కరోనా మహమ్మారిని అంతం చేయాలని భారత్, అమెరికా నిశ్చయించుకున్నాయని, అందుకోసం ఇరు దేశాలు కలిసికట్టుగా పనిచేయనున్నాయని తెలిపారు అగ్రరాజ్య విదేశాంగ మంత్రి ఆంటోని బ్లింకెన్. కొవిడ్‌ను అంతం చేసేందుకు ఇరు దేశాలు ప్రపంచానికి నాయకత్వం వహిస్తాయనే నమ్మకం ఉందన్నారు.
రెండు రోజుల దిల్లీ పర్యటనలో భాగంగా భారత విదేశాంగ మంత్రి జైశంకర్‌తో పాటు ఉన్నతాధికారులతో సమావేశమయ్యారు బ్లింకెన్. ఈ సందర్భంగా ఇరుదేశాల సంబంధాలపై కీలక వ్యాఖ్యలు చేశారు.
" భారత్‌కు మరోమారు రావటం చాలా సంతోషంగా ఉంది. 40 ఏళ్ల క్రితం నా కుటుంబంతో కలిసి వచ్చాను. అమెరికా, భారత్‌తో పోలిస్తే.. ఇలాంటి సంబంధాలు ప్రపంచంలోని ఇతర దేశాల మధ్య చాలా తక్కువగా ఉన్నాయి. అమెరికా, భారత్ ప్రపంచంలోనే అతిపెద్ద ప్రజాస్వామ్య దేశాలు. వైవిధ్యం అనేది మన దేశాల బలం. కొవిడ్-19 అమెరికా, భారత్‌ను తీవ్రంగా దెబ్బతీసింది. వైరస్ తొలినాళ్లలో భారత్ అందించిన సాయాన్ని ఎప్పటికీ మరిచిపోలేం. అదే రీతిలో భారత్‌కు తిరిగి సాయం చేయటం పట్ల గర్వపడుతున్నాం. "
- ఆంటోని బ్లింకెన్, అమెరికా విదేశాంగ మంత్రి.
అఫ్గాన్‌తోనే ఉన్నాం..
అఫ్గానిస్థాన్‌తో పాటు ప్రాంతీయ భద్రతపై చర్చించినట్లు చెప్పారు బ్లింకెన్. శాంతి, సురక్షితమైన, స్థిరమైన అఫ్గాన్ కోసం కృషి చేయాలని ఇరు దేశాలు అంగీకరించాయన్నారు. ఒక విలువైన భాగస్వామిగా అఫ్గాన్ అభివృద్ధి, స్థిరత్వం కోసం భారత్ కీలకంగా మారుతుందని తెలిపారు. అఫ్గాన్ నుంచి బలగాల ఉపసంహరణ పూర్తయిన తర్వాత కూడా ప్రాంతీయ స్థిరత్వం కోసం మద్దతుగా ఉంటామన్నారు. ఆ దేశంలో తమ కార్యకలాపాలు కొనసాగుతాయని స్పష్టం చేశారు. తాలిబన్లు రెచ్చిపోతున్నట్లు సమాచారం ఉందని, అది తీవ్రమైన సమస్యలకు దారి తీస్తోందని ఆందోళన వ్యక్తం చేశారు బ్లింకెన్. అయితే.. ఇప్పటికీ అఫ్గాన్‌తోనే ఉన్నామని పునరుద్ఘాటించారు.
క్వాడ్ కీలకం..
క్వాడ్ అనేది చాలా ముఖ్యమైనదన్నారు బ్లింకెన్. ప్రజల జీవితాలను ప్రభావితం చేసే ముఖ్యమైన అంశాలను పరిష్కరించేందుకు నాలుగు ఒకే ఆలోచన కలిగిన దేశాలు ఏకతాటిపైకి వచ్చాయన్నారు. క్వాడ్ ముఖ్య ఉద్దేశం స్వేచ్ఛాయుత ఇండోపసిఫిక్గా మార్చటమేనని స్పష్టం చేశారు. క్వాడ్ అనేది సైనిక కూటమి కాదని.. ఈ ప్రాంతంలో శాంతి, శ్రేయస్సు, స్థిరత్వం కోసం అంతర్జాతీయ నిబంధనలు పాటిస్తూ ప్రాంతీయ సవాళ్లను అధిగమించేందుకు ఏర్పడినదేనని వెల్లడించారు.
ఇదీ చూడండి:భారత్‌కు చేరుకున్న అమెరికా విదేశాంగ శాఖ మంత్రి