IAS Officer Abhishek Singh :సస్పెన్షన్‌కు గురైన ఓ ఐఏఎస్ అధికారి సర్వీస్ ఉండగానే తన ఉద్యోగాన్ని వదులుకున్నారు. నటన, మోడలింగ్‌లో ఆసక్తితో ఈ నిర్ణయం తీసుకున్నారు. ఈ విషయాన్ని డిపార్ట్మెంట్ ఉన్నత అధికారులు వెల్లడించారు. దీంతో ప్రస్తుతం ఆ అధికారి నిర్ణయం చర్చనీయాంశంగా మారింది. ఇంతకీ ఆ అధికారి ఎవరంటే..?
ఉత్తర్‌ప్రదేశ్‌కు చెందిన అభిషేక్ సింగ్.. యూపీ కేడర్ 2011 బ్యాచ్‌కు చెందిన ఐఏఎస్ అధికారి. అభిషేక్ సింగ్‌కు ఎప్పటి నుంచో సినిమాలపై మక్కువ. ఇప్పటికే కొన్ని సినిమాలకు పని చేశారు కూడా. ఇకపై ఆ రంగంలో రాణించేందుకే ఆయన రాజీనామా చేశారని సంబంధిత వర్గాలు వెల్లడించాయి.
ఆయన సర్వీసులో అనేక వివాదాలు ఎదుర్కొన్నారు అభిషేక్. అభిషేక్‌ది యూపీ కేడర్ కాగా.. డిప్యుటేషన్‌పై 2015లో దిల్లీకి వెళ్లారు. ఆ వ్యవధిని 2018లో మరో రెండేళ్లకు పెంచారు అధికారులు. అయితే సినిమాలు, మోడలింగ్‌పై ఆసక్తి ఉన్న అభిషేక్.. ఆ సమయంలో మెడికల్ లీవ్ తీసుకొని విధులకు దూరంగా ఉన్నారు. ఈ కారణంగా దిల్లీ ప్రభుత్వం అతడిని.. 2020 మార్చిలో సొంత రాష్ట్రానికి పంపింది. అయినా అభిషేక్ వెంటనే విధుల్లో చేరలేదు. అందుకు సరైన కారణం చెప్పకుండా అభిషేక్.. మూడు నెలల తర్వాత జూన్‌లో విధుల్లో చేరారు.
గుజరాత్ ఎన్నికల డ్యూటీలో సస్పెండ్..
గతేడాది అభిషేక్ గుజరాత్ అసెంబ్లీ ఎన్నికల అబ్జర్వర్‌గా ఎంపికయ్యారు. ఆ బాధ్యతల నిమిత్తం గుజరాత్ వెళ్లిన అభిషేక్.. తానే అబ్జర్వర్ అని తెలిపే ఫొటో ఒకటి ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ చేశారు. దీంతో ఆయనపై వేటు పడింది. ఆయన్ను ఎన్నికల విధుల నుంచి తప్పించింది ఈసీ. ఆ తర్వాత కూడా ఆయన కొన్ని రోజులు ఐఏఎస్ బాధ్యతలు స్వీకరించలేదు. ఇక విధుల్లో నిర్లక్ష్యం వహించారన్న కారణంగా ఈ ఏడాది ఫిబ్రవరిలో అభిషేక్ సస్పెండ్ అయ్యారు. ఇప్పటికీ ఆయనపై సస్పెన్షన్ వేటు ఉన్నట్లు అధికారులు తెలిపారు.