ఉత్తర్‌ప్రదేశ్‌లోని వారణాసి నుంచి 100 ఏళ్ల క్రితం చోరీకి గురై.. కెనడా ప్రభుత్వ ఆధీనంలో ఉన్న మాతా అన్నపూర్ణ దేవి విగ్రహాన్ని భారత్‌కు రప్పించింది కేంద్రం. అమ్మవారి విగ్రహాన్ని ఈనెల 15న వారణాసిలోని కాశీ విశ్వనాథుడి ఆలయంలో ప్రతిష్టించనున్నారు. ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి యోగి ఆధిత్యనాథ్ ప్రత్యేక పూజలు నిర్వహించనున్నారు. ఈ విగ్రహం 17 సెంటీమీటర్ల ఎత్తు, 9 సెంటీమీటర్ల వెడల్పు, 4 సెంటీమీటర్ల మందంతో ఉంటుంది.
విగ్రహాన్ని ఉత్తర్‌ప్రదేశ్ ప్రభుత్వానికి బుధవారం అప్పగించింది కేంద్రం. ఈ సందర్భంగా కేంద్ర మంత్రులు కిషన్ రెడ్డి, స్మృతి ఇరానీ, మీనాక్షీ లేఖీ ప్రత్యేక పూజలు నిర్వహించారు.
కెనడా ప్రభుత్వంతో కొన్ని సంవత్సరాలుగా సంప్రదింపులు జరిపి.. విగ్రహాన్ని భారత్‌కు చేర్చినట్లు కేంద్ర పర్యటక శాఖ మంత్రి కిషన్ రెడ్డి తెలిపారు. ప్రధానిగా మోదీ బాధ్యతలు చేపట్టిన నుంచి ఇప్పటి వరకు 42 అరుదైన వారసత్వ కళాకృతులను భారత్‌కు తీసుకొచ్చినట్లు చెప్పారు. విదేశాల్లో 175 విగ్రహాలు, చిహ్నాలు, చిత్రపటాలు ఉన్నట్లు గుర్తించామన్నారు. సింగపూర్, ఆస్ట్రేలియా, స్విట్జర్లాండ్, బెల్జియం వంటి దేశాలతో సంప్రదింపులు జరుపుతున్నామని తెలిపారు. మన సంస్కృతికి నెలవైన విగ్రహాలను తిరిగి మన వద్దకు చేర్చిన మోదీకి దేశ ప్రజల తరఫున కృతజ్ఞతలు తెలుపుతున్నట్లు పేర్కొన్నారు. 18వ శతాబ్దానికి చెందిన అన్నపూర్ణ దేవి విగ్రహాన్ని తిరిగి తమ వద్దకు చేర్చడంపై ఉత్తర్‌ప్రదేశ్ ప్రజలు హర్షం వ్యక్తం చేశారు.