దేశంలోని ఇతర మత నిర్మాణాలకూ నిధులు సేకరించినప్పుడు.. అయోధ్యలో నిర్మిస్తున్న రామమందిరానికి విరాళం ఇస్తానని వాఖ్యానించారు కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి ప్రియాంక గాంధీ భర్త, ప్రముఖ వ్యాపారవేత్త రాబర్ట్ వాద్రా. ఒకరోజు ఆధ్యాత్మిక యాత్ర చేపట్టిన ఆయన.. జైపుర్లోని ప్రసిద్ధ మోతీ డుంగరీ ఆలయాన్ని సందర్శించారు. తాను లౌకికవాదినని.. దేశ ప్రజలు ప్రశాంతంగా మతసామర్యంతో జీవించాలని ఆకాంక్షిస్తున్నట్లు పేర్కొన్నారు వాద్రా.
చర్చి, మసీదు, గురుద్వారాల నిర్మాణాలకు విరాళాలు సేకరించినప్పుడే.. అయోధ్య నిర్మాణానికీ విరాళం ఇస్తానని ఉద్ఘాటించారు.
'ప్రభుత్వం కఠినంగా వ్యవహరిస్తుంది'
సాగు చట్టాలకు వ్యతిరేకంగా నిరసన చేస్తున్న రైతుల నిరసనపై స్పందించిన రాబర్ట్.. "దేశంలో ఎన్నో సమస్యలు ఉన్నాయి. రెండు నెలలకుపైగా అన్నదాతలు నిరసనలు నిర్వహిస్తున్నారు. అయితే వారి పట్ల ప్రభుత్వం కఠిన వైఖరి అవలంబిస్తోంది." అని ఆరోపించారు.