జమ్ము కశ్మీర్ హైదర్‌పొరాలో జరిగిన ఎన్‌కౌంటర్‌పై (Hyderpora encounter news) స్థానికంగా వివాదం చెలరేగుతోంది. ఎన్కౌంటర్లో చనిపోయిన (hyderpora killings) ఇద్దరు పౌరులు కుటుంబ సభ్యులు తమకు న్యాయం చేయాలని నిరసనకు దిగారు. తమ కుటుంబీకుల మృతదేహాలను తిరిగి ఇచ్చేయాలని డిమాండ్ చేశారు.
ఎన్‌కౌంటర్‌కు వ్యతిరేకంగా ఆందోళన నిరసనల నేపథ్యంలో రాంబన్ జిల్లాలో (Hyderpora Incident) సెక్షన్ 144 అమలు చేస్తున్నారు. గుంపులుగా తిరగడంపై నిషేధం విధించారు. బుధవారం ఉదయం 9 గంటల నుంచి తదుపరి ఆదేశాలు వచ్చే వరకు ఆంక్షలు అమలులో ఉంటాయని రాంబన్ జిల్లా అదనపు మేజిస్ట్రేట్ హర్బన్స్ లాల్ శర్మ తెలిపారు. అవాంఛనీయ ఘటనలు (hyderpora kashmir) జరగకుండా చూసేందుకే ఆంక్షలు అమలు చేస్తున్నట్లు స్పష్టం చేశారు.
ముఫ్తీ నిరసన
పౌరుల మృతికి వ్యతిరేకంగా పీడీపీ అధ్యక్షురాలు మెహబూబా ముఫ్తీ (Mehbooba Mufti news) సైతం నిరసనలో పాల్గొన్నారు. కశ్మీర్లో సాయుధ దళాల ప్రత్యేక అధికారాల చట్టం(ఏఎఫ్ఎస్పీఏ) అమలులో ఉన్నందున.. అమాయకుల మరణాల విషయంలో జవాబుదారీతనం లేకుండా పోయిందని విమర్శించారు. పీడీపీ నేతలు, కార్యకర్తలు సైతం ముఫ్తీతో పాటు నిరసనలో పాల్గొన్నారు. పౌరుల మరణాలకు వ్యతిరేకంగా ప్లకార్డులు ప్రదర్శించారు.
నిరసనలో పాల్గొన్న ముఫ్తీ.. "మృతుల కుటుంబ సభ్యులు తమ బంధువుల శవాలను ఇవ్వాలని డిమాండ్ చేస్తూ నిరసన చేస్తున్నారు. ఈ ప్రభుత్వం ప్రజలను హత్య చేసి వారి శవాలను కూడా అప్పగించడం లేదు. గాంధీ, నెహ్రూ, అంబేడ్కర్ నడయాడిన ఈ దేశాన్ని వారు(భాజపా) గాడ్సే దేశంగా మార్చాలని అనుకుంటున్నారు. ఇంతకంటే నేనేం చెప్పగలను?"
-మెహబూబా ముఫ్తీ, పీడీపీ అధినేత్రి
'ఎల్జీ చొరవ తీసుకోవాలి...'
మరోవైపు, జమ్ము కశ్మీర్ లెఫ్టినెంట్ జనరల్ మనోజ్ సిన్హా ఈ విషయంలో కల్పించుకోవాలని నేషనల్ కాన్ఫరెన్స్ అధినేత ఫరూక్ అబ్దుల్లా కోరారు. మృతదేహాలను కుటుంబ సభ్యులకు అప్పగించేలా చూడాలని పేర్కొన్నారు. పౌరుల మరణంపై దర్యాప్తు జరపాలని డిమాండ్ చేశారు.
'మానవతా దృక్ఫథంతో చేయాల్సిన పని...'
