తెలంగాణ

telangana

ETV Bharat / bharat

బంగాల్ దంగల్: అస్థిత్వ పోరాటం- మతతత్వ రాజకీయం - బంగాల్​లో అస్థిత్వ రాజకీయాలు

శాసనసభ ఎన్నికల సమీపిస్తున్న వేళ బంగాల్‌లో రాజకీయ పార్టీలన్నీ అస్థిత్వం కోసం పోరాడుతున్నాయి. విభజన రాజకీయాలకు పాల్పడుతున్నారంటూ ఒకరిపై ఒకరు దుమ్మెత్తిపోసుకుంటూ ఓట్లు కొల్లగొట్టేందుకు ప్రయత్నిస్తున్నాయి. మరోవైపు స్వాతంత్ర్యం అనంతరం తొలిసారిగా బంగాల్‌లో మతతత్వ రాజకీయాలు చూస్తున్నట్లు విశ్లేషకులు చెబుతున్నారు.

IDENTITY POLITICS
బంగాల్ దంగల్: అస్థిత్వ పోరాటం- మతతత్వ రాజకీయం

By

Published : Mar 3, 2021, 6:56 AM IST

అస్థిత్వం కాపాడుకోవడమే ప్రధానంగా బంగాల్‌లో రాజకీయాలు జోరందుకున్నాయి. తన సుధీర్ఘ రాజకీయ చరిత్రలో మునుపెన్నడూ లేని రీతిలో గట్టిపోటీ ఎదుర్కొంటున్న టీఎంసీ అధినేత్రి, ముఖ్యమంత్రి మమతా బెనర్జీ భాజపాను బయటి పార్టీగా ముద్రవేసే ప్రచారాన్ని ఇప్పటికే ప్రారంభించారు. గుజరాత్‌కి చెందిన పార్టీ బంగాల్ ఆత్మగౌరవాన్ని లాక్కునేందుకు ప్రయత్నిస్తోందంటూ ఆ రాష్ట్ర ఓటర్లను ప్రసన్నం చేసుకునేందుకు యత్నిస్తున్నారు. వర్గాల మధ్య, మతాల మధ్య చిచ్చుపెట్టేందుకు భాజపా ప్రయత్నిస్తోందని, భాజపాను సమర్థంగా ఎదుర్కొని బంగాల్ వాసులను ఐక్యంగా ఉంచేది తామేనని తృణముల్ కాంగ్రెస్ ప్రచారం చేస్తోంది.

దీదీ పాలనతోనే: భాజపా

మరోవైపు, బంగాల్‌లో కమ్యూనల్ పోలరైజేషన్(మతపరమైన విభజన) పెరిగిందన్న మాట వాస్తవమన్న భాజపా.. దీదీ పాలనలో కొన్నివర్గాలను మాత్రమే సంతృప్తి పరుస్తూ మెజారిటీ వర్గ ప్రజలకు అన్యాయం చేశారని ఆరోపిస్తోంది. ఫలితంగానే కమ్యూనల్ పోలరైజేషన్ పెరిగిందని చెబుతోంది. టీఎంసీ పాలనలో కులాలు, మతాల మధ్య దాడులు పెరిగాయంటున్న భాజపా... దాడులను అరికట్టడంలో దీదీ సర్కారు విఫలమైందని ఆరోపిస్తోంది. సబ్‌కా సాత్ సబ్‌కా వికాస్ నినాదంతో.... అందరి అభివృద్ధే తమ ధ్యేయమంటోంది.

ఇద్దరూ.. ఇద్దరే: కాంగ్రెస్-లెఫ్ట్

భాజపా, టీఎంసీలు రెండూ విభజన రాజకీయాలను ప్రోత్సహిస్తున్నాయని కాంగ్రెస్, లెఫ్ట్ పార్టీలు ఆరోపిస్తున్నాయి. కమ్యూనల్ కార్డ్ ఆధారంగా రాజకీయ ప్రచారాలు సాగుతున్నప్పటికీ.. నిరుద్యోగం, ఇంధన ధరల పెరుగుదల, అవినీతి వంటి అంశాలు ఎన్నికల్లో ప్రభావం చూపుతాయని వామపక్షాలు విశ్వాసంతో ఉన్నాయి. దీనికితోడు అబ్బాస్ సిద్ధిఖీ నేతృత్వంలోని ఇండియన్ సెక్యులర్ ఫ్రంట్ రంగప్రవేశంతో బంగాల్ రాజకీయ సమీకరణాలు మారిపోయాయి. బంగాల్‌లో మతగురువు నుంచి రాజకీయనేతగా ఎదిగిన సిద్ధిఖీ మతతత్వ గుర్తింపు రాజకీయ ప్రచారాలకు ఆజ్యం పోశారు.

