Tamilnadu CM Stalin: రాష్ట్రవ్యాప్తంగా ఉన్న ప్రజాప్రతినిధులు అక్రమాలకు లేదా క్రమశిక్షణారాహిత్య చర్యలకు పాల్పడితే తాను నియంతగా మారి కఠిన చర్యలు తీసుకుంటానని తమిళనాడు సీఎం, డీఎంకే అధ్యక్షుడు స్టాలిన్ హెచ్చరించారు. ఆదివారం జరిగిన ప్రజా ప్రతినిధుల సమావేశంలో ఆయన పాల్గొని ఈ వ్యాఖ్యలు చేశారు. కొత్తగా ఎన్నికైన మహిళా ప్రతినిధులు తమ బాధ్యతలను.. భర్తలకు అప్పజెప్పకుండా స్వతంత్రంగా వ్యవహరించాలని ఆయన సూచించారు. స్థానిక సంస్థలకు ఎన్నికైన ప్రజాప్రతినిధులు.. చట్టానికి కట్టుబడి ప్రజలకు సేవ చేయాలని, ఉల్లంఘించిన వారిపై చర్యలు తప్పవని స్పష్టం చేశారు స్టాలిన్.
"రాష్ట్రంలో డీఎంకే పార్టీ అంత తేలిగ్గా అధికారాన్ని చేజిక్కించుకోలేదు. కోట్లాది మంది పార్టీ కార్యకర్తల నిస్వార్థ కృషి ఫలితంతోనే అధికారంలోకి వచ్చాం. నేను కూడా గత ఐదు దశాబ్దాలుగా చేసిన కృషితోనే ముఖ్యమంత్రి అయ్యాను. 1975-77 ఎమర్జెన్సీ సమయంలో జైలు శిక్ష అనుభవించి, 1989లో శాసనసభ్యుడిగా ఎన్నికయ్యాను. అది మీరు గుర్తుంచుకోండి. ప్రజల కోసం కష్టపడి పనిచేయండి."
-- స్టాలిన్, తమిళనాడు ముఖ్యమంత్రి