Hyderabad Rains Updates :హైదరాబాద్ నగరవాసులు వర్షాకాలంలో నరకయాతన అనుభవిస్తున్నారు. దాదాపు కోటిన్నర మంది నివస్తిస్తున్న భాగ్యనగరంలో వర్షకాలంలో కనీస సదుపాయాలు లేక జనాలు ఇబ్బందులు పడుతున్నారు. ఏళ్ల నుంచి వర్షాల సమయంలో ఎందరో నగరవాసులు మ్యాన్ హోల్స్‌లోపడి ప్రాణాలు కోల్పోవడంతో పాటు గాయాలపాల ఘటనలు అనేకం ఉన్నాయి. వర్షాలు ప్రాణాలతో చెలగాటం ఆడుతున్నా గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ అధికారులు మాత్రం నిమ్మకు నీరెత్తనట్లు వ్యవహరిస్తున్నారు. వర్షాలు పడిన సందర్భంలో హాడావుడి చేసి మమ అనిపిస్తున్నారు.
హైదరాబాద్‌లో వర్షకాలంలో ఇబ్బందులు రాకుండా చూసేందుకు ప్రత్యేకంగా స్ట్రేటజిక్ నాలాల అభివృద్ధి పథకం తీసుకొచ్చారు. దీనికి ఏటా వందల కోట్ల రూపాయలు వెచ్చిస్తున్నా చిన్న వర్షాలకే జలమయమయ్యే ప్రాంతాలు ఏ మాత్రం తగ్గట్లేదు. నగరం పూర్తి కాంక్రీట్ జంగల్‌గా మారిపోయింది. ఎక్కడ చిన్న చినుకు పడినా భూమిలోకి ఇంకే పరిస్థితి లేదు. మురుగు కాలువలు ఉన్నట్లే వాన నీరు వెళ్లేందుకు ప్రత్యేకంగా కాలువలు నిర్మించాల్సి ఉంది. హైదరాబాద్‌లో మొత్తం 9013 కిలోమీటర్ల రోడ్లు ఉన్నాయి. వరద నాలాలు మాత్రం 1302 కిలోమీటర్లే ఉన్నాయి. మురుగు నీటి పైపు లైన్లు 10 వేల కిలోమీటర్లు ఉన్నాయి.
Hyderabad Rain Problems :మురుగు నీటి పైపు లైన్లు ఉన్నంత వరకు వరద నాలాలు నిర్మిస్తేగాని వరద సమస్య తగ్గేట్టు లేదు. ఈ సమస్య పరిష్కారానికి కృషి చేయకపోవడం.. జీహెచ్ఎంసీ ఇంజినీరింగ్ విభాగం నిర్లక్ష్యంగా కనిపిస్తోంది. వారం రోజులుగా బల్దియా కంట్రోల్ రూంకు అందుతున్న ఫిర్యా దులే నిర్లక్ష్యానికి నిదర్శనంగా కనిపిస్తోంది. ఇప్పటికి జీహెచ్ఎంసీ కంట్రోల్ రూం, జీహెచ్ఎంసీ డీఆర్ఎఫ్ విభాగానికి, ఆల్‌లైన్ ద్వారా, డయల్ 100 ద్వారా ఇలా మొత్తంగా 560 చోట్ల రోడ్లపై నీరు నిలిచిందని ఫిర్యాదులు అందాయని అధికారులు చెబుతున్నారు. నాలా పక్కనే ఉన్నా వర్షం పడితే మైత్రీవనం కూడలిలో మోకాల్లోతులో నీరు నిలుస్తోంది.
రూ.30వేల కోట్లతో వ్యూహాత్మక రహదారులు:వర్షాలకు మూసీనది పొంగి ప్రవహిస్తుంటే అత్తాపూర్, చాదర్ ఘాట్, మూసారంబాగ్ వంతెనలు నీటమునుగుతున్నాయి. రూ.30వేల కోట్లతో వ్యూహాత్మక రహదారుల అభివృద్ధి కార్యక్రమం పేరుతో నగర వ్యాప్తంగా రోడ్ల అభివృద్ధికి బల్దియా నడుం బిగించింది. ఈ ప్రాజెక్టులో భాగంగా తొలుత అయ్యప్ప సొసైటీ కూడలిలో అండర్ పాస్ నిర్మించింది. కానీ, వానొస్తే ఆ అండర్ పాస్ మొత్తం వరద చేరుతోంది. అందులోంచి వాహనాలు వెళ్లే పరిస్థితి లేకుండా పోతోంది. లింగంపల్లి రైల్వే స్టేషన్, కేపీహెచ్‌బీ రైల్వేస్టేషన్ల వద్దనున్న ఆర్యూబీల వద్ద కూడా నీరు చేరడంతో ప్రమాదకర పరిస్థితి నెలకొంటోంది.