తన సిద్ధాంతాలపై ఎట్టి పరిస్థితుల్లోనూ రాజీ పడే ప్రసక్తే లేదని అన్నారు కాంగ్రెస్ నేత నవజ్యోత్ సింగ్ సిద్ధూ(Sidhu news). పీసీసీ అధ్యక్ష పదవికి మంగళవారం రాజీనామా చేసిన సిద్ధూ తొలిసారి స్పందించారు. ప్రజల జీవితాలు మార్చేందుకు రాజకీయాల్లోకి వచ్చినట్లు స్పష్టం చేశారు. పంజాబ్లో సమస్యలపై(Sidhu news) సుదీర్ఘకాలంగా పోరాడానని, పోరాడుతూనే ఉన్నానని తెలిపారు.
''ఎవరితోనూ వ్యక్తిగత వైరం లేదు. 17 సంవత్సరాల నా రాజకీయ జీవితం.. ఒక ప్రయోజనం కోసం, వైవిధ్యం చూపేందుకు, ఒక స్టాండ్ తీసుకోవటానికి, ప్రజల జీవితాలను మెరుగుపరచడానికి. ఇదే నా అభిమతం. నా సూత్రాలకు నేను కట్టుబడి ఉంటా.''
- నవజ్యోత్ సింగ్ సిద్ధూ, కాంగ్రెస్ నేత
వారికి పదవులు ఎలా ఇస్తారు?
పంజాబ్ డీజీపీ, అడ్వకేట్ జనరల్ల నియామకంపైనా ప్రశ్నలు సంధించారు. ఆరేళ్ల క్రితం మాజీ సీఎం ప్రకాశ్ సింగ్ బాదల్ కుటుంబానికి అవినీతి కేసులో క్లీన్‌చిట్ ఇచ్చిన వ్యక్తిని తీసుకువచ్చి న్యాయాన్ని అందించే పదవి ఇచ్చారని పరోక్షంగా ఆరోపించారు. 'నా తుదిశ్వాస వరకు నిజం కోసమే పోరాడతాను' అని అన్నారు. అవినీతి మరకలు అంటిన నేతల్ని ప్రభుత్వంలోకి అనుమతించబోమని వ్యాఖ్యలు చేశారు.
ముఖ్యమంత్రి.. చన్నీ తన కేబినెట్‌లో చేర్చుకున్న మంత్రుల విషయంలో ఆయన అసంతృప్తిగా ఉన్నట్లు తెలుస్తోంది.
ముఖ్యమంత్రిగా కెప్టెన్ అమరీందర్ సింగ్ (Amarinder singh Sidhu) రాజీనామా చేసిన కొద్దిరోజులకే.. పీసీసీ చీఫ్ పదవి నుంచి తప్పుకున్నారు సిద్ధూ.
మరికొందరు..
పంజాబ్లో పలువురు మంత్రులు, కీలక నేతలు సిద్ధూ బాటలోనే నడుస్తున్నారు. పీసీసీ చీఫ్ పదవికి రాజీనామా చేస్తున్నట్లు సిద్ధూ (Navjot Singh Sidhu resignation) ప్రకటించిన నేపథ్యంలో.. పలువురు నేతలు సైతం తమ పదవులను వదులుకున్నారు. రెండు రోజుల క్రితం మంత్రిగా ప్రమాణస్వీకారం చేసిన రజియా సుల్తానా సైతం.. తన పదవికి రాజీనామా చేశారు.