పుదుచ్చేరి లెఫ్టినెంట్ గవర్నర్‌గా పనిచేయడం వల్ల జీవితకాల అనుభూతి పొందినట్టు కిరణ్ బేడీ వెల్లడించారు. ఈ అవకాశమిచ్చిన భారత ప్రభుత్వానికి కృతజ్ఞతలు చెప్పారు. తనతోపాటు రాజ్‌భవన్‌లో పని చేసిన అధికారులు, సిబ్బందికి ధన్యవాదాలు తెలిపారు. ఈ పదవీకాలంలో తాను పూర్తిగా సంతృప్తి చెందినట్టు.. ప్రజల అవసరాలను తీర్చేందుకు కృషి చేసినట్టు చెప్పుకొచ్చారు బేడీ.
పుదుచ్చేరి లెఫ్టినెంట్ గవర్నర్‌గా ఉన్న కిరణ్ బేడీని.. రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్ మంగళవారం ఆ పదవి నుంచి తొలగించారు. ఆమె స్థానంలో తెలంగాణ గవర్నర్ తమిళిసై సౌందరరాజన్‌కు అదనపు బాధ్యతలు అప్పగించారు.
పదవిని ఎంతో పవిత్రంగా భావించి రాజ్యాంగ బద్ధంగా, నైతికంగా తన కర్తవ్యాలను నెరవేర్చానని కిరణ్ బేడీ అన్నారు. పుదుచ్చేరికి మంచి భవిష్యత్ ఉందని... అది ప్రజల చేతిలోనే ఉందన్నారు. పుదుచ్చేరి ఎల్లప్పుడూ క్షేమంగా ఉండాలని ఆకాంక్షించారు.