హెలికాప్టర్ బ్లాక్ బాక్స్ లభ్యం IAF helicoptor black box found: తమిళనాడులో జరిగిన ఆర్మీ హెలికాప్టర్ ప్రమాదానికి కారణమేంటన్న దానిపై పలు రకాల వాదనలు వినిపిస్తున్నాయి. ఈ నేపథ్యంలో హెలికాప్టర్ ప్రమాదస్థలిలో బ్లాక్ బాక్స్ లభ్యమైంది.
వైమానికదళ సిబ్బంది బ్లాక్ బాక్స్‌ను స్వాధీనం చేసుకున్నారు. హెలికాప్టర్ కుప్పకూలిన ప్రాంతానికి 30 అడుగుల దూరంలో బ్లాక్ బాక్స్ లభ్యమైనట్లు తెలుస్తోంది.
ఘటనాస్థలికి వాయుసేన అధిపతి
మరోవైపు, ఈ ప్రమాదంపై వాయువేగంతో దర్యాప్తు జరుగుతోంది. భారత వాయుసేన అధిపతి వీఆర్ చౌదరి.. ఘటనా స్థలాన్ని స్వయంగా పరిశీలించారు. తమిళనాడు డీజీపీ సైలేంద్ర బాబు సైతం ఆయన వెంట వెళ్లారు. తమిళనాడు ఫోరెన్సిక్ సైన్స్ డిపార్ట్మెంట్ బృందం ప్రమాదం జరిగిన ప్రాంతాన్ని సందర్శించింది. ఫోరెన్సిక్ విభాగ డైరెక్టర్ శ్రీనివాసన్ నేతృత్వంలో ఈ బృందం దర్యాప్తు జరుపుతోంది.
బ్లాక్ బాక్స్ కీలకం
హెలికాప్టర్ ప్రమాదానికి గల కారణాలు బ్లాక్ బాక్స్ ద్వారా తెలిసే అవకాశాలు ఉంటాయి. అది పైలట్ల సంభాషణలను రికార్డ్ చేస్తుంది. బ్లాక్ బాక్స్ అనేది నారింజ రంగులో ఉంటుంది. సాధారణంగా ప్రమాద సమయాల్లో మంటలు చెలరేగితే అన్నీ తగలబడిపోయే అవకాశం ఉంది. ఆ సమయంలో నారింజ రంగులో ఉన్న ఈ బ్లాక్ బాక్స్‌ను గుర్తుపట్టేందుకు సులభం అవుతుంది. ఈ బ్లాక్ బాక్స్‌ను ప్రతికూల వాతావరణంలో కూడా దృఢంగా ఉండేలా డిజైన్ చేస్తారు. అధిక ఉష్ణోగ్రతలను తట్టుకునేలా, నీటిలో మునిగినా ఎలాంటి డేటా ధ్వంసం కాకుండా ఉండేలా అన్ని జాగ్రత్త చర్యలతో దీన్ని రూపొందిస్తారు. సీడీఎస్ బిపిన్ రావత్ ప్రయాణిస్తున్న హెలికాప్టర్ ఏ విధంగా ప్రమాదానికి గురైందో విచారణలో బయటపడనుంది. హెలికాప్టర్లో ఎలాంటి సాంకేతిక ఇబ్బందులు ఏర్పడ్డాయో బ్లాక్ బాక్స్‌లో రికార్డైన సమాచారం ద్వారా తెలుసుకోవచ్చు.
ఇదీ చదవండి:హెలికాప్టర్ బ్లాక్ బాక్స్ లభ్యం.. దర్యాప్తు ముమ్మరం