తెలంగాణ

telangana

ETV Bharat / bharat

ఆధిపత్య ధోరణిలో భాజపా- ఒత్తిడిలో నితీశ్!

ఎన్నికలు ముగిసినా.. బిహార్​లో రాజకీయ వేడి తగ్గలేదు. అధికార కూటమిలోని పార్టీల మధ్యే విభేదాలు ముదిరిపోతున్నాయి. సీఎం పదవిపై తనకెలాంటి ఆశలు లేవని నితీశ్ ప్రకటించడం చర్చనీయాంశమైంది. ఎన్నో నిర్ణయాలు తీసుకోవాలనుకున్నప్పటికీ భాజపా సహకరించడం లేదని నితీశ్ సన్నిహితులు చెబుతున్నారు. అరుణాచల్ ప్రదేశ్ ఎమ్మెల్యేల వ్యవహారం సహా ఇటీవలి పరిణామాలు ఆయన్ను ఒత్తిడిలో నెట్టిందని విశ్లేషకులు అంటున్నారు.

I had no desire to become the Chief Minister: Nitish
బిహార్ రాజకీయాలు

By

Published : Dec 28, 2020, 1:15 PM IST

బిహార్​లో అధికార ఎన్​డీఏలోని భాజపా, జేడీయూ మధ్య విభేదాలు తీవ్రమవుతున్నట్లే కనిపిస్తోంది. బిహార్​తో పాటు పక్క రాష్ట్రాల్లోని రాజకీయ పరిణామాలు కూటమిలో చిచ్చు పెడుతున్నట్లు తెలుస్తోంది. బిహార్​ సీఎం కుర్చీపై తనకేం ఆశలు లేవని, భాజపాకు నచ్చినవారినే ముఖ్యమంత్రిని చేసుకోవచ్చని నితీశ్ కుమార్ ప్రకటించే స్థాయికి చేరిందంటే.. వివాదం ఎంత తీవ్రమైందో అర్థమవుతోంది.

మరి నితీశ్​ ఈ పరిస్థితుల్లో చిక్కుకోవడానికి కారణాలేంటి? బిహార్​లో ఎన్​డీఏ భవిష్యత్తు ఏంటి? కూటమి ధర్మం ఒకే రాష్ట్రానికి పరిమితం కావడమే ఈ పరిణామాలకు దారితీసిందా? అన్న అంశాలు ఇప్పుడు తెరమీదకు వస్తున్నాయి.

ఒత్తిడిలో నితీశ్

దేశవ్యాప్తంగా భాజపా జెండా రెపరెపలాడుతుండటం.. నితీశ్​ కుమార్​ను ఒత్తిడిలోకి నెడుతున్నట్లు తెలుస్తోంది. బిహార్​ ఎన్నికలు మొదలుకొని.. హైదరాబాద్​, జమ్ముకశ్మీర్​ స్థానిక ఎన్నికల్లో కమలదళం అసాధారణంగా పుంజుకున్న తీరు నితీశ్​కు ప్రతికూలంగా మారింది. సాహసోపేత నిర్ణయాలకు కేరాఫ్​ అడ్రస్​ అయిన నితీశ్​ను నెమ్మదించేలా చేసింది. మరోవైపు, ప్రతిపక్ష ఆర్​జేడీ నేత తేజస్వీ యాదవ్​కు భారీగా ఆదరణ లభించడం, రాష్ట్రంలో మధ్యంతర ఎన్నికలు జరుగుతాయంటూ.. నితీశ్​పై ఎప్పటికప్పుడు మాటల తూటాలు ఎక్కుపెట్టడం ఆయన్ను వెనక్కి తగ్గేలా చేస్తోంది.

ఇదీ చదవండి:భాజపాతో జాగ్రత్త.. నితీశ్​కు ఎంపీ హెచ్చరిక

పార్టీ ఫిరాయింపులు

అరుణాచల్​ప్రదేశ్​లో ఇటీవలి రాజకీయ పరిణామాలు బిహార్​ ఎన్​డీఏలో చర్చనీయాంశంగా మారాయి. జేడీయూకు చెందిన ఆరుగురు ఎమ్మెల్యేలను భాజపా తన పార్టీలోకి చేర్చుకోవడం వివాదాస్పదమైంది. అరుణాచల్​లో జేడీయూకు ఏడుగురు ఎమ్మెల్యేలు ఉంటే.. అందులో ఆరుగురు భాజపాలో చేరారు. బిహార్​లో కలిసి పోటీ చేసి, అధికారంలో ఉన్నప్పటికీ.. ఇలా ఎమ్మెల్యేలను లాక్కోవడంపై జేడీయూ నుంచి వ్యతిరేకత వ్యక్తమైంది. భాజపా కూటమి ధర్మాన్ని పాటించడం లేదంటూ జేడీయూ ప్రధాన కార్యదర్శి కేసీ త్యాగి ధ్వజమెత్తారు. అయితే నితీశ్ సహా ఇతర పార్టీ నేతలు దీనిపై పెద్దగా స్పందించలేదు.

