భారత వైద్య పరిశోధన మండలి(ఐసీఎంఆర్) మూడో సారి నిర్వహించిన సెరోసర్వేలో ఆశ్చర్యకర విషయాలు వెల్లడయ్యాయి. దేశ జనాభాలో 24.1 శాతం మంది ఇప్పటికే కరోనా బారినపడినట్లు ఈ సర్వే తేల్చింది. అయితే కేంద్రం ప్రకటించిన గణాంకాలకు, ఐసీఎంఆర్ లెక్కలకు అసలు పొంతన లేదు. దేశంలో 2 శాతం మందికే కరోనా సోకిందని కేంద్ర ఆరోగ్య శాఖ ఇటీవలే వెల్లడించింది.
2020 డిసెంబర్- 2021 జనవరి మధ్య ఐసీఎంఆర్ ఈ సెరోసర్వే నిర్వహించింది. దీని ప్రకారం ఒక్క కరోనా కేసును గుర్తిస్తే 27 మందికి వైరస్ సోకినట్లే అని తెలుస్తోంది. ఆరోగ్య కార్యకర్తలు సహా దేశంలో పదేళ్లు పైబడిన ప్రతి నలుగురిలో ఒకరు వైరస్ కారణంగా ప్రభావితం అయినట్లేనని సర్వే స్పష్టం చేసింది. ఆరోగ్య సిబ్బందిలో 25.6 శాతం మంది కరోనా బారినపడినట్లు పేర్కొంది. గ్రామీణ ప్రాంతాలతో పోల్చితే పట్టణాల్లోనే ఎక్కువ మంది బాధితులున్నట్లు స్పష్టం చేసింది.
యాంటీబాడీలతో..
సెరోసర్వేలో సాధారణ పౌరుల రక్త నమూనాలు సేకరించి IgG యాంటీ బాడీలు ఉన్నాయో లేదో పరీక్షిస్తారు. ఫలితం పాజిటివ్ వస్తే.. ఆ వ్యక్తి అప్పటికే వైరస్ బారినపడినట్లు లెక్క. వైరస్ వ్యాప్తి మొదలైన తర్వాత తొలిసారి 2020 మే-జూన్లో ఐసీఎంర్ సెరోసర్వే చేపట్టింది. అప్పుడు దేశ జనాభాలో 0.73శాతం మందిలోనే యాంటీబాడీలున్నాయి. 2020 ఆగస్టు- సెప్టెంబరులో రెండోసారి సేరోసర్వే నిర్వహించినప్పుడు ఆ శాతం 7.1కి పెరిగింది. తాజాగా 24.1శాతానికి చేరింది.