Rahul Gandhi: Rahul Gandhi: తనకెన్నడూ అధికారంపై ఆసక్తి లేదని చెప్పారు కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ. తాను పుట్టిందే అధికారం మధ్యలో అని అన్నారు. దిల్లీలో శనివారం 'ది దళిత్ ట్రూత్ అనే' పుస్తకావిష్కరణ కార్యక్రమంలో మాట్లాడిన ఆయన.. యూపీ నేత మాయావతి, ఆర్ఎస్ఎస్లపై విమర్శలు గుప్పించారు.
"అధికారం కోసం పరితపించే రాజకీయ నాయకులున్నారు. వారెప్పుడూ దాని గురించే ఆరాట పడతారు. కానీ, నేను పుట్టిందే అధికారం మధ్య. నిజాయతీగా దానిపై నాకు ఎలాంటి ఆసక్తి లేదు. బదులుగా ఈ దేశాన్ని అర్ధం చేసుకోవడానికి ప్రయత్నిస్తూ ఉంటాను."
-రాహుల్ గాంధీ, కాంగ్రెస్ నేత
మాయవతికి సీఎం పదవి ఆఫర్:ఇటీవలే జరిగిన ఉత్తర్‌ప్రదేశ్ ఎన్నికల సందర్భంగా బీఎస్పీ చీఫ్ మాయావతితో కూటమి కోసం ప్రయత్నించినట్లు చెప్పారు రాహుల్. ఆమెకు సీఎం పదవి ఆఫర్ చేయగా.. కనీసం మాట్లాడేందుకు నిరాకరించారని తెలిపారు. "మాయావతి.. ఎన్నికల పోరు చేయలేదు. కాంగ్రెస్‌పై ప్రభావం పడినా.. యూపీలో దళితుల కోసం గొంతెత్తారు కాన్షీరాం. కానీ ఈసారి మాత్రం దళితుల కోసం మాయావతి నిలబడలేదు. భాజపాకు ఆమె ఆమోదం తెలిపారు. కారణం.. సీబీఐ, ఈడీ, పెగాసస్!" అని రాహుల్ విమర్శించారు.
ఆర్ఎస్ఎస్ చేతుల్లో రాజ్యాంగ సంస్థలు:రాజ్యాంగం.. భారత్‌కు ఆయుధమని, అయితే సంస్థలు లేనిదే దానికి అర్ధం లేదని రాహుల్ గాంధీ అన్నారు. "రాజ్యాంగాన్ని పరిరక్షించుకోవడం గురించి మాట్లాడుతుంటాం. రాజ్యాంగం ఎలా అమలవుతుంది? సంస్థలతో! రాజ్యాంగాన్ని కాపాడుకోవాలంటే ముందు మన సంస్థలను రక్షించుకోవాలి. కానీ, అవన్నీ ఆర్ఎస్ఎస్ చేతుల్లో ఉన్నాయి." అని ఆరోపించారు రాహుల్.
ఇదీ చూడండి:'సీబీఐ ఇప్పుడు పంజరంలో చిలుక కాదు'