"అరుణాచల్ ప్రదేశ్ వ్యవహారంపై పార్టీ తీవ్ర అసంతృప్తిని, నిరసనను వ్యక్తం చేసింది. కూటమి రాజకీయాలకు ఇవి మంచివి కాదు. వాజ్​పేయీ హయాంలో పాటించిన కూటమి ధర్మాన్ని పార్టీలన్నీ ఆచరించాలి. ప్రభుత్వంలో చేర్చుకోవాలనుకుంటే జేడీయూ ఎమ్మెల్యేలను కేబినెట్​లో చేర్చుకోవాల్సింది. కానీ ఇది కూటమి ప్రాథమిక స్ఫూర్తికి విరుద్ధం."

-కేసీ త్యాగి, జేడీయూ ప్రధాన కార్యదర్శి

నితీశ్​కు ముకుతాడు వేసేందుకే!

అయితే, నితీశ్​తో ఏ విషయంలోనూ రాజీ పడేది లేదని భాజపా పరోక్షంగా సందేశం పంపిస్తోందని విశ్లేషకులు చెబుతున్నారు. తాను విధించిన షరతులతో ప్రభుత్వాన్ని నడపాలని నిర్ణయించుకున్నట్లు స్పష్టం చేస్తోందని అంటున్నారు. నితీశ్​ను కట్టడి చేసేందుకే భాజపా ఇలా చేస్తోందని విశ్లేషిస్తున్నారు.

"ఇది జేడీయూపై భాజపా చేసిన సర్జికల్ స్ట్రైక్ అని చెప్పాలి. కమలదళం నితీశ్​ను అన్ని రకాలుగా నియంత్రించాలనుకుంటోంది. భాజపాకు వ్యతిరేకంగా నితీశ్ దూకుడుగా వ్యవహరిస్తే ఇదే ఎపిసోడ్(అరుణాచల్ ప్రదేశ్​లో ఎమ్మెల్యేల చేరిక) బిహార్​లోనూ రిపీట్ అవుతుందని చెప్పాలని అనుకుంటోంది."

-లలన్ సింగ్, రాజకీయ నిపుణులు, పట్నా

ఈ ఏడాది బిహార్ అసెంబ్లీకి జరిగిన ఎన్నికల్లో భాజపా 74 స్థానాలు గెలుచుకోగా.. జేడీయూ 43కు పరిమితమైంది. 31 సీట్లు తేడా ఉన్న కారణంగా.. రెండు ఉప ముఖ్యమంత్రి పదవులతో పాటు మెజారిటీ మంత్రి పదవులను భాజపాకు ఇవ్వాల్సి వచ్చింది. బిహార్ అసెంబ్లీ స్పీకర్ పదవిని సైతం భాజపా దక్కించుకుంది. ఈ నేపథ్యంలో భాజపాకు అనుకూలంగానే వ్యవహరించాల్సిన పరిస్థితి నితీశ్​కు ఎదురవుతోంది.

మరోవైపు, ఖాళీగా ఉన్న గవర్నర్ కోటా సీట్లకు అభ్యర్థుల ఎంపిక విషయంలోనూ నితీశ్ ఒత్తిడిలో ఉన్నట్లు తెలుస్తోంది. నితీశ్ అనేక నిర్ణయాలు తీసుకోవాలని అనుకుంటున్నప్పటికీ.. భాజపా అనుమతించడం లేదని ఆయనకు సన్నిహితులు చెబుతున్నారు. రాజకీయ విశ్లేషకులు సైతం నితీశ్ నిస్సహాయంగా మారారని అంటున్నారు. అయితే ఈ నిస్సహాయత నితీశ్​కే పరిమితం కాదని స్పష్టం చేస్తున్నారు.

"భాజపా, జేడీయూ ఒకరికొకరు అవసరం. నిస్సహాయత నితీశ్ ఒక్కరిదే కాదు భాజపాది కూడా. జేడీయూ సీట్లు తగ్గాయి కాబట్టి ఆ పార్టీ నిస్సహాయత స్పష్టంగా కనిపిస్తోంది. అయితే భాజపాకు ప్రత్యామ్నాయం లేదు. నితీశ్​ను పూర్తిగా విస్మరించే అవకాశం లేదు. అనివార్యంగా వీరిరువురు కలిసి సాగాల్సిందే."

-డీఎం దివాకర్, రాజకీయ నిపుణులు

అయితే నితీశ్ ఒత్తిడిలో ఉన్నారన్న విషయాన్ని జేడీయూ నేతలు తోసిపుచ్చుతున్నారు.