అభివృద్ధి మాట వదిలి..

అయితే, స్వాతంత్ర్యం వచ్చిన నాటి నుంచి ప్రభుత్వ విధానాలు, నిరుద్యోగం, ఆహార భద్రత ప్రాతిపదికన బంగాల్‌లో ఎన్నికలు జరిగాయంటున్న రాజకీయ విశ్లేషకులు.. ఈ దఫా మాత్రమే మతతత్వ రాజకీయాలు నడుస్తున్నాయని చెబుతున్నారు. రాష్ట్ర సామాజిక రాజకీయ చరిత్రను గమనిస్తే విభజన తర్వాత బంగాల్ రాజకీయ చరిత్రలో మతతత్వం ఎలాంటి పాత్ర పోషిస్తుందనే విషయం తెలుస్తుందని పేర్కొంటున్నారు.

బంగాల్ విభజన తర్వాత జరిగిన ఎన్నికల్లో హిందూ అతివాద సంఘాలతో పాటు.. ముస్లిం సంఘాలు సైతం గుర్తించదగ్గ స్థాయిలో ఓట్లను, సీట్లను పొందాయి. 1952లో జరిగిన మొదటి శాసనసభ ఎన్నికల్లో హిందూ మహాసభ, భారతీయ జనసంఘ్ కలిసి 13 సీట్లు సహా మొత్తం ఓట్లలో 8శాతం ఓట్లను సొంతం చేసుకున్నాయి. ఆ తర్వాత 1967 ,1971 ఎన్నికల్లో జనసంఘ్ ఒక్క స్థానానికే పరిమితమైంది. ఇదే సమయంలో ప్రోగ్రెసివ్ ముస్లిం లీగ్ 1969లో 3స్థానాల్లో గెలుపొందగా.. 1972, 1977 ఎన్నికల్లో ఇండియన్ యూనియన్ ముస్లిం లీగ్(ఐయూఎంఎల్)ఒక్కో స్థానంలో గెలుపొందింది. 70 వరకూ ఈ పార్టీలు కొన్ని స్థానాల్లో తమ ప్రభావం చూపుతూ వచ్చినప్పటికీ.. ఎన్నికలు మతాల ప్రాతిపదికన కాకుండా అభివృద్ధి అంశాలు, కేంద్ర,రాష్ట్ర ప్రభుత్వాల విధానాలపై జరిగేవని పరిశీలకులు చెబుతున్నారు.

వామపక్షాల రాకతో

బంగ్లాదేశ్ శరణార్థుల హక్కులపై పోరాడుతూ 1960 ప్రారంభంలో వామపక్షాలు రంగప్రవేశం చేసిన తర్వాత పరిస్థితులు మారిపోయాయని విశ్లేషకులు చెబుతున్నారు. అతివాదశక్తుల ఏకీకరణకు లెఫ్ట్ పార్టీలు ముగింపు పలికాయని పేర్కొన్నారు. విభజన సమయంలో కాంగ్రెస్, హిందూ మహా సభలు రెండూ తమను మోసం చేసాయని బంగ్లాదేశ్ శరణార్థులు, బెంగాలీ ముస్లింలు భావించడం.. వామపక్షాలకు లాభించిందని చెబుతున్నారు. ఆ తర్వాత బంగాల్‌లో మతతత్వ రాజకీయాలకు తావులేకుండా పోయిందని విశ్లేషిస్తున్నారు. వర్గాలు, మతాల మధ్య సమన్వయం సాధించడంలో వామపక్షాలు విజయం సాధించాయని, టీఎంసీ ఆ పని చేయలేకపోయిందని వివరిస్తున్నారు.

ఇదీ చదవండి:దోస్తులతో కలిసి.. కమలం, హస్తం కుస్తీ!

ABOUT THE AUTHOR

...view details