Rain Problems in Hyderabad :అల్పపీడనం ప్రభావంతో హైదరాబాద్‌లో ఆకాశం ఒక్కసారిగా మేఘావృతమైంది. కుండపోతగా వర్షం కురిసింది. విధులు ముగించుకుని ఇళ్లకు వెళ్లే సమయంలో వానపడడంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. వర్షపునీరు రహాదారులపై ప్రవహించడంతో వాహనదారులకు ఇక్కట్లు తప్పలేదు. గంటల కొద్దీ నిలిచిపోయిన ట్రాఫిక్‌తో బారులు తీరారు. పలుచోట్ల చెట్లు విరిగిపడటంతో విద్యుత్ సరఫరా నిలిచిపోయింది.
Massive Traffic Jam in Hyderabad :హైదరాబాద్‌లో వరుణుడు ఉగ్రరూపం దాల్చాడు. విధులు ముగించుకుని ఇళ్లకు వెళ్లే సమయంలో భారీవర్షం కురవడంతో ప్రజలు నానాఅవస్థలు పడ్డారు. భారీ వర్షానికి లోతట్టు ప్రాంతాలు జలమయం కాగా డ్రైనేజీలు పొంగిపొర్లాయి. వర్షపు నీటితో రహదారులు.. చెరువులను తలపించాయి. ఒకవైపు వర్షం.. మరోవైపు ట్రాఫిక్ రద్దీతో నగరవాసుల బాధలు వర్ణణాతీతం. వర్షపు నీరు రహాదారులపై ప్రవహిస్తుండటంతో రాకపోకలకు అంతరాయం కలిగి వాహనాలు బారులు తీరాయి. కిలోమీటర్ల మేర ట్రాఫిక్ స్తంభించిపోగా ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడ్డారు.
Hyderabad Rains Problems for Motorists : కొద్దిపాటి జల్లులతో మొదలైన వర్షం కుంభవృష్టిగా మారడంతో.. ముందుకెళ్లే అవకాశం లేక ప్రజలు నానాయాతన పడ్డారు. రాయదుర్గం, హైటెక్‌సిటీ, మాదాపూర్ ప్రాంతాల్లో.. ట్రాఫిక్ పరిస్థితిని గమనించిన సైబరాబాద్ సీపీ స్టీఫెన్ రవీంద్ర స్వయంగా రంగంలోకి దిగారు. ఐకియా కూడలి వద్ద వాహనదారులకు సూచనలిస్తూ ట్రాఫిక్ విధులు నిర్వర్తించారు. తార్నాక నుంచి హబ్సిగూడ, జూబ్లిహిల్స్ చెక్ పోస్ట్ నుంచి ఎన్టీఆర్ భవన్, పంజాగుట్ట మార్గంలో ట్రాఫిక్ జామ్ అయ్యింది. ఖైరతాబాద్- పంజాగుట్ట, బేగంపేటపై వంతెన, క్యాంపు ఆఫీస్, రాణీగంజ్, బహదూర్‌పురా, మైత్రివనం కూడలి, నల్లకుంట, మలక్ పేట నుంచి ఎంజీబీఎస్ మార్గాల్లో భారీగా వాహనాల రాకపోకలు నిలిచిపోయాయి. ఆ మార్గంలో వెళ్లే ప్రయాణికులు తీవ్ర ఇబ్బంది పడ్డారు. వర్షానికి మెట్రో స్టేషన్ల కింద తలదాచుకునేందుకు రోడ్లపై వాహనాలు నిలపగా ట్రాఫిక్ సమస్యలు తలెత్తాయి. పోలీసులు రంగంలోకి దిగి ఎక్కడికక్కడ వాహనాల రద్దీని క్రమబద్దీకరించారు.