా స్పందించింది. ప్రస్తుతం ఆక్సిజన్ సరఫరాకు కేంద్రం తీసుకుంటున్న చర్యలపై అసంతృప్తి వ్యక్తం చేసింది. ఆక్సిజన్ సరఫరాను కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ అధికారులు అడ్డుకున్నట్లు తెలిస్తే ఉరిశిక్ష విధిస్తామని ఆగ్రహం వ్యక్తం చేసింది. ఎవరికైనా ఇదే శిక్ష అని స్పష్టం చేసింది.
ఆక్సిజన్ కొరతపై మహారాజ అగ్రసేన్ ఆస్పత్రి దిల్లీ హైకోర్టును ఆశ్రయించగా, దీనిపై విచారణ చేపట్టిన ధర్మాసనం.. ఆక్సిజన్ సరఫరాకు కేంద్రం మరింత కఠిన చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉందని అభిప్రాయపడింది.
"ఆక్సిజన్ అందించలేకపోవడం నేరపూరిత చర్య. జీవించడం ప్రజల ప్రాథమిక హక్కు. ఆక్సిజన్ సరఫరా విషయంలో అలసత్వం వహిస్తే ఎంత పెద్ద అధికారినైనా ఉపేక్షించేదిలేదు. ఆక్సిజన్ సరఫరాకి ఆటంకం కలిగినట్లు తెలిస్తే క్రిమినల్ చర్యలు తీసుకోవాల్సి ఉంటుంది. ఆ అధికారికి ఉరిశిక్ష విధిస్తాం. ఆక్సిజన్ సరఫరాను అడ్డుకుంటున్న ఘటనను మా దృష్టికి తీసుకురండి. వారికి మేం ఉరిశిక్ష విధిస్తాం. దిల్లీకి 480 మెట్రిక్ టన్నుల ఆక్సిజన్‌ను మీరు(కేంద్ర ప్రభుత్వం) ఎప్పుడు అందిస్తారు? రోజుకు 480 మెట్రిక్ టన్నుల ప్రాణవాయువును దిల్లీకి అందిస్తామని ఏప్రిల్ 21న మాకు హామీ ఇచ్చారు."
-దిల్లీ హైకోర్టు