అసోంలో మహాజోత్ కూటమి అబద్ధాలు అందరికీ తెలిసిపోయాయని ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ విమర్శించారు. అసోంలో ఎన్డీఏ కూటమే మరోసారి అధికారం చేపడుతుందని ధీమా వ్యక్తం చేశారు. అసోం వాసుల గుర్తింపును అవమానపరిచిన వారిని ఇక్కడి ప్రజలు ఏ మాత్రం సహించరని వ్యాఖ్యానించారు. తాముల్పుర్లో భాజపా.. ఎన్నికల ప్రచార సభలో ఆయన పాల్గొన్నారు. ఎలాంటి వివక్షలేకుండా తాము ప్రజల కోసం పనిచేస్తామని పేర్కొన్నారు. కానీ ఓటు బ్యాంకు కోసం దేశాన్ని కొంతమంది విడదీస్తారని అన్నారు.
"నాకున్న రాజకీయ అనుభవం, ప్రజల ప్రేమ ఆధారంగా.. ఎన్డీఏ కూటమిని గెలిపించాలని అసోం వాసులు ఎప్పుడో నిర్ణయం తీసుకున్నారని చెప్పగలను. అసోం ప్రజల గుర్తింపును అవమానపరిచిన వారిని, హింసను ప్రోత్సహించేవారిని ఇక్కడి ప్రజలు ఏ మాత్రం సహించరు. మేం అందరి కోసం పని చేస్తాం. కానీ దేశాన్ని ఓటు బ్యాంకు కోసం కొంతమంది విభజిస్తారు. దాన్నే దురదృష్టవశాత్తు లౌకికవాదం అంటున్నారు. కానీ, మాది మతతత్వం అంటున్నారు. ఈ మతతత్వం, లౌకికతత్వాల వల్ల దేశానికి తీరని నష్టం వాటిల్లింది."