నేషనల్ కాన్ఫరెన్స్ ఉపాధ్యక్షుడు ఒమర్ అబ్దుల్లా సైతం ఎన్‌కౌంటర్‌ను ఖండించారు. 'భవనంలోకి వెళ్లే ముందు అల్తాఫ్, గుల్‌ను తమతో పాటు తీసుకెళ్లినట్లు పోలీసులు తెలిపారు. వారి ద్వారా తలుపులు తెరిపించారు. అలాంటప్పుడు వీరిని ఉగ్రవాదులని ఎలా చెబుతున్నారు? అపాయంలోకి నెట్టడం వల్లే వారు మరణించారు. వారు ఉగ్రవాదులని ముద్రవేయడం చాలా దారుణం. వారి శవాలను బలవంతంగా తీసుకెళ్లి అంత్యక్రియలు నిర్వహించడం నేరం. మృతదేహాలను కుటుంబ సభ్యులకు అప్పగించాలి. మానవతా దృక్ఫథంతో చేయాల్సిన కనీస పని ఇది' అని ట్విట్టర్లో పేర్కొన్నారు.
ఏం జరిగిందంటే?
సోమవారం జరిగిన ఎన్కౌంటర్లో ఓ పాకిస్థాన్ ఉగ్రవాదితో పాటు అతడి అనుచరుడు మహమ్మద్ ఆమిర్‌ను బలగాలు హతమార్చాయి. వారితో పాటు ఉన్న అల్తాఫ్ భట్, ముదాసిర్ గుల్ సైతం ఎదురుకాల్పుల్లో ప్రాణాలు కోల్పోయారు. వీరంతా హైదర్‌పొరాలో ఓ అక్రమ కాల్‌సెంటర్, ఉగ్ర శిబిరాన్ని నిర్వహిస్తున్నారని పోలీసులు చెబుతున్నారు.
అల్తాఫ్, ముదాసిర్ కుటుంబ సభ్యులు మాత్రం ఈ వాదనను వ్యతిరేకిస్తున్నారు. వారిద్దరూ అమాయకులని అంటున్నారు. తమ కుటుంబ సభ్యుల మృతదేహాలను అప్పగించాలని డిమాండ్ చేస్తున్నారు. అయితే, శాంతి భద్రతల సమస్యను దృష్టిలో ఉంచుకొని ఎన్కౌంటర్లో మరణించిన నలుగురికి కుప్వారా జిల్లాలోని హంద్వారా ప్రాంతంలో అంత్యక్రియలు నిర్వహించినట్లు పోలీసులు స్పష్టం చేశారు.
కేంద్ర హోంశాఖ కీలక ఆదేశాలు!
మరోవైపు, జమ్ముకశ్మీర్‌లో పౌరులపై ఉగ్రదాడుల నేపథ్యంలో కేంద్ర హోంశాఖ.. ఎన్ఐఏకు కీలక ఆదేశాలు జారీ చేసింది. ముష్కరుల కోసం పనిచేసే ఓవర్ గ్రౌండ్ వర్కర్లపై కఠినంగా వ్యవహరించాలని స్పష్టం చేసింది. నార్త్ బ్లాక్‌లో సమావేశం నిర్వహించిన కేంద్ర హోంశాఖ కార్యదర్శి అజయ్ భల్లా.. ఉగ్ర కేసుల విచారణను సైతం వేగవంతం చేయాలని ఆదేశించారు.
యువతను తమలో చేర్చుకునేందుకు ఉగ్రవాదులు అనుసరిస్తున్న మార్గాలపై సమావేశంలో చర్చించారు. జమ్ము కశ్మీర్ డీజీపీ దిల్బాగ్ సింగ్, ఇంటెలిజెన్స్ చీఫ్ రష్మీ రంజన్ స్వైన్.. కేంద్ర పాలిత ప్రాంతంలో పరిస్థితులపై ప్రజెంటేషన్ ఇచ్చారు. ఎన్ఐఏ/సీఆర్పీఎఫ్ డీజీ, బీఎస్ఎఫ్ డీజీ సైతం సమావేశానికి హాజరయ్యారు.
ఇదీ చదవండి:'లఖింపుర్' కేసు దర్యాప్తు పర్యవేక్షణకు సుప్రీం చర్యలు