తెలంగాణ

telangana

ETV Bharat / bharat

పూల మార్కెట్​లో బాంబు, కుక్కర్​లో గ్రెనేడ్- దగ్గరుండి పేల్చేసిన ఎన్​ఎస్​జీ - delhi ied news

IED found at East Delhi: దిల్లీలోని ఓ పూల మార్కెట్​లో బాంబు కనిపించడం కలకలం సృష్టించింది. పోలీసులు అప్రమత్తమై బాంబ్​స్క్వాడ్​కు సమాచారం అందించారు. ఎన్​ఎస్​జీ సిబ్బంది.. దానిని ఎవరికీ హాని కలగని రీతిలో పేల్చేశారు. మరోవైపు, కశ్మీర్​లో గ్రెనేడ్​తో కూడిన ప్రెషర్ కుక్కర్​ను పోలీసులు గుర్తించారు. దాన్ని సురక్షితంగా నిర్వీర్యం చేశారు.

IED found at East Delhi
దిల్లీలో బాంబు కలకలం... 'ఐఈడీ'ని వదిలి వెళ్లిన దుండగులు

By

Published : Jan 14, 2022, 2:42 PM IST

Updated : Jan 14, 2022, 4:16 PM IST

పేలుడు పదార్థాల కలకలం

IED found at East Delhi: గణతంత్ర దినోత్సవానికి కొద్దిరోజుల ముందు దిల్లీలోని గాజీపుర్ పూల మార్కెట్​లో బాంబు లభ్యం కావడం కలకలం రేపింది. ఐఈడీ పదార్థాలతో కూడిన బ్యాగును కొందరు దుండగులు మార్కెట్​లో వదిలి వెళ్లారు. వీటిని గుర్తించిన పోలీసులు బాంబ్​స్క్వాడ్, ఎన్​ఎస్​జీకి సమాచారం అందించారు.

బ్యాగులో ఐఈడీ

Ghazipur Flower market Bomb

స్థానికుల సమాచారంతో అలెర్ట్ అయిన దిల్లీ స్పెషల్ సెల్ పోలీసులు... బాంబ్​స్క్వాడ్, ఎన్​ఎస్​జీకి సమాచారం అందించారు. ముందుజాగ్రత్తగా అగ్నిమాపక వాహనాలను పిలిపించారు. బాంబును స్వాధీనం చేసుకొని నిర్జన ప్రదేశానికి తరలించారు. ఎనిమిది అడుగుల గుంత తవ్వి, అందులో ఐఈడీని పూడ్చి పేలుడు నిర్వహించినట్లు సంబంధిత వర్గాలు తెలిపాయి. పేలుడు అనంతరం భారీ శబ్దం, పొగ వెలువడిందని పేర్కొన్నాయి. బాంబును సకాలంలో గుర్తించడం వల్ల పెను ప్రమాదం తప్పినట్లైంది.

IED in Ghazipur

బాంబు ఎవరు పెట్టారన్న విషయంపై దిల్లీ స్పెషల్ సెల్, ఎన్‌ఎస్‌జీ విచారణ చేపట్టింది. ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు దిల్లీ ప్రత్యేక పోలీసులు తెలిపారు.

మాక్ డ్రిల్ అని చెప్పి...

బాంబును పేల్చేందుకు ఎన్‌ఎస్‌జీ ప్రత్యేక పరికరాలు వినియోగించింది. ప్రజలు ఆందోళన చెందకుండా జాగ్రత్తలు తీసుకుంది. గణతంత్ర దినోత్సవం సమీపిస్తున్న నేపథ్యంలో మాక్ డ్రిల్ నిర్వహిస్తున్నట్లు పేర్కొన్న పోలీసులు.. ఆ తర్వాత బాంబు గుర్తించినట్లు ప్రకటించారు.

బాంబు గురించిన సమాచారం తమకు అందిందని పోలీస్ కమిషనర్ రాకేశ్ అస్థానా తెలిపారు. దాని ఆధారంగా ఐఈడీని రికవరీ చేసినట్లు చెప్పారు. ఐఈడీ నమూనాలను సేకరించినట్లు ఎన్​ఎస్​జీ అధికారి జగదీశ్ మైథని వెల్లడించారు. ఐఈడీలో... ఆర్​డీఎక్స్, అమోనియం నైట్రేట్ ఆనవాళ్లు కనిపించాయని ఎన్​ఎస్​జీ డైరెక్టర్ జనరల్ ఎంఏ గణపతి తెలిపారు. బాంబు నమూనాలను మరింత పరిశోధిస్తున్నట్లు చెప్పారు.

ఐఈడీ బరువు సుమారుగా మూడు కిలోలు ఉందని ఎన్ఎస్​జీ అధికారులు పేర్కొన్నారు. ఉదయం 11 గంటలకు తమకు దిల్లీ పోలీసుల నుంచి సమాచారం అందిందని చెప్పారు. మధ్యాహ్నం 1.30 గంటలకు బాంబును నిర్వీర్యం చేసినట్లు తెలిపారు.

ప్రెషర్ కుక్కర్​లో గ్రెనేడ్..

ప్రెషర్ కుక్కర్

మరోవైపు, జమ్ముకశ్మీర్​లోని శ్రీనగర్​లో ప్రెషర్ కుక్కర్​లో గ్రెనేడ్ అమర్చి వదిలి వెళ్లారు దుండగులు. అనుమానాస్పదంగా ఉన్న ప్రెషర్ కుక్కర్ బ్యాగ్​ను నౌహట్ట ప్రాంతంలోని ఖవ్జాబజార్​లో పోలీసులు గుర్తించారు. వెంటనే బాంబు నిర్వీర్య బృందాలకు సమాచారం అందించారు. తనిఖీల అనంతరం అందులో ఓ గ్రెనేడ్ గుర్తించినట్లు అధికారులు తెలిపారు. సురక్షితంగా దాన్ని నిర్వీర్యం చేశారు.

గ్రెనేడ్​ను పేల్చేసిన బాంబ్ స్క్వాడ్

పంజాబ్​లో ఐదు కేజీల ఐఈడీ...

మరోవైపు, పంజాబ్​లో ఐదు కేజీల ఐఈడీ పట్టుబడింది. డ్రగ్స్ ఉన్నాయన్న సమాచారంతో అట్టారీ-వాఘా సరిహద్దుకు వెళ్లిన పోలీసులకు.. ఐఈడీ కనిపించింది. పేలుడు పదార్థాలతో పాటు రూ.లక్ష నగదును ఓ గ్రామంలో నుంచి స్వాధీనం చేసుకున్నారు. ఇవి పాకిస్థాన్ నుంచే వచ్చాయని అమృత్​సర్ స్పెషల్ టాస్క్​ఫోర్స్ ఏఐజీ రశ్​పాల్ సింగ్ తెలిపారు. దీనిపై దర్యాప్తు చేస్తున్నట్లు స్పష్టం చేశారు.

ఇదీ చదవండి:58 ఏళ్ల తల్లిపై కొడుకు అత్యాచారం- చంపేస్తానని బెదిరించి...

Last Updated : Jan 14, 2022, 4:16 PM IST

ABOUT THE AUTHOR

...view details