Army chopper crash: భారత చీఫ్ ఆఫ్ డిఫెన్స్ స్టాఫ్ జనరల్ బిపిన్ రావత్ ప్రయాణించిన Mi-17V5 హెలికాప్టర్‌ను రష్యాకు చెందిన సంస్థ తయారుచేసింది. సైనిక బలగాల రవాణా, రక్షణ వంటి కీలక ఆపరేషన్లలో దీన్ని వినియోగిస్తారు. నెలరోజుల వ్యవధిలోనే ఈ హెలికాప్టర్ ప్రమాదానికి గురికావడం ఇది రెండోసారి. ఈ క్రమంలో ఈ చాపర్ భద్రతపై చర్చకు తెరలేసింది.
అత్యంత శక్తిమంతమైనదిగా గుర్తింపు..
Mi-17V5 సిరీస్ మిలిటరీ హెలికాప్టర్.. అత్యంత శక్తివంతమైన, సురక్షితమైనదిగా గుర్తింపు పొందింది. అందుకే వీవీఐపీల పర్యటనలకు దీన్నే వినియోగిస్తున్నారు. ప్రధాని మోదీ తన పర్యటనలకు ఈ చాపర్‌నే ఉపయోగిస్తున్నారు. ఈ హెలికాప్టర్‌కు ప్రత్యేకమైన రక్షణ కవచాలు అమర్చి ఉన్నాయి. ఇంధన ట్యాంక్ నుంచి ఎటువంటి ప్రమాదం జరగకుండా ఏర్పాట్లు చేశారు. సెల్ఫ్ సీల్డ్ ట్యాంక్ పేలి మంటలు వ్యాపించకుండా పాలీయూరేథీన్ అనే సింథటిక్ ఫోమ్ రక్షణగా ఉంటుంది. ఇన్ఫ్రారెడ్ సప్రెసర్లు, జామర్ వంటి ఫీచర్లు ఉన్నాయి. ఇది అత్యధికంగా గంటకు 250కిలోమీటర్ల వేగంతో 580కిలోమీటర్లు ప్రయాణించగలదు. రష్యాకు చెందిన కజాన్ హెలికాప్టర్స్ MI-17V5 సిరీస్ చాపర్‌ను తయారుచేసింది. మధ్యశ్రేణి కిందకు వచ్చే ఈ చాపర్....అత్యాధునిక ఏవియానిక్స్ కలిగి ఉండటంతో ఏ వాతావరణంలోనైనా ప్రయాణించగలదు. అడవులు, సముద్ర జలాలు, ఎడారులపై సురక్షితంగా ప్రయాణించేలా తయారు చేశారు. 36మంది సైనికులను లేదా 4.5టన్నుల లోడ్‌ను తరలించగలదు. పారా కమాండోలను జారవిడిచే సామర్థ్యం కలిగి ఉంది. సహాయకచర్యల్లో కూడా వినియోగించే ఈ చాపర్‌ను.. ప్రస్తుతం సూలూరు ఎయిర్ బేస్ నుంచి నిర్వహిస్తున్నారు.
నెలరోజుల వ్యవధిలోనే రెండోసారి ప్రమాదం
తమిళనాడులో కూలిన Mi-17V5 మిలిటరీ హెలికాప్టర్ ప్రమాదానికి గురికావటం నెలరోజుల వ్యవధిలోని ఇది రెండోసారి. గతనెల 19న అరుణాచల్ ప్రదేశ్‌లో ఈ సిరీస్ చాపర్ కూలింది. అందులో ప్రయాణిస్తున్న 12 మంది మృతిచెందారు. రెండు ఇంజిన్లు కలిగి.. భారీ లోడ్ తీసుకెళ్లే సామర్థ్యం కలిగిన ఈ చాపర్‌ను కార్గిల్ యుద్ధంలో ఉపయోగించారు. MI-8i పాత వర్షన్‌ను.. MI-17గా అభివృద్ధి చేశారు. కార్గిల్ యుద్ధ సమయంలో పాక్ చొరబాటుదారులపై దాడికి ఈ చాపర్‌ను ఉపయోగించారు.