ఓ ఐఏఎస్, ఐపీఎస్.. మహిళ అధికారులిద్దరూ బహిరంగంగానే గొడవకు దిగారు. హోదాను మరిచి.. స్థాయిని కించపరిచే చర్యకు పాల్పడ్డారు. కర్ణాటకలో ఈ ఘటన జరిగింది. ఐపీఎస్ రూప, ఐఏఎస్ రోహిణి సింధూరి అనే ఇద్దరు అధికారులు ఈ ఘటనకు పాల్పడ్డారు. ఐఏఎస్ రోహిణి సింధూరి.. కర్ణాటక మతం, స్వచ్ఛంద సంస్థ శాఖ కమిషనర్‌గా విధులు నిర్వర్తిస్తున్నారు. ఐపీఎస్ డి. రూప.. రాష్ట్ర హస్తకళల అభివృద్ధి సంస్థ మేనేజింగ్ డైరెక్టర్‌గా పనిచేస్తున్నారు.
మహిళా అధికారుల గొడవపై రాష్ట్ర హోం మంత్రి అరగ జ్ఞానేంద్ర సీరియస్ అయ్యారు. ఇలాంటి పనులు మంచివి కావని ఆ ఇద్దరు అధికారులను హెచ్చరించారు. వారిపై తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. అధికారులిద్దరూ నిబంధనలు ఉల్లంఘించారని తెలిపారు. "ఈ ఘటనపై మేము మౌనంగా ఉండలేము. వారిపై చర్యలు తీసుకుంటాం. సాధారణ వ్యక్తుల్లాగా బహిరంగంగానే ఇద్దరూ గొడవకు దిగారు. వ్యక్తిగతంగా వారిష్టం.. కానీ మీడియా ముందు, ప్రజల ముందు ఇలాంటి పద్ధతి సరైంది కాదు. ప్రజల్లో ఐఏఎస్, ఐపీఎస్‌లపై చాలా గౌరవం ఉంటుంది. వీరిద్దరు చేసిన పని.. సివిల్ సర్వీసెస్ అధికారులందరికీ అగౌరవంగానూ, అవమానకరంగానూ ఉంటుంది." అని హోం మంత్రి అరగ జ్ఞానేంద్ర అన్నారు.
IAS రోహిణి సింధూరి వర్సెస్ IPS రూప.. 'సోషల్ వార్'పై హోంమంత్రి సీరియస్ ఎంతో మంది మంచి అధికారులు దేశం కోసం, రాష్ట్రాల కోసం ఎంతో కష్టపడుతున్నారని అన్నారు హోంమంత్రి. కానీ కొందరి ప్రవర్తన అధికారులందరికి చెడ్డ పేరు తీసుకువస్తుందని ఆవేదన వ్యక్తం చేశారు. ఇలాంటి వారిపై చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉందన్నారు. తాను రాష్ట్ర డీఐజీతో, సీఎస్‌తో మాట్లాడానని తెలిపారు. "గతంలోనూ వీళ్ల విభేదాలు గురించి నా దృష్టికి వచ్చింది. వాళ్లకు నేను చెప్పి చూశాను. అయినా వారు ఈ గొడవలను ఆపలేదు." అని ఆయన అన్నారు.
వ్యక్తిగత దూషణలతో..
సోషల్ మీడియాలో రోహిణి సింధూరిపై.. పలు ఆరోపణలు చేశారు రూప. రోహిణికి సంబంధించిన ప్రైవేటు ఫొటోలను సోషల్ మీడియాలో రూప షేర్ చేశారు. వీటిని రోహిణి కొందరు పురుష అధికారులకు పంపించారని ఆరోపించారు. రోహిణి తన పట్ల అనుచితంగా ప్రవర్తించారని అన్నారు. దీనిపై స్పదించిన రోహిణి సింధూరి.. రూపపై అధికారులకు ఫిర్యాదు చేస్తానన్నారు. బాధ్యతాయుతమైన పదవిలో ఉన్న రూప.. వ్యక్తిగత ద్వేషంతోనే తనపై ఇలాంటి వ్యాఖ్యలు చేస్తున్నారని ఆరోపించారు. రూప మానసిక సమస్యతో బాధపడుతున్నారని.. అందుకే ఇలా ప్రవర్తిస్తున్నారని మండిపడ్డారు.
ముఖ్యమంత్రి ఆగ్రహం..
ఘటనపై కర్ణాటక ముఖ్యమంత్రి బసవరాజు బొమ్మై కూడా స్పందించారు. ఇరువురికి షోకాజ్ నోటీసులు ఇవ్వాలని ప్రభుత్వ ముఖ్య కార్యదర్శిని ఆదేశించారు. కాగా, రోహిణి, రూప.. ఒకరిపై ఒకరు రాష్ట్ర సీఎస్‌కు ఫిర్యాదు చేశారు. ఐఏఎస్ రోహిణి సింధూరి.. రాష్ట్ర ప్రభుత్వ ముఖ్య కార్యదర్శి వందిత శర్మను కలిసి.. నాలుగు పేజీల రాతపూర్వక ఫిర్యాదును అందించారు. రూపపై కఠిన చర్యలు తీసుకోవాలని కోరారు. తనపై రూప నిరాధారమైన ఆరోపణలు చేస్తున్నారని రోహిణి సింధూరి అన్నారు. మరోవైపు, రోహిణి సింధూరి అనేక అవినీతి చర్యలకు పాల్పడ్డారని రూప ఆరోపించారు. వాటిపై విచారణ వేగవంతం చేయాలని డిమాండ్ చేస్తూ సీఎస్‌కు ఫిర్యాదు చేశారు.
ఇంతకుముందు కూడా ఈ ఇద్దరు అధికారులు బహిరంగంగా గొడవకు దిగారు. కాగా గతంలో ఐఏఎస్ అధికారి రోహిణీ సింధూరికి.. మరో ఐఏఎస్ అధికారి శిల్పా నాగ్ మధ్య వివాదం జరిగింది. అప్పట్లో కూడా కర్ణాటకలో ఈ అంశం చర్చనీయాశంగా మారింది. వీరి విభేదాలు బదిలీల వరకు సైతం వెళ్లాయి. తాజాగా రోహిణీ సింధూరి మరో వివాదంలో చిక్కుకున్నారు. పూర్తి కథనం కోసం ఇక్కడ క్లిక్ చేయండి