Nitish Kumar Vice President: బిహార్ ముఖ్యమంత్రి నితీశ్ కుమార్ కీలక వ్యాఖ్యలు చేశారు. నితీశ్‌ను ఉపరాష్ట్రపతి చేయాలంటూ కొందరు జేడీయూ నేతలు తనతో అన్నట్టుగా భాజపా ఎంపీ సుశీల్‌కుమార్ మోదీ చేసిన ఆరోపణల్ని సీఎం ఖండించారు. ''నేను ఉపరాష్ట్రపతి కావాలనుకున్నట్టు ఓ వ్యక్తి (సుశీల్‌కుమార్ మోదీ) అన్నట్టు మీరు విన్నారు. వాట్ ఏ జోక్. అదంతా అవాస్తవం. అలాంటి కోరికలేమీ నాకు లేవు. రాష్ట్రపతి, ఉపరాష్ట్రపతి ఎన్నికల్లో మా పార్టీ ఎంతగా మద్దతు ఇచ్చిందో వాళ్లు మరిచిపోయారా? నాకు వ్యతిరేకంగా మాట్లాడనివ్వండి.. వాళ్లకు మళ్లీ పదవులొస్తాయి.'' అని వ్యాఖ్యానించారు.
'మేం మంచే చేశాం'..దేశానికి ఏం అవసరమో బిహార్ అదే చేసిందని.. దేశానికి తాము ఒక మార్గాన్ని చూపించామని ఆర్జేడీ నేత, బిహార్ డిప్యూటీ సీఎం తేజస్వీ యాదవ్ అన్నారు. తమ యుద్ధం నిరుద్యోగంపైనేనన్నారు. పేదలు, యువత పడుతున్న బాధలు సీఎం నీతీశ్‌కు తెలుసన్నారు. అందుకే యువత, పేదలకు నెల రోజుల్లోపే భారీగా ఉద్యోగాలు కల్పించనున్నట్టు ప్రకటించారు. మహాకూటమి చాలా బలమైందని.. ప్రతిపక్షంలో భాజపా ఒక్కటే మిగిలిందన్నారు. మతపరమైన ఉద్రిక్తతల్ని వ్యాప్తి చేయడంతో పాటు ప్రాంతీయ పార్టీలను కూడా అంతం చేసేందుకు భాజపా కుట్రలు చేస్తోందని మండిపడ్డారు. జేడీయూ అధినేత నితీశ్ కుమార్ ఎన్డీఏ కూటమితో తెగదెంపులు చేసుకొని మహాకూటమితో కలిసి కొత్త ప్రభుత్వాన్ని ఏర్పాటు చేశారు. నితీశ్ 8వ సారి సీఎంగా, తేజస్వీ రెండోసారి డిప్యూటీ సీఎంగా బుధవారం ప్రమాణస్వీకారం చేశారు.