దేశంలో కరోనా వైరస్ సెకండ్ వేవ్ ఉద్ధృతికి దాదాపు రాష్ట్రాలన్నీ ఆంక్షల బాటపట్టాయి. ఒక్కో రాష్ట్రం ఒక్కో విధమైన ఆంక్షలతో కరోనా వైరస్ వ్యాప్తి కట్టడికి చర్యలు చేపడుతున్నాయి. ఇప్పటికే దేశంలోని దాదాపు అన్ని రాష్ట్రాలు కర్ఫ్యూ, లాక్‌డౌన్ ఆంక్షలు అమలు చేస్తున్నాయి. ఈ నేపథ్యంలో కరోనా పాజిటివిటీ 10 శాతం మించిన జిల్లాల్లో 6 నుంచి 8 వారాల పాటు లాక్‌డౌన్ అవసరమని భారత వైద్య పరిశోధనా మండలి (ఐసీఎంఆర్) సూచించింది. వైరస్ విజృంభణ కొనసాగుతున్న వేళ.. మహమ్మారి కట్టడికి ఎన్ని రోజులు లాక్‌డౌన్ అవసరమనే అంశంపై చర్చ జరుగుతున్న సమయంలో ఐసీఎంఆర్ చీఫ్ సూచనలు ప్రాధాన్యం సంతరించుకున్నాయి.
'అధిక పాజిటివిటీ రేటు ఉన్న జిల్లాల్లో పూర్తి లాక్‌డౌన్ ఉండాల్సిందే. అక్కడ పాజిటివిటీ రేటు 10 నుంచి 5 శాతానికి తగ్గితే ఆంక్షలు సడలించవచ్చు. అలా జరగాలంటే 6 నుంచి 8 వారాల లాక్‌డౌన్ అవసరం' అని ఓ ఇంటర్వ్యూలో ఐసీఎంఆర్ చీఫ్ బలరాం భార్గవ పేర్కొన్నారు. ఈ సందర్భంగా దిల్లీ లాక్‌డౌన్‌ను బలరాం భార్గవ ప్రస్తావించారు. అక్కడ 35 శాతంగా ఉన్న పాజిటివిటీ రేటు ప్రస్తుతం 17 శాతానికి తగ్గిందని.. ఇలాంటి పరిస్థితుల్లో లాక్‌డౌన్‌ను సడలిస్తే పరిస్థితి మరింత తీవ్రంగా ఉంటుందని అభిప్రాయపడ్డారు.
తిరుగుళ్లతో తెచ్చుకుంటున్నారు..
గతంతో పోలిస్తే కరోనా సెకండ్ వేవ్‌లో యువత కొంచెం ఎక్కువగానే అనారోగ్యం పాలవుతున్నారు. ఈ విషయంపై ఐసీఎంఆర్ డీజీ బలరాం భార్గవ స్పందించారు. యువతకు ఎక్కువ సోకడానికి గల రెండు కారణాలను ఆయన వివరించారు. యువత ఎక్కువగా బయట తిరుగుతుండటం వల్ల వారు కరోనాకు లక్ష్యంగా మారుతున్నారని విశ్లేషించారు. దీంతోపాటు దేశంలోని కొత్త వేరియంట్ల ప్రభావం కూడా కారణమని పేర్కొన్నారు. 2020లో కరోనా ఫస్ట్‌వేవ్‌లో వచ్చిన కేసుల్లో 31శాతం మంది 30 ఏళ్ల లోపు యువత ఉండగా.. ఈ సారి అది 32 శాతానికి చేరిందన్నారు.