ఐఏఎస్ అధికారి రోడ్లపై కూరగాయలు కొనడమే అరుదు. అలాంటిది రోడ్డు పక్కన కూరగాయాలు విక్రయిస్తూ దర్శనమిచ్చారు ఓ పాలనాధికారి. 'రూ.20కి కిలో టమాటాలు రండి.. కొనండి' అంటూ ఫేస్‌బుక్‌లోనూ పోస్టు పెట్టారు. ఇంతకీ ఎవరాయన అనుకుంటున్నారా?
కూరగాయలు అమ్ముతున్న ఐఏఎస్ అఖిలేశ్ మిశ్రా ఫొటో కథేంటంటే?
ఉత్తర్‌ప్రదేశ్ రవాణా విభాగంలో ప్రత్యేక కార్యదర్శిగా పనిచేస్తున్నారు సీనియర్ ఐఏఎస్ అధికారి అఖిలేశ్ మిశ్ర. రోడ్డు పక్కన ఆయన కూరగాయలు అమ్ముతున్న ఫొటో ఒకటి తన ఫేస్బుక్ పేజీలో కనిపించింది. దీంతో అది వెంటనే సామాజిక మాధ్యమాల్లో వైరల్‌గా మారింది. కలెక్టర్ ఏంటి.. కూరగాయలు అమ్మడమేంటి? అని షాకయ్యారు నెటిజన్లు.
ఆమె అడిగిందని..!
దీంతో ఈ వ్యవహారంపై స్పందించారు అఖిలేశ్ మిశ్ర. ఫొటో నిజమేనని, కానీ తాను కూరగాయలు అమ్మడం వాస్తవం కాదని చెప్పారు.
రోడ్డు పక్కన కూరగాయలు విక్రయిస్తూ "అధికారిక పని నిమిత్తం ప్రయాగ్‌రాజ్ వెళ్లాను. తిరిగి వచ్చే సమయంలో కూరగాయల కోసం దిగాను. ఆ సమయంలో కూరగాయలు అమ్మే ఆవిడ.. తన తన పిల్లాడు ఎటో వెళ్లాడని, తన కోసం చూసి వస్తా అని చెప్పి.. నన్ను తన దుకాణాన్ని కాసేపు చూస్తూ ఉండమని చెప్పింది. దీంతో అక్కడే కూర్చున్నా. ఈ లోపే కొందరు అక్కడికి కొనడానికి వచ్చారు. అది చూసిన నా స్నేహితుడు ఫొటో తీసి నా ఫేస్బుక్లో పెట్టారు" అని అఖిలేశ్ వివరించారు.
ఫొటో పెట్టిన విషయం మొదట తనకు తెలీదని అఖిలేశ్ పేర్కొన్నారు. తర్వాత చూసుకొని పోస్టును డిలీట్ చేసినట్లు చెప్పారు.
ఇదీ చూడండి:ఆ ఐఏఎస్ టాపర్స్ జంట విడిపోయింది!