Deodorant Adds: మహిళలపై లైంగిక దాడులను ప్రేరేపించేలా ఉంటున్న వాణిజ్య ప్రకటనలకు అడ్డుకట్ట వేయడంపై కేంద్ర ప్రభుత్వం దృష్టి సారించింది. తమ తమ సామాజిక మాధ్యమ వేదికల నుంచి అటువంటి ప్రకటనలను తొలగించాలంటూ కేంద్ర సమాచార, ప్రసార మంత్రిత్వశాఖ శనివారం ట్విట్టర్, యూట్యూబ్‌లకు లేఖలు రాసింది. కొన్ని పరిమళ ద్రవ్యాల(పర్‌ఫ్యూమ్స్) ప్రకటనలు సామూహిక అత్యాచారాల సంస్కృతిని పెంచేలా ఉంటున్నాయని, వాటిని తొలగించాలని సూచించింది. మర్యాద, నైతికతలను దెబ్బతీసేలా మహిళలను చిత్రీకరిస్తున్న ఆ వీడియోలు మీడియా నియమాలను ఉల్లంఘించడం కిందికే వస్తాయని లేఖల్లో పేర్కొంది.
కొన్ని పరిమళ ద్రవ్యాల ప్రకటనలపై సామాజిక మాధ్యమాల వినియోగదారులు సైతం పెద్దఎత్తున ఆగ్రహం వ్యక్తం చేస్తున్న విషయాన్ని కేంద్ర మంత్రిత్వశాఖ గుర్తు చేసింది. 'అనుచితంగా, అవమానకరంగా ఉంటున్న దుర్గంధ నాశిని (డీవోడరెంట్) ప్రకటన ఒకటి సామాజిక మాధ్యమాల్లో చక్కర్లు కొడుతోంది. ఈ ప్రకటనను తక్షణం తొలగించాలని కేంద్ర మంత్రిత్వశాఖ కోరింది' అని ఆ శాఖ అధికార ప్రతినిధి వెల్లడించారు. అడ్వర్టయిజ్‌మెంట్ స్టాండర్డ్స్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా (ఏఎస్‌సీఐ) సైతం ప్రకటనల తీరుపై ఓ కన్నేసి ఉంచాలని, మార్గదర్శకాలకు విరుద్ధంగా ఉన్నవాటిని తక్షణ ప్రాతిపదికన ఉపసంహరించుకునేలా ప్రకటనకర్తలను కోరాలని కేంద్ర మంత్రిత్వశాఖ తన లేఖలో పేర్కొంది. ఈ సూచనకు ఏఎస్‌సీఐ సానుకూలంగా స్పందించింది.