Kodi kathi attack case latest updates on Jagan: జగన్‌పై కోడికత్తితో దాడి కేసులో జాతీయ దర్యాప్తు సంస్థ (ఎన్‌ఐఏ) తాజాగా దాఖలు చేసిన అఫిడివిట్‌లో పలు ప్రశ్నలకు సమాధానాలు లభించినా.. ఇంకా అనేక కీలకాంశాలు మిస్టరీగానే ఉన్నాయి. జగన్‌కు ప్రజల్లో సానుభూతి కల్పించేందుకే దాడి చేశానని, ఆయన సీఎం అవ్వాలనేదే తన ఉద్దేశమని నిందితుడు శ్రీనివాసరావు తన వాంగ్మూలంలో చెప్పారు. అయినా.. ఆయనంతట ఆయనే దాడి చేశారా..? దీని వెనుక జగన్‌ను ఎలాగైనా అధికారంలోకి తీసుకురావాలనుకున్న శక్తులు, వ్యక్తుల ప్రోద్బలం ఏమైనా ఈ దాడి వెనుక ఉందా..? అనేది ఇంకా నిగ్గుతేలాలి. ఈ నేపథ్యంలో ఎన్‌ఐఏ అన్ని కోణాల్లో సమగ్ర దర్యాప్తు చేస్తేనే అసలు గుట్టు బయటపడుతుంది.
జగన్ మోహన్ రెడ్డిపై విశాఖపట్నం ఎయిర్‌పోర్టులో జరిగిన దాడికి ముందు, ఆ తర్వాత చోటుచేసుకున్న పలు నాటకీయ పరిణామాలను విశ్లేషిస్తే గనుక.. ఇప్పటికీ అనేక అనుమానాలు తలెత్తుతూనే ఉన్నాయి. విశాఖ విమానాశ్రయంలో దాడి జరిగిన 10 నుంచి 15 నిమిషాల వ్యవధిలో అపోలో క్లినిక్ వైద్యురాలు డాక్టర్ కోట్యాడ లలిత స్వాతి.. జగన్‌కు ప్రథమ చికిత్స చేశారు. 0.5 సెంటీమీటర్ల పొడవు, 0.5 సెంటీమీటర్ల లోతున గాయమైనట్లు తేల్చి.. ఒక కుట్టు అవసరం పడొచ్చని చెప్పి.. డ్రసింగ్ చేసి కట్టు కట్టారు. జగన్ విశాఖ నుంచి హైదరాబాద్‌కు వెళ్లి అక్కడ సిటీ న్యూరో సెంటర్‌లో చేరిన తర్వాత ఆ గాయానికి డిబ్రిడ్మెంట్ చేపట్టారు.
దీంతో 3.5 సెంటీమీటర్ల లోతు, 1 సెంటీమీటర్ పొడవు, 0.5 సెంటీమీటర్ల పొడవున గాయం విస్తీర్ణం పెరిగింది. వైద్య అవసరాల రీత్యానే డిబ్రిడ్మెంట్ చేశారా..? మరేదైనా కారణం ఉందా..? అనేది నిగ్గు తేల్చాలి. సిటీన్యూరో సెంటర్‌లో తనకు చికిత్స అందించిన డాక్టర్ సాంబశివారెడ్డిని జగన్ అధికారంలోకి రాగానే.. ఏపీ మెడికల్ కౌన్సిల్ ఛైర్మన్‌గా, ఆ తర్వాత ఆరోగ్య శ్రీ ట్రస్టు వైస్ ఛైర్మన్‌గా నియమించారు.
మరోవైపు 2019 సార్వత్రిక ఎన్నికల్లో జగన్‌కు లబ్ధి కలిగించేందుకే ఆయనపై దాడి చేసినట్లు నిందితుడు శ్రీనివాసరావు వాంగ్మూలం ద్వారా తేలిపోయింది. అతను వైఎస్‌కి, ఆయన మరణించిన తర్వాత జగన్‌కు వీరాభిమాని అనే విషయం స్పష్టమైంది. జగన్‌కు ప్రజల్లో సానుభూతి కల్పించేందుకే కోడికత్తితో దాడి చేశానని, ఈ చర్య వల్ల జనమంతా జగన్‌కు ఓట్లేస్తారని తద్వారా ఆయన సీఎం అవ్వాలనేదే తన ఉద్దేశమని వాంగ్మూలంలో స్పష్టం చేశారు. దాడి సమయంలో నిందితుడు శ్రీనివాసరావు వద్ద లభించిన 11 పేజీల లేఖలో కూడా ఆయన అప్పటి సీఎం చంద్రబాబు పరిపాలనను తప్పుపడుతూ, జనసేన అధ్యక్షుడు పవన్ కల్యాణ్‌ను విమర్శిస్తూ, జగన్‌పైన అభిమానం చాటుకుంటూ రాసిన అంశాలున్నాయి.
రేషన్ దుకాణాల్లో రేషన్ తీసుకోవాలంటే సామాన్య ప్రజలు రెండ్రోజుల పాటు కూలి పనులు మానుకోవాల్సి వస్తోందని, దివ్యాంగులు, వృద్ధులు పింఛన్లు తీసుకోవటానికి ఇబ్బందులు పడుతున్నారని రాశారు. వారికి అంగన్‌వాడీ కార్యకర్తల ద్వారా పింఛను అందే ఏర్పాట్లు చేయాలని లేఖలో ప్రస్తావించగా.. జగన్ అధికారం చేపట్టిన తర్వాత పింఛను, రేషన్ ఇంటికే అందిస్తున్నారు. నిందితుడు శ్రీను.. తన వద్దనున్న కత్తితో ఒక్కసారిగా తన (జగన్) మెడపై దాడి చేసేందుకు ప్రయత్నించాడని, దీంతో తాను వెంటనే అప్రమత్తమై వెనక్కి వాలటంతో ఆ కత్తి తన ఎడమ భుజం పైభాగంలో గుచ్చుకుందని ఆనాడు జగన్ ఎన్‌ఐఏకి ఇచ్చిన వాంగ్మూలంలో తెలియజేశారు.