"నితీశ్​పై ఎలాంటి ఒత్తిడి లేదు. బిహార్ ప్రజలకు, మీడియాకు ఈ విషయం బాగా తెలుసు. 15 ఏళ్ల పాటు ఆయన ప్రభుత్వాన్ని నడిపించారు. అలాంటి వ్యక్తిపై ఒత్తిడి ఎందుకు ఉంటుంది? మహాకూటమి​లో ప్రతికూల పరిస్థితులు ఎదురైతే.. బయటకు వచ్చేందుకు ఒక్కసారి కూడా ఆలోచించలేదు. ఒత్తిడితో రాజకీయాలు ఎప్పుడూ చేయలేదు."

-సంజయ్ ఝా, జేడీయూ నేత

మరోవైపు, నితీశ్​కు ఎలాంటి అవరోధాలు కలిగించడం లేదంటూ భాజపా చెప్పుకొచ్చింది. ప్రభుత్వ కార్యకలాపాలు సజావుగా జరిగేలా సహకరిస్తున్నామని భాజపా ప్రతినిధి ప్రేమ్ రంజన్ పటేల్ స్పష్టం చేశారు. అరుణాచల్​ ప్రదేశ్ ఎమ్మెల్యేల వ్యవహారాన్నీ తక్కువ చేసి చూపించారు.

"అరుణాచల్ ప్రదేశ్ వ్యవహారం జేడీయూతో సంబంధాలను దెబ్బతీయదు. ఆ ఎమ్మెల్యేలు పార్టీని మారలేదు. ఒకే ఇంట్లో ఉండే వ్యక్తులు పక్క గదికి మారిపోయారంతే. ఇలాంటివి బిహార్​లో జరగవు."

-డా. రామ్ సాగర్ సింగ్, భాజపా ప్రతినిధి

నితీశ్ పేరుతోనే బిహార్ ఎన్నికలకు వెళ్లామని, ఆయనకే ప్రజలు ఓటేశారని భాజపా నేత సుశీల్ కుమార్ మోదీ స్పష్టం చేశారు. జేడీయూ, భాజపా, వీఐపీ నేతల అభ్యర్థన మేరకు సీఎం పదవిని ఆయన స్వీకరించాలని పేర్కొన్నారు.

మధ్యంతర ఎన్నికలు..!

అయితే ఈ పరిణామాలను గమనిస్తున్న విపక్ష ఆర్జేడీ.. కూటమిపై వాగ్బాణాలు సంధిస్తోంది. ఎన్​డీఏలో అంతర్గత కుమ్ములాటలు ఉన్నాయని నొక్కిచెబుతోంది. జేడీయూతో పాటు భాజపాలోనూ అభద్రతా భావం ఉందని, ఇది తీవ్రమైన ఘర్షణగా మారి మధ్యంతర ఎన్నికలకు దారితీసే అవకాశం ఉందని అంచనా వేస్తోంది.

"భాజపా నుంచి అవమానాలు ఎదుర్కొని తనను తాను నాశనం చేసుకోవాలని నితీశ్ ఎందుకు భావిస్తున్నారో అర్థం కావట్లేదు. మహాకూటమిలో ఆయనకు దక్కిన గౌరవం ఎన్​డీఏలో దొరకడం లేదు. భాజపా వలలో ఆయన చిక్కుకున్నారు. అందులో నుంచి నితీశ్ బయటపడాలి. పదవికి రాజీనామా చేసి సీఎం కుర్చీని తేజస్వీ యాదవ్​కు అప్పగించాలి."

-భాయ్ బీరేంద్ర, ఆర్జేడీ ఎమ్మెల్యే

భాజపా పాలిత రాష్ట్రాలు తీసుకొస్తున్న లవ్​ జిహాద్ చట్టాలకు వ్యతిరేకంగా జేడీయూ నేతలు మాట్లాడటం కూడా ప్రస్తుతం చర్చనీయాంశంగా మారింది. వివాదాస్పద మతమార్పిడి వ్యతిరేక చట్టం సమాజానికి మంచిది కాదంటూ కేసీ త్యాగి వంటి నేతలు హితవు పలికారు. కాగా.. బిహార్​లో కూటమిగా ఉన్న భాజపా, జేడీయూ.. పక్క రాష్ట్రాలకు వచ్చే సరికి వేర్వేరుగా పోటీ చేయడం కూడా వీరి మధ్య విభేదాలకు కారణమని తెలుస్తోంది. బంగాల్​ అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేయాలన్న జేడీయూ ప్రకటన సైతం దీదీ సర్కార్​ను గద్దె దించాలని లక్ష్యంగా పెట్టుకున్న భాజపాకు రుచించడం లేదని సమాచారం. బంగాల్​లో జేడీయూకు పెద్దగా సీట్లు రాకపోయినా.. ఓట్లు చీల్చడం మాత్రం ఖాయం. ఇది భాజపాకే ప్రతికూలంగా మారుతుందని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.

ఇదీ చదవండి:బంగాల్ బరిలో జేడీయూ- భాజపాపై ప్రభావమెంత?

ABOUT THE AUTHOR

...view details